New Teachers కొత్త గురువులకు పిలుపు
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:02 AM
A Call for New Teachers మెగా డీఎస్సీలో ఎంపికైన కొత్త గురువులకు బుధవారం విద్యాశాఖ ఫోన్ ద్వారా పిలుపునందించింది. ఈ మేరకు గురువారం వారు మోదవలస నుంచి అమరావతికి పయనమవనున్నారు. 19న ఉద్యోగ నియామక పత్రం అందుకోనున్నారు.
ఉమ్మడి జిల్లాలో భర్తీ కానున్న 578 టీచర్ పోస్టులు
సాలూరు రూరల్, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీలో ఎంపికైన కొత్త గురువులకు బుధవారం విద్యాశాఖ ఫోన్ ద్వారా పిలుపునందించింది. ఈ మేరకు గురువారం వారు మోదవలస నుంచి అమరావతికి పయనమవనున్నారు. 19న ఉద్యోగ నియామక పత్రం అందుకోనున్నారు. ముందుగా ఉమ్మడి జిల్లాలో కొలువు సాధించిన వారు సహాయకులను తీసుకొని డెంకాడ మండలం మోదవలస ఓయోస్టార్ ఇంటర్నేషన్ స్కూల్‌కు చేరుకోవాలి. అక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్‌లో ఉదయం ఆరున్నర గంటలకు రిపోర్ట్ చేయాలి. ఆ తర్వాత వారు మోదవలస నుంచి అమరావతికి వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబునాయుడు వారికి నియామక పత్రాలు అందిస్తారు. ఆ తరువాత కొత్త గురువులకు శిక్షణ ఇచ్చి పాఠశాలలను కేటాయిస్తారు. కాగా ఉమ్మడి జిల్లాలో 578 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీరిలో 266 ఎస్జీటీలు, పాఠశాల సహాయకుల విభాగంలో సోషల్ స్టడీస్ 67, ఫిజిక్స్ 56, బయాలజీ 36, గణితం 33, తెలుగు 14, హిందీ 14, ఆంగ్లం 30, ఫిజికల్ డైరెక్టర్ 62 పోస్టులను భర్తీ చేయనున్నారు. టీచర్ పోస్టులకు ఎంపికైన 578 మందిలో 257 మంది మహిళలు టీచర్ పోస్టులు సాధించారు. పాఠశాల సహాయకుల హిందీ విభాగంలో 14 పోస్టులకు 12 మంది మహిళలే ఆ పోస్టులను సాధించడం గమనార్హం. మేనేజ్‌మెంట్ వారీగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌లో 14, సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి మున్సిపాలిటీల్లో 55, జడ్పీ, ఎంపీపీ స్థానిక సంస్థల్లో 372, గిరిజన సంక్షేమశాఖలో 137 పోస్టులను మెగా డీఎస్సీలో ఎంపికైన వారితో భర్తీ చేయనున్నారు.
40 బస్సుల ఏర్పాటు
డీఎస్సీలో ఎంపికైన వారి కోసం ఉమ్మడి జిల్లా నుంచి 40 బస్సులు ఏర్పాటు చేసినట్టు పార్వతీపురం మన్యం జిల్లా ఆర్టీసీ డీటీపీవో వెంకటేశ్వరరావు తెలిపారు. సాలూరు డిపో నుంచి 6, పార్వతీపురం 5, పాలకొండ 6, విజయనగరం జిల్లా నుంచి 17 బస్సులు ఈ నెల 18న మోదవలస నుంచే బయలు దేరుతాయన్నారు. అమరావతిలో 19న ఉద్యోగ పత్రాల స్వీకరణ అనంతరం కొత్త గురువులను అక్కడి నుంచి విజయనగరం తీసుకొస్తామన్నారు.