Share News

మరణంలోనూ వీడని బంధం

ABN , Publish Date - May 17 , 2025 | 12:14 AM

వారిద్దరూ స్నేహితులు. ఒకే గ్రామంతో పాటు ఒకేచోట పనిచేయడంతో చాలా కలివిడిగా ఉండేవారు. ఎవరికి కష్టమొచ్చినా.. ఆనందం కలిగినా ఇద్దరూ పాలుపంచుకునేవారు. వారి అన్యోన్యాన్ని చూసిన విధికే కన్నుకుట్టిందేమో ఇద్దరినీ ఒకేసారి కబళించింది. రోడ్డు ప్రమాదంలో రూపంలో బలితీసుకుంది. విజయనగరం మండలం రాకోడు గ్రామానికి చెందిన రావాడ వెంకటరావు (32), జి.సురేష్‌ (35)ల విషాదాంతమిది.

మరణంలోనూ వీడని బంధం
జి.సురేష్‌ (ఫైల్‌), వెంకటరావు(ఫైల్‌)

మరణంలోనూ వీడని బంధం

రోడ్డు ప్రమాదంలో స్నేహితుల మృతి

డెంకాడ, మే 16(ఆంధ్రజ్యోతి): వారిద్దరూ స్నేహితులు. ఒకే గ్రామంతో పాటు ఒకేచోట పనిచేయడంతో చాలా కలివిడిగా ఉండేవారు. ఎవరికి కష్టమొచ్చినా.. ఆనందం కలిగినా ఇద్దరూ పాలుపంచుకునేవారు. వారి అన్యోన్యాన్ని చూసిన విధికే కన్నుకుట్టిందేమో ఇద్దరినీ ఒకేసారి కబళించింది. రోడ్డు ప్రమాదంలో రూపంలో బలితీసుకుంది. విజయనగరం మండలం రాకోడు గ్రామానికి చెందిన రావాడ వెంకటరావు (32), జి.సురేష్‌ (35)ల విషాదాంతమిది. డెంకాడ ఎస్‌ఐ సన్యాసినాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

రాకోడు గ్రామానికి చెందిన సురేష్‌, వెంకటరావులు విశాఖపట్నం జిల్లా పరవాడ ప్రాంతంలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాల్ని పోషిస్తున్నారు. వీరిద్దరూ కలిసి టూ వీలర్‌పై స్నేహితుని వివాహానికి బొండపల్లి మండలం గొల్లపాలెం గ్రామానికి గురువారం వెళ్లారు. వివాహం అనంతరం రాత్రి ఒంటిగంట సమయంలో తిరిగి పరవాడకు బయలుదేరారు. డెంకాడ మండలం మోదవలస సమీపానికి వచ్చేసరికి ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోవడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వచ్చి పరిశీలించేసరికి ఇద్దరూ మృతిచెందారు. సురేష్‌కు ఆరు సంవత్సరాల కుమారుడు, నాలుగు సంవత్సరాల కుమార్తె ఉన్నారు. వెంకటరావుకు ఇంకా వివాహం కాలేదు. మృతదేహాలను శుక్రవారం ఉదయం పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సన్యాసినాయుడు తెలిపారు.

Updated Date - May 17 , 2025 | 12:14 AM