విద్యాభివృద్ధికి పెద్దపీట
ABN , Publish Date - Jun 15 , 2025 | 11:57 PM
గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.

- ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం
-పిల్లలకు సన్నబియ్యంతో భోజనం
- ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహం
-‘తల్లికి వందనం’ వర్తింపు
- విద్యామిత్ర కిట్‌ల పంపిణీ
పార్వతీపురం, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యా వ్యవస్థను బలోపేతంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. దీనిలో భాగంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో 45 రకాల యాప్‌లను పెట్టి విద్యావ్యవస్థను గందరగోళం చేశారు. మరుగుదొడ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకంతో పాటు ప్రతి కార్యక్రమానికీ ఒక యాప్ పెట్టి ఉపాధ్యాయులను బోధనకు దూరం చేశారు. వారితో టాయిలెట్ల ఫొటోలు తీయించారు. విద్యార్థులకు ఇచ్చే పుస్తకాలు, బెల్టులు, బ్యాగులు, చిక్కీలపై జగన్ ఫొటలు, పేర్లు వేసుకున్నారు. ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ఎత్తేసి హైస్కూళ్లలో కలిపేశారు. వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులపై గౌరవం లేకుండా వ్యవహరించేది. దీంతో ఉపాధ్యాయ సంఘాలు ఎప్పటికప్పుడు రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి ఉండేది. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. యాప్‌ల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి కలిగించింది. కేవలం బోధనకే వారిని పరిమితం చేసింది. పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా స్కూళ్లు ప్రారంభంరోజే ప్రతి విద్యార్థికి రూ.2,279 విలువైన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్‌ల ఉచితంగా అందించారు. ఈ కిట్‌లో పాఠ్యపుస్తకాలు, నోట్, వర్క్ బుక్‌లు, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ, మూడు జతల యూనిఫారం, బ్యాగ్, బూట్లు, 2 జతల సాక్సులు, బెల్ట్ ఉన్నాయి. ఒకటో తరగతి విద్యార్థులకు పిక్టోరియర్ డిక్షనరీ ఇచ్చారు. వీటిపై ఎలాంటి రాజకీయ రంగులు, బొమ్మలు లేవు. పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి నగదు బహుమతి, అవార్డులను అందించారు. జిల్లాలో ఒక్కొక్క విద్యార్థికి రూ.20 వేలు చొప్పున 95 వేల మందికి నగదు ప్రోత్సాహం అందించారు. అలాగే, తల్లికి వందనం పథకం కింద ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.13వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమచేశారు. జిల్లాలో ఈ పథకం కింద 1,08,957 మంది పిల్లలకు రూ.163.43 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. 59,600 మంది తల్లుల ఖాతాల్లో నగదును జమ చేయడం ప్రారంభించింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక ఇంటిలో ఒక విద్యార్థికి మాత్రమే అమ్మఒడి పథకం అందించారు. అలాగే, పాఠశాలల నిర్వహణకు భారీగా నిదులు మంజూరు చేస్తోంది. ఇప్పటికే జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, ఎంఆర్‌సీల నిర్వహణకు రూ.1.20కోట్లు మంజూరు చేసింది. ఇలా విద్యావ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతుండడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.