Share News

A Harvest of Jobs కొలువుల పంట

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:24 AM

A Harvest of Jobs నిరుద్యోగ ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. చెప్పిన విధంగానే మెగా డీఎస్సీలో అభ్యర్ధుల మెరిట్‌ లిస్ట్‌ శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో వెల్లడించింది. ధ్రువపత్రాల పరిశీలనకు రంగం సిద్ధం చేస్తోంది. ఇదిలా ఉండగా వివిధ కేటగిరీ పోస్టులకు జోన్‌ ఆఫ్‌ కన్సిడరేషన్‌ లోకి వచ్చిన అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌కు కాల్‌లెటర్లు పంపుతారు. వాటిని వారు డౌన్‌లోడ్‌ చేసుకొని అందులో సూచనలు పాటించాలి.

A Harvest of Jobs కొలువుల పంట

  • చెప్పినట్టే డీఎస్సీ మెరిట్‌ లిస్ట్‌ విడుదల

  • ధ్రువపత్రాల పరిశీలనకు రంగం సిద్ధం

సాలూరు రూరల్‌, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. చెప్పిన విధంగానే మెగా డీఎస్సీలో అభ్యర్ధుల మెరిట్‌ లిస్ట్‌ శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో వెల్లడించింది. ధ్రువపత్రాల పరిశీలనకు రంగం సిద్ధం చేస్తోంది. ఇదిలా ఉండగా వివిధ కేటగిరీ పోస్టులకు జోన్‌ ఆఫ్‌ కన్సిడరేషన్‌ లోకి వచ్చిన అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌కు కాల్‌లెటర్లు పంపుతారు. వాటిని వారు డౌన్‌లోడ్‌ చేసుకొని అందులో సూచనలు పాటించాలి. కేటాయించిన తేదీ, సమయానికి ద్రువపత్రాల పరిశీలనకు తప్పకుండా హాజరు కావాల్సి ఉంది. పోస్టులకు ఎంపిక పూర్తిగా ప్రతిభ, అర్హత, నియమ నిబంధనలకు ఆధారంగా జరుగుతుందని మెగా డీఎస్సీ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అఽభ్యర్థుల ద్రువపత్రాలను పరిశీలనకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి ఎంఈవోలు, ఎల్‌డీఏలు, కంప్యూటర్లు ఆపరేటర్లతో కూడిన 24 మంది బృందం ఈ నెల 20న విజయవాడలో శిక్షణ పొందింది.

ఇదీ పరిస్థితి..

- పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో 583 టీచర్‌ ఖాళీలతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చారు. మున్సిపల్‌, జడ్పీ, ఎంపీపీ,ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీలు 210, పాఠశాల సహాయకులు క్యాడర్‌లో తెలుగులో 14, హిందీలో 14, ఆంగ్లంలో 23, గణితంలో 8, భౌతికశాస్త్రంలో 32, జీవశాస్త్రంలో 20, సాంఘిక శాస్త్రంలో 62, పీఈటీ 63 మొత్తం 446 టీచర్‌ ఖాళీలు చూపారు. ట్రైబల్‌ వెల్ఫేర్‌, ఆశ్రమ పాఠశాలల్లో ఎస్జీటీలు 60 పాఠశాల సహాయకుల క్యాడర్‌లో ఆంగ్లంలో 7, గణితంలో 25, భౌతిక శాస్త్రంలో 24, జీవశాస్త్రంలో 16, సాంఘిక శాస్త్రంలో 5 మొత్తం 137 టీచర్‌ పోస్టులు ఖాళీలను చూపించారు.

-ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది జూన్‌ ఆరు నుంచి జూలై 2 వరకు 23 రోజుల పాటు రెండు సెషన్లలో మెగా డీఎస్పీ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల వ్యక్తిగత స్కోరు కార్డులను ఈ నెల 11న ప్రకటించారు. నేరుగా ఎంపిక జాబితాతో పోస్టుల భర్తీకి సన్నాహాలు చేశారు. అయితే మెరిట్‌ ప్రకటించాలని అభ్యర్థులు కోరారు. వారి కోరిక మేరకు పోస్టుల భర్తీలో పారదర్శకత కోసం విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ ఆదేశాలతో మెరిట్‌ లిస్ట్‌ను ప్రకటించారు. ఈ లిస్ట్‌లో ఉన్నవారంతా పోస్టులకు ఎంపికయినట్టు కాదు. భర్తీలో పారదర్శకత, ఎటువంటి అపోహాలు కలగకుండా ఉండేందుకు మెగా డీఎస్సీలో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవడానికి ఈ జాబితా వెల్లడించారు.

- ఉమ్మడి జిల్లాలో వివిధ కేటగిరీల కింద 18,001 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 16 వేల మంది పైబడి పరీక్షలకు హాజరయ్యారు. అత్యధికంగా ఎస్జీటీ పరీక్షకు హాజర య్యారు. ఎజ్జీటీ మెరిట్‌ జాబితా7,725 మందితో ప్రకటించారు. పాఠశాల సహాయకుల కేటగిరీలో ఆంగ్లానికి 665 మందితో, గణితంలో 1497 మంది, ఫిజికల్‌ సైన్స్‌లో 1398 మందితో, సోషల్‌లో 2618 మంది, తెలుగు 885 మంది, బయాలజీ 1359 మందితో మెరిట్‌ జాబితాలను ప్రకటించారు. ఇవి కాకుండా జోన్‌ల వారీగా పీజీటీ, టీజీటీ ప్రిన్సిపాళ్లు తదితర పోస్టుల మెరిట్‌లిస్ట్‌లను ప్రకటించారు.

ఉమ్మడి జిల్లాలో ప్రథమ స్థానంలో ఉన్నవారు..

ఎస్జీటీ కేటగిరీలో సుంకరి మోహనరావు 94.64 మార్కులు సాధించి ప్రథమంగా నిలిచారు. పాఠశాల సహాయకుల కేటగిరీలో ఆంగ్లంలో మజ్జి భార్గవి 83.64 , గణితంలో మరడాన రామనాయుడు 89.73, ఫిజికల్‌ సైన్స్‌లో బండారు కల్యాణి 82.64 , సోషల్‌లో కిల్లంపల్లి శ్రీకాంత్‌ 87.32 , తెలుగులో తుమరాడ దుర్గాప్రసాద్‌ 89.62 , బయాలజీలో బోర శ్రీనివాసరావు 85.48 మార్కులతో ప్రథమంగా నిలిచారు. బలిజిపేట మండలం పెదపెంకికి చెందిన సారిపల్లి నాగరాజు తెలుగు పీజీటీ, టీజీటీ, పాఠశాల సహాయకుల పోస్టులకు సంబంధించి ఉత్తమ మార్కులు సాధించి మెరిట్‌ జాబితాలో ఉన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 12:24 AM