నదిలో మునిగిపోయిన నాటుబండి
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:16 AM
నదిలో నుంచి పొలానికి వెళుతు న్న సమయంలో నాటు బండితో సహా రెండు ఎద్దులు నీట మునిగాయి.
రెండు ఎద్దుల మృతి.. ప్రాణాలతో బయటపడ్డ రైతు
సీతానగరం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): నదిలో నుంచి పొలానికి వెళుతు న్న సమయంలో నాటు బండితో సహా రెండు ఎద్దులు నీట మునిగాయి. బండిపై ఉన్న రైతు ప్రాణాల నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక శివాలయం దగ్గర సువర్ణముఖి నది ఒడ్డున సామంతల శ్రీనివాసరావు నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఎకరా పొలం ఉంది. ఎప్పటిలాగే తన ఎద్దుల బండితో బుధవారం సువర్ణముఖి నదికి ఆవల ఉన్న పొలంలో పనిచేయడానికి వెళ్లాడు. అయితే ఇటీవల ఎగువ ప్రాంతాలకు వర్షాలు కురవడంతో నదిలో ఉండే పెద్ద గోతులను గమనించలేదు. రెండు ఎద్దులు నాటు బండితో పాటు నేరుగా గోతిలో దిగబడి మునిగిపోయా యి. అప్రమత్తమైన రైతు శ్రీనివాసరావు బండి బీద నుంచి దిగి ముందుకు గెంతేసి ప్రాణాలను రక్షించుకున్నాడు. రైతు చూస్తుండగానే రూ.2 లక్షలు విలువైన ఎద్దులు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయాయి. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే రైతు శ్రీనివాసరావును రక్షించి బయటకు తీసుకువచ్చారు. ట్రాక్టరు తీసుకువచ్చి ఎద్దులను, టైరుబండిని బయటకు తీశారు.