Share News

A Grand tolellu ఘనంగా తొలేళ్లు

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:11 AM

A Grand tolellu పార్వతీపురం పట్టణం, జగన్నాఽథపురం, బెలగాం ప్రజల ఇలవేల్పులు ఇప్పలపోలమ్మ, యర్రకంచమ్మల తొలేళ్లు ఉత్సవాన్ని సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. అనంతరం మేళాతాళాలతో ఉత్సవ నిర్వాహకులు వేమకోటి వీధికి వెళ్లారు. సిరిమానును ముందుండి నడిపించే ఎజ్జి నాగరాజును ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చారు.

A Grand  tolellu ఘనంగా తొలేళ్లు
తొలేళ్లు ఉత్సవం సందర్భంగా అమ్మవారి ఘటాలకు పూజలు చేస్తున్న మహిళలు

  • ఆలయాలకు భక్తుల తాకిడి

  • కిటకిటలాడిన పార్వతీపురం

  • సిరిమానోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

పార్వతీపురం టౌన్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) : పార్వతీపురం పట్టణం, జగన్నాఽథపురం, బెలగాం ప్రజల ఇలవేల్పులు ఇప్పలపోలమ్మ, యర్రకంచమ్మల తొలేళ్లు ఉత్సవాన్ని సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. అనంతరం మేళాతాళాలతో ఉత్సవ నిర్వాహకులు వేమకోటి వీధికి వెళ్లారు. సిరిమానును ముందుండి నడిపించే ఎజ్జి నాగరాజును ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం ఇప్పలపోలమ్మ ఆలయం వద్ద ఆయన ప్రత్యేక పూజలు చేసి రైతులకు ధాన్యం పంచారు. మరోవైపు రైతులు అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు చేశారు. ఇప్పలపోలమ్మకు పూలంగి సేవతో పాటు ప్రత్యేక అలంకరణ చేపట్టారు. సారికివీధి, రెడ్డివీధి, నాయుడువీది, బొగ్గుల వీధి, తదితర వీధుల్లోని రైతులు పెద్దఎత్తున తొలేళ్లు ఉత్సవంలో పాల్గొన్నారు. దీంతో ఆ ప్రాంతమంతా జైజై ఇప్పల పోలమ్మ అనే నామస్మరణతో మార్మోగింది. ఇక యర్రకంచమ్మ ఆలయంలో అమ్మవారికి రాగోలు, వలిరెడ్డి కుటుంబాలకు చెందిన ఎజ్జిలు ప్రత్యేక పూజలు చేశారు. మొత్తంగా మున్సిపల్‌, విద్యుత్‌, పోలీసు శాఖాధికారులు, ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో తొలేళ్లు ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరిపారు.

తరలివచ్చిన భక్తజనం

ఇప్పలపోలమ్మ, యర్రకంచమ్మలతో పాటు బంగారమ్మలను దర్శించుకోనేందుకు భక్తులు తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచే ఆయా ఆలయాల బయట భక్తులు బారులుదీరారు. నాయుడు వీధిలోని ఇప్పలపోలమ్మ, జగన్నాఽథపురంలోని యర్రకంచమ్మ, బెలగాంలోని బంగారమ్మ ఆలయాల్లో భక్తులు అమ్మవార్లకు పసుపు, కుంకుమలను సమర్పించారు. అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేశారు. బెలగాం ప్రజల ఇలవేల్పు బంగారమ్మ తల్లి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మద్య అమ్మవారికి మహిళలు ప్రత్యేక నైవేద్యాలను సమర్పించారు. మంగళవారం సాయంత్రం అమ్మవారి ఘటాలను బూరాడ వీధిలోని ఆలయం నుంచి నాయుడువీధి, మైదానం వీధి, కోవెల వీధి, అగురువీధి, మద్దెల వీధి, గెడ్డవీధి, కాలేటి వారి వీధి, అగ్రహరం వీధి, చర్చివీధిల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అనంతరం నాయుడు వీధి రామాలయం వద్ద ఘటాలను దించుతారు. ఆ తర్వాత అనుపోత్సవం నిర్వహిస్తారు.

సిరిమానోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

పట్టణంలో మంగళవారం నిర్వహించే సిరిమాను ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. ఇప్పలపోలమ్మ, యర్రకంచమ్మ సిరిమానులు తిరిగే ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఎదరవకుండా మున్సిపల్‌, ఉత్సవ కమిటీ సభ్యులు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. మరోవైపు మున్సిపల్‌ కమిషనర్‌ సీహెచ్‌ వెంటకటేశ్వర్లు సోమవారం ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవ కమిటీలతో పాటు పోలీసులతో మాట్లాడారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించాలని సూచించారు.

Updated Date - Jun 03 , 2025 | 12:11 AM