A glorious tour of the hills వైభవంగా గిరిప్రదక్షిణ
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:15 AM
A glorious tour of the hills రామతీర్థంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని మంగళవారం చేపట్టిన గిరి ప్రదక్షిణ వైభవంగా సాగింది. వేలాది మంది భక్తుల శ్రీరామ నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. తొలుత దేవస్థానం ఉత్తర ద్వారం గుండా సీతారామస్వాములను దర్శించుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న బోడికొండ మెట్ల వద్ద ఎమ్మెల్యే లోకం నాగమాధవితోపాటు సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో మెట్లోత్సవం చేపట్టారు.
వైభవంగా గిరిప్రదక్షిణ
రామతీర్థంలో భక్తిప్రపత్తులతో ఉత్తర ద్వార దర్శనం
నెల్లిమర్ల, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): రామతీర్థంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని మంగళవారం చేపట్టిన గిరి ప్రదక్షిణ వైభవంగా సాగింది. వేలాది మంది భక్తుల శ్రీరామ నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. తొలుత దేవస్థానం ఉత్తర ద్వారం గుండా సీతారామస్వాములను దర్శించుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న బోడికొండ మెట్ల వద్ద ఎమ్మెల్యే లోకం నాగమాధవితోపాటు సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో మెట్లోత్సవం చేపట్టారు. ఆపై గిరిప్రదక్షిణ ప్రారంభమైంది. బోడికొండ చుట్టూ వేలాది మంది భక్తులు రామనామస్మరణతో ప్రదక్షిణ నిర్వహించారు. దాదాపు 9 కిలోమీటర్ల నిడివిగల ఈ రోడ్డు ఐదు గంటలపాటు భక్తులతో కిటకిటలాడింది. రామతీర్థం ఎస్‌టీ కాలనీ, మెయిన్‌రోడ్డు, సీతారామునిపేట జంక్షన్, గొర్లపేట కల్లాలు మీదుగా బోడికొండ చుట్టూ వేలాది మంది ప్రదక్షిణ చేశారు. అనంతరం భక్తులు బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలో రామస్వామివారిని దర్శించుకున్నారు. విజయనగరం ఎమ్మెల్యే అదితిగజపతిరాజు, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు కూడా పాల్గొన్నారు. గిరిప్రదక్షిణలో సాంస్కృతిక ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే నాగమాధవితో పాటు భర్త లోకం ప్రసాదు, జనసేన నాయకులు చనమల్లు వెంకటరమణ, కరుమజ్జి గోవిందరావు, అంబల్ల అప్పలనాయుడు, పతివాడ గోవిందరావు తదితరులు ప్రదక్షిణ చేశారు.
పోటెత్తిన రామతీర్థం
ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం కోసం మంగళవారం రామతీర్థానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార తలుపులను ఉదయం అయిదున్నర గంటలకు అర్చకులు తెరిచారు. ఊయలపై ఉన్న స్వామిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలతో పాటు ఎస్పీ ఏఆర్.దామోదర్ హాజరయ్యారు. అలాగే టీడీపీ నాయకులు సువ్వాడ రవిశేఖర్, ఐవీపీ రాజుతో పాటు ఆల్తి శ్రీనివాసరావు, అవనాపు సత్యనారాయణ, తాడ్డి సత్యనారాయణ, రామతీర్థం సేవా పరిషత్ వ్యవస్థాపకుడు జ్యోతిప్రసాద్ తదితరులు దర్శనం చేసుకున్నారు. గిరి ప్రదక్షిణకు సుమారు 20 వేల మందికిపైగా హాజరైనట్టు అధికారులు అంచనా వేశారు. దేవస్థానంలో ఏర్పాట్లను ఈవో వై.శ్రీనివాసరావు పర్యవేక్షించారు. భోగాపురం రూరల్ సీఐ రామకృష్ణ పర్యవేక్షణలో నెల్లిమర్ల, డెంకాడ, పూసపాటిరేగ ఎస్‌ఐలు బి.గణేష్, సన్యాసినాయుడు, దుర్గాప్రసాద్ బందోబస్తు ఏర్పాటు చేశారు.