Share News

A Healthy Boost పల్లెలకు ఆరోగ్య యోగం

ABN , Publish Date - Dec 30 , 2025 | 11:30 PM

A Healthy Boost for Villages గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ మేరకు పీహెచ్‌సీల తరహాలో పల్లెల్లో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు (వెల్‌నెస్‌ సెంటర్లు) ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.

A Healthy Boost   పల్లెలకు ఆరోగ్య యోగం
సాలూరు మండలంలో కరడవలసలో ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి స్థల పరిశీలన చేస్తున్న పంచాయతీరాజ్‌ అధికారులు

  • మంజూరైన నిధులు

సాలూరు, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ మేరకు పీహెచ్‌సీల తరహాలో పల్లెల్లో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు (వెల్‌నెస్‌ సెంటర్లు) ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. జిల్లాలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద 51, పీఎం ఆయుష్మాన్‌ భారత్‌ కింద 69, 15వ ఆర్థిక సంఘం కింద 22 వెల్‌నెస్‌ సెంటర్ల పనులకు నిధులు మంజూరయ్యాయి. 15 మండలాల పరిధిలో ఆయా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులు స్థల పరిశీలన చేస్తున్నారు. కాగా ఇన్నేళ్లు పరాయి పంచన ఉన్న కేంద్రాలకు భవన యోగం పట్టనుంది.

ఇదీ పరిస్థితి..

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ నిధులతో ఆరోగ్య సంరక్షణ కేంద్రాల నిర్మాణం చేపట్టారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.20.80 లక్షలు కేటాయించారు. అయితే ఆ నిధులు సరి పోకపోవడంతో చాలా కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. మరికొందరు పనులు చేసినా గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణాలను అర్ధాంతరంగా నిలిపివేశారు. తాజాగా మంజూరైన 15వ ఆర్థిక సంఘం నిధులతో జిల్లాలో 22 చోట్ల కొత్తగా భవనాలు నిర్మించనుండగా.. ఒక్కో భవనానికి రూ.36 లక్షల చొప్పున కేటాయించారు. దీంతో ఆయా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకొస్తున్నారు. ఇక ఆయుష్మాన్‌ భారత్‌ కింద మన్యంలో 69 చోట్ల నూతన భవనాలు నిర్మించ నున్నారు. ఒక్కో భవనానికి రూ.55 లక్షలు మంజూరు చేయగా.. భవనాలతో పాటు ప్రహరీలు కూడా నిర్మించనున్నారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ జరుగుతోంది. వివిధ దశల్లో నిలిచిపోయిన 51 ఆరోగ్య సంరక్షణ కేంద్ర నిర్మాణాల పూర్తికి జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద నిధులు మంజూరయ్యాయి. కాగా ఇప్పటికే వాటి పనులు ప్రారంభ మయ్యాయి. జిల్లాలో ఆరోగ్య సంరక్షణ కేంద్ర నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయ నున్నట్టు పంచాయతీరాజ్‌ ఈఈ నాగేష్‌బాబు తెలిపారు.

Updated Date - Dec 30 , 2025 | 11:30 PM