Waterfalls జలపాతాలకు మహర్దశ
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:15 AM
A Golden Era for Waterfalls జిల్లాలో జలపాతాలకు మహర్దశ పట్టింది. వాటి అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో పర్యాటకులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కొన్నిచోట్ల గిరిజనులే ముందుకొచ్చి స్వచ్ఛందంగా పనులు చేపడుతున్నారు.
మౌలిక వసతుల కల్పనపై దృష్టి
స్వచ్ఛందంగా ముందుకొస్తున్న గిరిజనులు
రుణాలిచ్చి.. మహిళా సంఘాలతో దుకాణాల ఏర్పాటు
పర్యాటకులను ఆకట్టుకునేలా పనులు
పార్వతీపురం/సాలూరు రూరల్, అక్టోబరు18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జలపాతాలకు మహర్దశ పట్టింది. వాటి అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో పర్యాటకులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కొన్నిచోట్ల గిరిజనులే ముందుకొచ్చి స్వచ్ఛందంగా పనులు చేపడుతున్నారు. ఇప్పటికే గుమ్మలక్షీపురం మండలం తాడికొండ జలపాతం వద్ద పర్యాటకుల కోసం అన్ని వసతులు కల్పించారు. దుకాణ సముదాయాలను కూడా ప్రారంభించారు. వాష్ రూమ్‌లు, ఇతర సదుపాయాలను కూడా కల్పించారు. ఇక జిల్లాలో సాలూరు మండలంలో లొద్ద, దళాయివలసలో పల్లం పణుకు, కురుకూటి, శిఖపరువు, పాచిపెంట మండలంలో ఆలూరు తదితర జలపాతాలు అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేశారు. వాటి పనులపై కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా ప్రాంతాల్లో జలపాతాలకు వెళ్లడానికి రహదారి, పర్యాటకులకు అవసరమైన తాగునీరు, ఆహారం తదితర వాటిని అందుబాటులో ఉండే విధంగా దుకాణాలు ఏర్పాటు చేయిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో పర్యాటకుల సౌకర్యార్థం హోం స్టే అభివృద్ధి చేయనున్నారు. మొత్తంగా పర్యాటకులను ఆకర్షించేలా జలపాతాలను అభివృద్ధి చేసి.. గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు.
రుణాలు అందించి..
డీఆర్‌డీఏ సహకారంతో మహిళా సంఘాల సభ్యులకు రుణాలందించి జలపాతాలు, పర్యాటక ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో పర్యాటక ప్రాంతాలను డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి పలుమార్లు పర్యటించారు. వెలుగు ఏపీఎంలు, సీసీలు సాయంతో గిరిజనుల్లో అవగాహన కల్పించారు. గిరిజనులు కూడా తమ గ్రామాల అభివృద్ధి చెందుతాయనే భావనతో స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సాలూరు మండలం కురుకూటి సమీపంలో దళాయివలస వద్ద ఉన్న పల్లంపణుకు జలపాతం అభివృద్ధికి గిరిజనులు నడుం బిగించారు. ఈ జలపాతానికి దళాయివలస వద్ద నుంచి దాదాపు 4 కిలోమీటర్లు రోడ్డును స్వచ్ఛందంగా గిరిజనులు బాగు చేశారు. వాటర్ ఫాల్స్ వద్ద వెదురుకర్రలతో వంతెన, పర్యాటకులు దుస్తులు మార్చుకోవడానికి వీలుగా కర్రలతో రూంలను నిర్మించారు. ఇటీవల డీఆర్‌డీఏ పీడీ సుధారాణి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ జలపాంతం వద్ద మహిళలకు రుణాలిచ్చి దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. నడిచి వెళ్లలేని వారిని పేయింగ్ బైక్‌లను ఏర్పాటు చేసి స్థానిక గిరిజన యువత ఉపాధి పొందేలా కార్యాచరణ చేశారు.
పర్యాటక అభివృద్ధికి చర్యలు
‘జిల్లాలో జలపాతాల ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని ప్రత్యక్షంగా.. పరోక్షంగా గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం.’ అని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.