Innovative Teaching విభిన్న ప్రయత్నం.. బోధన వినూత్నం
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:20 AM
A Different Attempt... Innovative Teaching విద్యా బోధనలో వినూత్నంగా రాణించారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో తమదైన ముద్ర వేశారు. తెలుగు భాషపై పిల్లలు పట్టు సాధించేలా తమవంతు కృషి చేశారు. పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపడుతూనే మరోవైపు సాహిత్య, కళా రంగాల్లో విభిన్నంగా రాణించి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు.
హాజరు పెంపుపై ప్రత్యేక శ్రద్ధ
పాఠశాలల అభ్యున్నతికి కృషి
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులపై ప్రత్యేక కథనం
విద్యా బోధనలో వినూత్నంగా రాణించారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో తమదైన ముద్ర వేశారు. తెలుగు భాషపై పిల్లలు పట్టు సాధించేలా తమవంతు కృషి చేశారు. పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపడుతూనే మరోవైపు సాహిత్య, కళా రంగాల్లో విభిన్నంగా రాణించి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని విజయవాడలో వారు అవార్డు అందుకోనున్న నేపథ్యంలో ఉత్తమ గురువులపై ప్రత్యేక కథనం.
సంస్కృతం, తెలుగుపై ఆసక్తి పెంచేలా..
పాలకొండ, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సంస్కృత ఉపాధ్యాయుడు బౌరోతు శంకరరావు బోధనా శైలే వేరు. సంస్కృతం, తెలుగు భాష ఔన్నత్యంపై ప్రచారం చేస్తూ.. విద్యార్థులు వాటిపై పట్టు సాధించేలా కృషి చేస్తున్నారు. 23 ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్న ఆయన విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీసి.. వారికి అవసరమైన తర్ఫీదు ఇస్తున్నారు. రంగ స్థల నటుడిగా రాణిస్తూ మరోవైపు సూర్యచంద్ర కళాసమితి సంస్థ ద్వారా తెలుగు, సంస్కృతంపై అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటివరకు సుమారు 600కు పైగా సన్మాన పత్రాలను రచించారు. జిల్లెళ్లమూడి అమ్మవారి జీవితచరిత్ర, శంకర శతకం తదితర పుస్తకాలను కూడా రచించారు. ఇదిలా ఉండగా.. పిల్లలతో నాటకాలు వేయించడం, సంభాషణా నైపుణ్యాలను పెంపొం దిస్తున్నారు. సెలవు రోజుల్లో కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చి తెలుగు, సంస్కృతంపై మక్కువ కలిగేలా చొరవ చూపుతున్నారు. సమస్యలున్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి.. విద్యా ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగేలా కృషి చేస్తున్నారు. శంకరరావు మాస్టారు జిల్లెళ్లమూడి అమ్మ సేవా సంస్థ ద్వారా పేదలకు అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలో ప్రతి నెలా ఏదో ఒక ప్రాంతంలో సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఏ సందర్భంలోనైనా ఎక్కడైనా, ఏ వేదికపై అయినా తెలుగులోనే ఆయన సంభాషిస్తారు. తెలుగులోనే సంతకం కూడా చేస్తారు. ‘రాష్ట్రస్థాయి అవార్డు మరింత బాధ్యత పెంచింది. సంస్కృతం, తెలుగు భాషల అభ్యున్నతికి నా వంతు కృషి చేస్తా. వాటిపై విద్యార్థులు మక్కువ పెంచేలా ప్రయత్నిస్తా. పరభాషా మోజులో పడకుండా విద్యార్థి దశ నుంచి తెలుగులో మాట్లాడించేందుకు, విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు నిరంతరం శ్రమిస్తా.’ అని శంకరరావు మాస్టారు తెలిపారు.
వినూత్నంగా బోధిస్తూ..
