Share News

A lot of change! ఎంతో మార్పు!

ABN , Publish Date - Jul 19 , 2025 | 12:07 AM

A lot of change! శృంగవరపుకోట వ్యవసాయశాఖ డివిజన్‌లో కొత్తవలస, శృంగవరపుకోట, వేపాడ, లక్కవరపుకోట, జామి మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో 20 సంవత్సరాల కిందటి వరకు వరి, వేరుశెనగ పంటలు పుస్కలంగా పండేవి.

A lot of change! ఎంతో మార్పు!
విస్తారంగా పెంచుతున్న సరుగుడు తోటలు

ఎంతో మార్పు!

ఏటా తగ్గుతున్న వరి, వేరుశెనగ పంటల విస్తీర్ణం

సరుగుడు తోటలపై రైతుల మక్కువ

తాటిపూడి, రైవాడ నీరు అందకపోవడమే కారణమా?

భూములు నిస్సారమైపోతాయని శాస్త్రవేత్తల ఆందోళన

ఎస్‌.కోట నియోజకవర్గంలో సాగులో అనేక మార్పులు వస్తున్నాయి. 20 సంవత్సరాల కిందట వరి, వేరుశెనగ పంటలు విస్తృతంగా పండేవి. వీటి ఆధారంగా గ్రామాల్లో చిన్న చిన్న రైస్‌ మిల్లులు, మండల కేంద్రాల్లో పదుల సంఖ్యలో నూనె మిల్లులు నడిచేవి. ఎంతో మంది ఆధారపడి జీవనం సాగించేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. ఈ పంటలకు బదులు రైతులు సరుగుడు మొక్కలు వేస్తున్నారు. కారణం ఏమంటే తాటిపూడి, రైవాడ నీరు అందడం లేదని, వరి.. వేరుశెనగ కలిసిరావడం లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితి వల్ల భూములు నిస్సారమైపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

కొత్తవలస, జూలై 18(ఆంధ్రజ్యోతి):

శృంగవరపుకోట వ్యవసాయశాఖ డివిజన్‌లో కొత్తవలస, శృంగవరపుకోట, వేపాడ, లక్కవరపుకోట, జామి మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో 20 సంవత్సరాల కిందటి వరకు వరి, వేరుశెనగ పంటలు పుస్కలంగా పండేవి. దిగుబడి బాగా వచ్చేవి. వర్షాలు సకాలంలో లేక నేడు ఆ పరిస్థితి లేదు. మరోవైపు రైవాడ, తాటిపూడి రిజర్వాయర్‌లు ఉన్నా ఉపయోగం లేదనేది రైతుల వాదన. విశాఖ వాసుల తాగునీటి అవసరాల కోసమే ఈ రిజర్వాయర్‌లు ఉన్నాయని, పంటల సాగుకు చుక్కనీరు సరఫరా చేయడం లేదంటున్నారు. సకాలంలో వర్షాలు పడక పంటలు పండుతాయనే గ్యారెంటీ లేక సరుగుడు తోటలు వేసుకుంటున్నామంటున్నారు. కొత్తవలస, వేపాడ, శృంగవరపుకోట మండలాల్లో ఉండే నూనె మిల్లులు పూర్తిగా మూతపడగా గ్రామాల్లో ఉండే చిన్న రైస్‌ మిల్లులు సైతం మూతపడుతున్నాయి. ఒకప్పుడు కొత్తవలస మండలంలో సుమారు 15 వరకు నూనె మిల్లులు ఉండేవి. ఇప్పుడు తెరమరుగయ్యాయి. ప్రతిసంవత్సరం సాగు వీస్తీర్ణం తగ్గిపోతోంది. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ప్రస్తుత సంవత్సరం శృంగవరపుకోట సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఐదు మండలాలలో 17950 హెక్టార్లలో మాత్రమే వరినాట్లు వేసే భూములుగా గుర్తించారు. 20 సంవత్సరాల కిందట ఈ సంఖ్య 30 నుంచి 35 వేల హెక్టార్లకు ఉండేది. పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కొత్తవలస మండలంలో కేవలం 890 హెక్టార్లలో మాత్రమే వరినాట్లు వేసే అవకాశం ఉందని గుర్తించారు. ఇంతవరకు సరైన వర్షాలు లేక పోవడంతో ఈ సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉందంటున్నారు. ఇక వేపాడ మండలంలో 3546 హెక్టార్లు, లక్కవరపుకోట మండలంలో 3604 హెక్టార్లు, శృంగవరపుకోట మండలంలో 3991 హెక్టార్లు, జామి మండలంలో 5320 హెక్టార్లలో వరినాట్లు వేయొచ్చునని అంచనా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈసాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది.

సరుగుడు తోటలపై దృష్టి

వరి, వేరుశెనగ పంటలు పండక పోవడంతో రైతులు సరుగుడు తోటల పెంపకంపై దృష్టి పెట్టారు. సరుగుడు మొక్కలను వేసుకుని ఆరు నెలల పాటు జాగ్రత్తగా కాపాడుకుంటే ఐదు సంవత్సరాల తర్వాత ఒకేసారి గ్యారెంటీ ఆదాయం వస్తోంది. దీంతో ఈ ఐదు మండలాలలోను చాలా మంది రైతులు సరుగుడు తోటలను పెంచుతున్నారు. వీటిని కటింగ్‌ చేసిన తరువాత ఒడిశాలోని రాయగడ పేపర్‌ మిల్లుకు సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం కొత్తవలస మండలంలో ప్రత్యేకంగా మూడు కాటాలను ఏర్పాటు చేశారు. రైతులు నేరుగా కాటాలకు సరుగుడు తోటను కొట్టి పంపించి కాటాలో తూనిక వేసుకుంటున్నారు. ప్రస్తుతం టన్ను కర్ర ధర రూ.6 వేల నుంచి 7 వేల వరకు పలుకుతోంది. కొద్ది నెలలు కిందట టన్ను రూ.10 వేల వరకు ధర పలికింది. దీంతో రైతులు తమకు ఉన్న భూములలో సరుగుడు తోటలను వేసుకుని కూలి పనులకు విశాఖవంటి నగరాలకు వలస వెళ్లి పోతున్నారు. వరి, వేరుశెనగ వంటి పంటలకు నీరు ఉండాలని, సాగునీరు ఇవ్వడం లేదని, భూములను ఖాళీగా ఉంచుకోలేక ఇలా చేస్తున్నామంటున్నారు.

కొత్తవలసలో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది

బానులత, ఏడీ, వ్యవసాయశాఖ

కొత్తవలస మండలంలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఈ మండలంలో రియల్‌ఎస్టేట్‌ వెంచర్లతో పాటు సరుగుడు తోటల పెంపకం ఎక్కువగా ఉంది. మండలంలో కేవలం 890 హెక్టార్లలో మాత్రమే వరి పంట సాగవుతోంది. సరుగుడు తోటల పెంపకం కారణంగా భూములు నిస్సారంగా మారిపోతాయి. భూగర్భ జలాలు తగ్గిపోతాయి.

----------------------------

Updated Date - Jul 19 , 2025 | 12:07 AM