Share News

Pension Distribution 93 శాతం పింఛన్ల పంపిణీ

ABN , Publish Date - Jul 01 , 2025 | 11:45 PM

93% Pension Distribution Completed జిల్లావ్యాప్తంగా మంగళవారం 93 శాతం మేర ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు సొమ్ము అందించారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా లెక్కచేయలేదు. జిల్లాలో 1,38,769 మంది లబ్ధిదారులకు గాను తొలిరోజు 1,27,827 మందికి పింఛన్‌ అందజేశారు.

  Pension Distribution 93 శాతం పింఛన్ల పంపిణీ
పింఛన్లు పంపిణీ చేస్తున్న కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

గరుగుబిల్లి, జూలై 1(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా మంగళవారం 93 శాతం మేర ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు సొమ్ము అందించారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా లెక్కచేయలేదు. జిల్లాలో 1,38,769 మంది లబ్ధిదారులకు గాను తొలిరోజు 1,27,827 మందికి పింఛన్‌ అందజేశారు. ఈ నెల పింఛన్ల పంపిణీకి సంబం ధించి ప్రభుత్వం రూ. 59.21కోట్లను విడుదల చేసింది. ఇక పార్వతీపురం మండలం అడ్డాపుశీల గ్రామంలో లబ్ధిదారులకు కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ పింఛన్లు అందించారు. తొలుత ఆ గ్రామంలో అడ్డాపుశీలలో అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి చిన్నారులతో కాసేపు మాట్లాడారు. స్టోర్‌ రూమ్‌లోని నిత్యావసర సరుకులు, కోడిగుడ్లు నిల్వలు, రిజిస్టర్లను పరిశీలించారు. చిన్నారులు అనారోగ్యం బారిన పడకుండా చూడాలన్నారు. వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించి చక్కగా బోధించాలని సూచించారు. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలకు ఫర్నీచర్‌ను పంపిణీ చేయడంతో పాటు అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, మౌలిక వసతులతో జిల్లాలో అంగన్‌వాడీ వ్యవస్థ మరింత బలోపేతం కావాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ అన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులందరూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కలెక్టర్‌ సూచించారు. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అడ్డాపుశీలలో గ్రామంలో స్వయం సహాయ సంఘాలు నిర్వహించబడుతున్న వస్త్ర వ్యాపారాన్ని ఆయన పరిశీలించారు. స్ర్తీనిధి నుంచి లక్ష రుపాయలు రుణంగా పొంది వస్త్ర వ్యాపారం నిర్వహించు కోవడం ఆనందంగా ఉందన్నారు.

స్పౌజ్‌ పింఛన్లకు ఎదురుచూపు

గరుగుబిల్లి: జిల్లాలో ఎంతోమంది అర్హులు స్పౌజ్‌ పింఛన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్‌ భరోసా కింద సామాజిక పింఛన్‌ పొందుతున్న భర్త చనిపోతే.. ఆ తర్వాత నెలలోనే అతని భార్యకు పింఛన్‌ వర్తించేలా ప్రభుత్వం స్పౌజ్‌ కేటగిరీని ప్రవేశపెట్టింది. ఈ మేరకు జిల్లాలో 1,521 మందికి పింఛన్లు మంజూరు చేశారు. 2023, డిసెంబరు 1 నుంచి 2024, అక్టోబరు 31 మధ్య కాలంలో పింఛన్‌ పొంది మృతి చెందిన వారి జీవిత భాగస్వాములకు పింఛన్లు అందించాలని నిర్ణయించారు. అయితే వివిధ కారణాలతో మే, జూన్‌ నెలల్లో వాటిని పంపిణీ చేయలేకపోయారు. ఈ నెలలో స్పౌజ్‌ పింఛన్లకు సంబంధించి నగదు విడుదలైనా ఇప్పటివరకూ పంపిణీ చేయలేదు. త్వరితగతిన వాటిని అందించాలని జిల్లావాసులు కోరుతున్నారు.

తేదీ ఖరారు కావల్సి ఉంది..

జిల్లాలో 1,521 మందికి స్పౌజ్‌ పింఛన్ల నగదు విడుదలైంది. అయితే వాటి పంపిణీకి తేదీ ఖరారు కావాల్సి ఉంది. ఈ పింఛన్ల కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని సమస్యల కారణంగా మే, జూన్‌ నెలల్లో పంపిణీ కాలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పౌజ్‌ పింఛన్లను ఎప్పుడు పంపిణీ చేస్తామన్నది త్వరలోనే వెల్లడిస్తాం.

- ఎం.సుధారాణి, పీడీ, డీఆర్‌డీఏ

Updated Date - Jul 01 , 2025 | 11:45 PM