జియ్యమ్మవలస: ‘రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా బాధ్యతను మరింత పెంచింది.’ అని అవార్డు గ్రహీత యర్రా శంకరరావు తెలిపారు. పెదబుడ్డిడి ఎంపీపీ స్కూల్ (బీసీ)లో ఎస్‌జీటీగా పనిచేస్తున్న ఆయన వినూత్న బోధనా పద్ధతులు పాటిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రధానంగా పాఠశాల భౌగోళిక అభివృద్ధిలో భాగంగా తరచూ గ్రామ పెద్దలు, తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి పాఠశాల అభివృద్ధిపై చర్చిస్తుంటారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని నిత్యం పర్యవేక్షిస్తారు. పిల్లలు నిరంతరం పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా రోజూ పర్యవేక్షిస్తారు. ప్లేబెస్ట్ యాక్టివిటీ ద్వారా ఆట పాటలతో నాటకీకరణ విద్య అందిస్తున్నారు. ప్రాథమిక విద్యార్థుల్లో పిజికల్, కాగ్నేటివ్, సోషియో ఒమేషనల్ వంటి అభివృద్ధికి అనుకూలమైన విద్యా ప్రవేశిక కార్యక్రమాలు రోజూ నిర్వహిస్తారు. కథలు, కబుర్లు, సంభాషణ ద్వారా విద్యా బోధనచేస్తారు. తర్ల్, కిప్, క్లాప్, క్లాప్స్, లెర్నింగ్, ఎన్‌హేన్స్‌మెంట్ ప్రోగ్రాం, జ్ఞానధార, కొత్త పాఠ్య పుస్తకాలు, తదితర అంశాల గురించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనకాపల్లి జిల్లాల ఉపాధ్యాయులకు స్టేట్ రిసోర్స్‌పర్సన్‌గా వ్యవహరించారు.
విద్యార్థుల ఉన్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తూ..
కొమరాడ: విద్యార్థుల ఉన్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డి.లక్ష్మణరావు మాస్టారు. కొమరాడ ఏపీటీబ్ల్యూఆర్ బాలుర పాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తున్న ఆయన విద్యార్థులకు గణితంపై ఉండే భయం పోగొట్టేలా తనవంతు కృషి చేస్తున్నారు. గణితంలో గమ్మత్తులను పరిచయం చేస్తూ అందరికీ అర్థమయ్యేలా బోధిస్తున్నారు. విద్యా ర్థుల్లో వెనుకుబాటుతనాన్ని గుర్తించి సాంకేతిక పరిజ్ఞానంతో వారికి అవగాహన కల్పిస్తున్నారు. సైన్స్, మ్యాథ్స్ ఫెయిర్‌లు నిర్వహిస్తూ శాస్ర్తీయ దృక్పఽథాన్ని పెంపొందిస్తున్నారు. పిల్లల ఆలోచనలతో నవీన ఆవిష్కరణలకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పాఠశాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను భాగస్వాములను చేసి అందరి మన్ననలు పొందుతున్నారు. కాగా రాష్ట్రస్థాయి అవార్డు రావడం మరింత బాధ్యతను పెంచిందని ఆయన తెలిపారు.
రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా తెర్లి ఎంపిక
గుమ్మలక్ష్మీపురం: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తెర్లి రవికుమార్‌కు రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డు వరించింది. 1999లో ఇంటర్మీడియట్ విద్యా విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఆయన నియమితులయ్యారు. ఎనిమిదేళ్ల పాటు సీతానగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేశారు. 2007లో పదోన్నతిపై సీనియర్ అసిస్టెంట్‌గా చినమేరంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరారు. 2009లో పదోన్నతి పొంది సీతానగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎకనామిక్స్ జూనియర్ లెక్చరర్ గా విధులుల్లో చేరారు. 2015న బదిలీపై పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరారు. ఈ ఏడాదిలో గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా చేరారు. మరో వైపు ఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టు ఆఫీసర్‌గా అనేక సేవా కార్యక్రమాలు, స్పెషల్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు. 2013లో ఉమ్మడి విజయనగరం జిల్లా ఉత్తమ అధ్యాపక అవార్డును కూడా పొందారు. తాజాగా రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకుఆయన ఎంపిక కావడంపై జిల్లాలోని పలు కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
జిల్లా ఉత్తమ గురువులు 90 మంది
పార్వతీపురం/సాలూరు రూరల్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలో 90 మందిని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేశారు. వారిలో 14 మంది హెచ్‌ఎంలు, 36 మంది ఎస్‌ఏలు, 40 మంది ఎస్జీటీలు ఉన్నారు. ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్ టూ హెచ్‌ఎం, ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలను ఒక కేటగిరీగా 14 మందికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించారు. పాఠశాల సహాయకులు, అదే క్యాడర్‌లో పీడీలు ముగ్గురు, పీజీటీతో సహా 36 మందికి స్కూల్ అసిస్టెంట్లుకు అవార్డులు ప్రకటించారు. జిల్లాలో 40 మంది సెంకడరీగ్రేడ్ ఉపాధ్యాయులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. వారితో ముగ్గురు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులకు జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్‌లో శుక్రవారం అవార్డులు అందించనున్నట్లు డీఈవో రాజ్‌కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి సంధ్యారాణి, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ప్రభుత్వ విప్ జగదీశ్వరి, ఎమ్మెల్యేలు విజయచం ద్ర, జయకృష్ణ హాజరవుతారని పేర్కొన్నారు.