ఆ ఊరి కష్టాలకు తెర!
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:31 AM
వర్షం వచ్చిందంటే ఆ ఊరి కష్టాలు అన్నీఇన్నీ కావు. బయటకు వెళ్లాంటే పెద్దగెడ్డ దాటాలి. అదేమో పది అడుగులకు పైగా ఉధృతంగా ప్రవహిస్తుంది. అత్యవసరమైతే గుండెలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాలి. స్కూలు పిల్లలు అయితే వర్షాకాలంలో సెలవు పెట్టాల్సిన పరిస్థితి.
శాసనపల్లి వంతెనకు రూ.6.12 కోట్లు మంజూరు
ఇటీవలే మాట ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు
డిప్యూటీ సీఎం పవన్ దృష్టికీ ఎక్స్‌లో సమస్య..
ఇప్పుడు నిధుల మంజూరుతో గ్రామస్థుల్లో హర్షం
వర్షం వచ్చిందంటే ఆ ఊరి కష్టాలు అన్నీఇన్నీ కావు. బయటకు వెళ్లాంటే పెద్దగెడ్డ దాటాలి. అదేమో పది అడుగులకు పైగా ఉధృతంగా ప్రవహిస్తుంది. అత్యవసరమైతే గుండెలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాలి. స్కూలు పిల్లలు అయితే వర్షాకాలంలో సెలవు పెట్టాల్సిన పరిస్థితి. అలాంటి గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వారి కష్టాలు గట్టెక్కించేందుకు రూ.6.12 కోట్లు మంజూరు చేసింది. దీంతో గ్రామస్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
జామి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): జామి మండలం శాసనపల్లి గ్రామంలో సుమారు వెయ్యి జనాభా ఉంటుంది. మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంల ఉంది. అయితే ఈ ఊరికి శాపం పెద్దగెడ్డ. వర్షం వచ్చిందంటే ఉధృతంగా ప్రవహిస్తుంది. నిత్యావసరాలు, పొలాలకు, విద్య కోసం, అత్యవసరమైతే ఈ ఊరి ప్రజలు గెడ్డను దాటాలి. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గంట్యాడ మండలం పెదమేమలికి వెళ్లాలి. ప్రస్తుతం ఈ గ్రామంలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. వర్షాలు వస్తే గంట్యాడ మండలంలో ఉన్న దేవుపల్లి, రాజేరు కొండలపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఈ గ్రామంలో బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోపతాయి. తమ సమస్య తీర్చాలని ఆ గ్రామస్థులు 40ఏళ్లుగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. వర్షాకాలంలో విద్యార్థులు పాఠశాలకు సెలువులు పెట్టి ఇంటివద్దనే ఉండిపోతున్నారు. జబ్బు చేస్తే గెడ్డ దాటేటప్పుడు ప్రవాహంలో కొట్టుకుని పోయిన ఉదంతాలు కూడా ఉన్నాయి. కొన్ని నెలల క్రితం ఈ గ్రామ యువకులు తమ కష్టాలను నేరుగా ఉపముఖ్యమంత్రికి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆతర్వాత కదలిక మొదలైంది. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు దత్తిరాజేరు పర్యటనకు వచ్చారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ద్వారా గ్రామస్థులు తమ సమస్యను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం ఆదేశించారు. రెండు రోజుల క్రితం ఈ గెడ్డపై వంతెన నిర్మాణానికి రూ.6.12 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రామస్థులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి కొండపల్లికి కృతజ్ఞతలు తెలిపారు.
రెండురోజుల క్రితం జీవో వచ్చింది
శాసనపల్లి వంతెన నిర్మాణానికి రెండురోజుల క్రితం జీవో విడుదల అయిందని కొత్తవలస పంచాయతీరాజ్ డీఈ అప్పారావు తెలిపారు. ఏపీఆర్‌ఆర్‌ఎస్పీ ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్డు స్ట్రెంథనిక్ ప్రాజెక్టు (పీఆర్‌ఆర్ ప్లెయిన్) కింద ఈ నిధులు మంజూరైనట్లు చెప్పారు. బ్రిడ్జి నిర్మాణానికి మట్టి పరీక్షలు చేపట్టాల్సి ఉందన్నారు.
జన్మంతా రుణపడి ఉంటాం:
మా గ్రమానికి ఈ గెడ్డ శాపంలా మారింది. దశాబ్దాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. వర్షం వస్తే ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయి. మా సమస్యను తీర్చాలని అందర్నీ ప్రాధేయపడ్డాం. అయితే ఈ ప్రజాప్రభుత్వం ఈ గెడ్డపై వంతెన నిర్మాణానికి రూ.6.12 కోట్లు మంజూరు చేయడం అభినందనీయం. ఈ ప్రభుత్వానికి జన్మంతా రుణపడి ఉంటాము.
- కొత్తలి సూర్యారావు, గ్రామస్థుడు
వంతెన నిర్మిస్తే కష్టాలు తీరుతాయి.
ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మా గ్రామ యువకులు ఎక్స్ వేదికగా ఉపముఖ్యమంత్రికి పంపారు. తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లాం. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి వంతెనకు నిధులు మంజూరు చేశారు. వంతెన పూర్తయితే ఈ గెడ్డ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
- ఆకిరి వెంకట అప్పారావు, గ్రామస్థుడు