Share News

A kilo is 700 grams! కిలో అంటే 700 గ్రాములట!

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:02 AM

A kilo is 700 grams! సాధారణంగా కిలోగ్రాము అంటే 1000 గ్రాములు. రాజాం పట్టణంలో మాత్రం 700 గ్రాములే. ఇదేంటిలా అనుకుంటున్నారా.. ఇక్కడి వ్యాపారులు అంతే. పండ్లు కొనుగోలు చేసినా.. నిత్యావసరాలు తీసుకున్నా.. చివరకు ఐరన్‌ షాపుల్లోనూ అంతే. కిలో వద్ద 300 గ్రాములు వదులుకోవాల్సిందే.

A kilo is 700 grams! కిలో అంటే 700 గ్రాములట!
కాటాలను పరిశీలిస్తున్న అధికారులు(ఫైల్‌)

కిలో అంటే 700 గ్రాములట!

తూనికలు, కొలతల్లో వ్యాపారుల దగా

రాజాంలో అడ్డంగా దొరికిన 20 మంది

జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి

రాజాం, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి):

సాధారణంగా కిలోగ్రాము అంటే 1000 గ్రాములు. రాజాం పట్టణంలో మాత్రం 700 గ్రాములే. ఇదేంటిలా అనుకుంటున్నారా.. ఇక్కడి వ్యాపారులు అంతే. పండ్లు కొనుగోలు చేసినా.. నిత్యావసరాలు తీసుకున్నా.. చివరకు ఐరన్‌ షాపుల్లోనూ అంతే. కిలో వద్ద 300 గ్రాములు వదులుకోవాల్సిందే. రెండు రోజుల కిందట తూనికలు, కొలతల శాఖ అధికారులు, సిబ్బంది తనిఖీ చేస్తే ఏకంగా 20 మంది వ్యాపారులు ఇలానే చేసి దొరికిపోయారు. ఆ వ్యాపారులకు చెందిన కాటాలను అధికారులు బహిరంగంగా ప్రదర్శించేసరికి ప్రజలు ఆశ్చర్యపోయారు. అయితే ఇది ఒక్క రాజాంలోనే జరుగుతోందనుకుంటే పొరబడినట్టే. జిల్లా వ్యాప్తంగా ఈ ఘరానా మోసం కొనసాగుతూ ఉంది. వస్తువులను కొంటున్న వినియోగదారుడు మోసపోతూ ఉన్నాడు. ఒకవైపు భగ్గుమంటున్న ధరలు, మరోవైపు మోసాలతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌, గృహ నిర్మాణ సామగ్రి, నిత్యావసరాలు, చివరకు ఆహార పదార్థాలు, పండ్లు ఇలా అన్నింటా తూకం మోసాలతో పాటు కల్తీ ఉండనే ఉంది. ఎలక్ర్టికల్‌ వేయింగ్‌ మిషన్లను ట్యాంపరింగ్‌ చేసి నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. దొరికితే దొంగ.. లేకుంటే దొర అన్నట్టు ఈ అక్రమాల తంతు సాగిపోతోంది. తూనికలు, కొలతల శాఖ అధికారులు తూతూమంత్రపు తనిఖీలకే పరిమితమవుతున్నారు. ఎప్పుడో కాని దృష్టిపెట్టడం లేదు. ఫిర్యాదు వస్తే కదులుతున్నారు. దీంతో వ్యాపారులు ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు.

జిల్లాలో వస్తు సేవా రంగాల్లో దగా చాలా ఏళ్లుగా నడుస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాల్లో మరింత ఎక్కువ. జిల్లా వ్యాప్తంగా వందకుపైగా పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. కొన్ని పెట్రోల్‌ బంకుల యాజమాన్యాలు ఎలక్ర్టికల్‌ వేయింగ్‌ మిషన్లలో ట్యాంపరింగ్‌ చేస్తున్నారు. లీటరు పెట్రోల్‌కు 100,200 వరకూ మిల్లీలీటర్లు పక్కదారి పట్టిస్తున్నారు. బంకుల వద్ద కనీస నిబంధనలు పాటించడం లేదు. ఏరోజుకారోజు బంకుల వద్ద పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ప్రదర్శించాలి. ఇది ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. నిత్యం పెట్రోల్‌, డీజిల్‌ పెరుగుదలతో వినియోగదారులు కూడా పట్టించుకోవడం లేదు. వాస్తవానికి పెట్రోల్‌ నాణ్యత తెలుసుకునేందుకు బంకుల వద్ద ఫిల్టర్‌ పేపర్‌ టెస్ట్‌ అందుబాటులో ఉంటుంది. ఆ పేపరుపై రెండు మూడు చుక్కలు పెట్రోల్‌ వేస్తే అది ఆవిరి అయిపోతే అది నాన్యతున్న పెట్రోల్‌. మరకలుగా మిగిలిపోతే అది కల్తీ జరిగినట్టు నిర్థారించవచ్చు. ఈ విషయం చాలామంది వినియోగదారులకు తెలియదు. ప్రస్తుతం లీటరు పెట్రోల్‌ రూ.110కి చేరింది. ఇక లూజు విక్రయాల పేరిట రూ.120కు అమ్ముతున్నారు.

