A Dream Nearing Fulfillment ఈడేరనున్న కల
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:08 AM
A Dream Nearing Fulfillment నిరుద్యోగుల కల నెరవేరనుంది. కానిస్టేబుళ్లుగా ఎంపికైన జిల్లా అభ్యర్థులు 180 మందికి మంగళగిరిలో నేడు సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నారు. ఈ మేరకు సోమవారం వారంతా కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ బస్సుల్లో జిల్లా నుంచి పయనమయ్యారు.
మంగళగిరిలో ‘ థాంక్యూ సీఎం’ ప్రోగ్రాంకు 180 మంది పయనం
పార్వతీపురం/పాలకొండ/సాలూరు రూరల్, డిసెంబరు15(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగుల కల నెరవేరనుంది. కానిస్టేబుళ్లుగా ఎంపికైన జిల్లా అభ్యర్థులు 180 మందికి మంగళగిరిలో నేడు సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నారు. ఈ మేరకు సోమవారం వారంతా కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ బస్సుల్లో జిల్లా నుంచి పయనమయ్యారు. ‘థ్యాంక్యూ సీఎం’ ప్రోగ్రాంకు బయల్దేరిన వారికి స్థానిక పోలీసులు అభినందనలు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 134 కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి 2022, నవంబరులో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ మేరకు 30 వేల మందికి పైబడి దరఖాస్తులు చేసుకున్నారు. 2023, జనవరి 23న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 27,870 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 9,152 మంది దేహదారుఢ్య పరీక్షకు ఎంపికయ్యారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వారికి ఈ పరీక్షను నిర్వహించకుండా జాప్యం చేశారు. దీంతో కానిస్టేబుళ్ల నియమాక ప్రక్రియ మూలన పడింది. ఈ పోస్టులు భర్తీ చేస్తారో లేదోననే అభ్యర్థులు టెన్షన్ పడ్డారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియను పట్టాలెక్కించింది. 9,152 మందికి ఈ ఏడాది జనవరి 22 వరకు దేహదారుఢ్య పరీక్ష నిర్వహించారు. అనంతరం 4,549 మందిని ఎంపిక చేసి, ఈ ఏడాది జూన్ 1న విజయనగరంలో వారికి ప్రధాన పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఫలితాలను ప్రకటించారు. కాగా ఇందులో ఉత్తీర్ణత సాధించిన కానిస్టేబుల్ అభ్యర్థులకు మంగళగిరిలో సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం పోస్టింగ్ ఆర్డర్లు అందించనున్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి మంగళగిరికి ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది. కానిస్టేబుల్ అభ్యర్థులను బస్సుల్లో తీసుకొచ్చే బాధ్యతను ఆయా పరిధిలో ఉన్న కానిస్టేబుళ్లకు అప్పగించింది.