A life-threatening run ప్రాణం తీసిన పరుగు
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:58 PM
A life-threatening run ఎన్‌సీసీకి ఎంపికవ్వాలని కలలుగన్న ఆ యువకుడు సెలక్షన్స్ కోసం ఎదురుచూశాడు. తోటి స్నేహితులతో కూడా ఇదే విషయం చెప్పేవాడు. ఎంపిక పోటీల తేదీలు ప్రకటించాక చాలా ఆనందపడ్డాడు. తానొకటి తలస్తే విధి మరోలా చేసింది. పోటీలకు ఎంతో ఉత్సాహంగా హాజరై పరుగులు పెడుతున్న అతన్ని అర్ధాంతరంగా ఆపేసింది. కల సాకారం కాకముందే మృత్యుఒడికి తీసుకెళ్లిపోయింది.
ప్రాణం తీసిన పరుగు
కల సాకారం కాకముందే తనువు చాలించిన యువకుడు
శోకసంధ్రంలో తల్లిదండ్రులు
విజయనగరం క్రైం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఎన్‌సీసీకి ఎంపికవ్వాలని కలలుగన్న ఆ యువకుడు సెలక్షన్స్ కోసం ఎదురుచూశాడు. తోటి స్నేహితులతో కూడా ఇదే విషయం చెప్పేవాడు. ఎంపిక పోటీల తేదీలు ప్రకటించాక చాలా ఆనందపడ్డాడు. తానొకటి తలస్తే విధి మరోలా చేసింది. పోటీలకు ఎంతో ఉత్సాహంగా హాజరై పరుగులు పెడుతున్న అతన్ని అర్ధాంతరంగా ఆపేసింది. కల సాకారం కాకముందే మృత్యుఒడికి తీసుకెళ్లిపోయింది. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన పాలవలస సాయికిరణ్ విషాదాంతమిది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన పాలవలస పోలినాయుడు, సుజాత దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమార్తె శ్రవంతికి పెళ్లి అయింది. కుమారుడు పాలవలస సాయికిరణ్(19) విజయనగరంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగు కళాశాలలో బీటెక్ ఈఈఈ రెండో ఏడాది చదువుతున్నాడు. గురువారం ఉదయం కళాశాలలో ఎన్‌సీసీ ఎంపికలు జరుగుతుండడంతో హాజరయ్యాడు. ఎన్‌సీసీ అధికారులు చేపట్టిన ఎంపిక పోటీల్లో తొలుత పరుగు పందెం పెట్టగా పాల్గొని పరుగెడుతూ కొంత దూరం వెళ్లాక ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే కళాశాల యాజమాన్యం యువకుడిని జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. టూటౌన్ సీఐ టి.శ్రీనివాస్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని కళాశాల యాజమాన్యంతో పాటు ఎన్‌సీసీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేంద్రాసుపత్రికి తరలించారు. సాయికిరణ్ తల్లిదండ్రులు బంధువులు అంతా జిల్లా కేంద్రాసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది. అందొచ్చిన కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
దగ్గర్లో ఉంటాడని తీసుకొస్తే..
కుమారుడు తనకు దగ్గర్లో ఉంటాడని, దూరం నుంచి తీసుకొచ్చానని సాయికిరణ్ తండ్రి పాలవలస పోలినాయుడు వాపోయాడు. గుంటూరులో పాలిటెక్నిక్ చదువుకున్నాడని, కాకినాడలో ఇంజనీరింగ్ సీటు వచ్చినా తమకు దగ్గర్లో ఉంటాడన్న ఉద్దేశంతో రెండు నెలల క్రితమే విజయనగరం కళాశాలలో చేర్చానని ఆవేదన వ్యక్తం చేశాడు. 15 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చి రెండు రోజుల పాటు తమతోనే ఉన్నాడని కన్నీరుమున్నీరయ్యాడు.
కేంద్రాసుపత్రికి చేరుకున్న తోటి విద్యార్థులు
సాయికిరణ్ కుప్పకూలి మరణించినట్లు తెలుసుకున్న తోటి విద్యార్థులు కేంద్రాసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. తమ స్నేహితుడు విగతజీవిగా మారడంతో వారి దుఃఖానికి అవధుల్లేకుండా పోయాయి. సాయంత్రం వరకూ వారంతా జిల్లా కేంద్రాసుపత్రి వద్దే ఉన్నారు.
ఉద్దవోలులో విషాదం
గరుగుబిల్లి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని ఉద్దవోలు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన పాలవలస సాయికిరణ్ (19) గురువారం ఉదయం విజయనగరంలో గుండెపోటుతో మృతిచెందినట్లు తెలుసుకున్న గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాఠశాల స్థాయి నుంచి చదువులో ప్రతిభ కనబరిచి మంచి విద్యార్థిగా స్థానికంగా గుర్తింపు పొందాడు. ఊరు వచ్చినప్పుడు వ్యవసాయ పనుల్లో తండ్రికి సహకరిస్తుండేవాడు. ఇదంతా చూసిన గ్రామస్థులు సాయికిరణ్ మృతిని తట్టుకోలేకపోయారు.