సిమెంట్‌, ఇనుమూ అంతే..

గృహ నిర్మాణ సామగ్రి అమ్మకాల్లో కూడా మోసాలు జరుగుతున్నాయి. సిమెంట్‌ బస్తా వద్ద కూడా కేజీ, కేజీన్నర తరుగు వస్తోంది. కంపెనీలు నిబంధనలు పాటిస్తున్నా కొంతమంది దళారులు బస్తాల్లో సిమెంట్‌ తీసి రీ ప్యాకింగ్‌ చేస్తున్నారు. ఇనుము కేజీలెక్క విక్రయించాల్సి ఉన్నా జిల్లాలో చాలామంది వ్యాపారులు విడి పరికరాల కింద అమ్ముతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా గృహ నిర్మాణం జోరుగా సాగుతోంది. జగనన్న కాలనీలు, సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల నిర్మాణానికి సిమెంట్‌, ఇనుము ఎక్కువ అవసరం. రోజుకు లక్షలాది రూపాయల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే అదునుగా వ్యాపారులు తూనికలు, కొలతల్లో మోసానికి పాల్పడుతున్నారు.

వంట గ్యాస్‌లో..

వంట గ్యాస్‌లో కూడా మోసం పెరుగుతోంది. కొన్ని ఏజెన్సీలు ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్‌ కాకుండా డెలివరీ చార్జీల పేరిట అదనంగా వసూలు చేస్తున్నారు. గ్యాస్‌ సిలెండర్‌లో కూడా నిర్ణీత ప్రమాణం తగ్గుముఖం పడుతోంది. చాలామంది బ్లాక్‌ మార్కెట్‌లో గ్యాస్‌ సిలెండర్లు కొనుగోలు చేసినప్పుడు వ్యత్యాసం కనిపిస్తోంది. ఒక్కో సిలిండర్‌ వద్ద రెండు కిలోల వరకూ తగ్గుముఖం పడుతోంది. డెలివరీ బాయ్స్‌ కూడా కొంత అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ప్రతి ఇంటా గ్యాస్‌ వినియోగం పెరిగింది. ఈ పరిస్థితుల్లో వంట గ్యాస్‌ రూపంలో మోసాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

నిత్యావసరాల్లో దగా..

నిత్యావసరాలు, ఆహార పదార్థాల గురించి చెప్పనక్కర్లేదు. నాణ్యతలోను, తూనికల్లోనూ మోసమే కనిపిస్తోంది. కిరాణా దుకాణాల నుంచి పెద్ద షాపింగ్‌ మాల్స్‌ వరకూ ట్యాంపరింగ్‌ చేసి విక్రయిస్తున్నారు. కిలో దగ్గర 200 గ్రాముల వరకూ తగ్గించి అమ్ముతున్నారు. కొన్నింటికి ప్రామాణిక ముద్రతో విక్రయించాల్సి ఉన్నా ఇష్టారాజ్యంగా లూజు విక్రయాలు చేస్తున్నారు. వంట నూనెలో కూడా కల్తీ జరుగుతోంది. ప్రధానంగా వారపు సంతల్లో తూనిక రాళ్లతో విక్రయిస్తున్నారు. ఏటా ఈ రాళ్లను రెన్యువల్‌ చేయాల్సి ఉన్నా ఎక్కడా అమలవుతున్నట్టు లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వారపు సంతలే మార్కెట్లుగా ఉన్నాయి. లక్షలాది రూపాయల క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. గ్రామీణ ప్రాంత ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని తూనిక రాళ్లతో వ్యాపారులు మోసం చేస్తున్నారు. తూనికల కొలతల శాఖ అధికారులు తూతూమంత్రపు తనిఖీలకే పరిమితమవుతున్నారు. ఏమని ప్రశ్నిస్తే సిబ్బంది కొరత అంటూ సమాధానం చెబుతున్నారు. ఇక ఆహార కల్తీ నియంత్రణ అధికారుల జాడే లేకుండా పోతోంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం దృష్టిసారించాల్సిన అవసరముంది.

ప్రత్యేకంగా దృష్టి సారించాం

తూనికలు, కొలతలపై ప్రత్యేకంగా దృష్టిసారించాం. ఎక్కడైనా మోసాలు జరిగితే వెంటనే ఫిర్యాదుచేయాలి. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నాం. వ్యాపార సంస్థలు నిర్ణీత ప్రమాణాలు పాటించాలి. లేకుంటే చర్యలు తప్పవు. సిబ్బంది కొరత ఉన్నా ఉన్నంతలో తనిఖీలు చేపడుతున్నాం.

- ఎ.బాలరామకృష్ణ, ఇన్‌స్పెక్టర్‌, తూనికలు, కొలతల శాఖ

Updated Date - Sep 12 , 2025 | 12:02 AM