డోలీలో 8 కిలోమీటర్లు
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:13 AM
అది అత్యంత క్లిష్టమైన సమయం. కానీ వాహనం ఊరులోకి రాలేని దైన్యం. ఆలస్యమైతే రెండు ప్రాణాలకు భయం. ఇక చేసేదిలేక ఆ ఊరి జనం డోలీని పట్టుకున్నారు. నిండు గర్భిణిని 8 కిలోమీటర్ల దూరం
అది అత్యంత క్లిష్టమైన సమయం. కానీ వాహనం ఊరులోకి రాలేని దైన్యం. ఆలస్యమైతే రెండు ప్రాణాలకు భయం. ఇక చేసేదిలేక ఆ ఊరి జనం డోలీని పట్టుకున్నారు. నిండు గర్భిణిని 8 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లి...వాహనంలోకి ఎక్కించి..ఆస్పత్రికి తరలించారు. ఆ మహిళ పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. వర్షాల సమయంలో కొత్తబట్టివలస వాసుల దుస్థితి.
బొబ్బిలి రూరల్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోగల కొత్తబట్టివలస గిరిజన గ్రామానికి చెందిన సిదరపు గౌరమ్మకు మంగళవారం పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో డోలీలో తరలించాల్సి వచ్చింది. ఆ గ్రామానికి పక్కా రహదారి లేకపోవడం... ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఉన్న రోడ్డు బురదమయం కావడంతో కొత్తబట్టివలస నుంచి గోపాలరాయుడుపేట వరకూ ఎనిమిది కిలోమీటర్లు డోలీలోనే గ్రామస్థులు మోసుకొని వెళ్లారు. అక్కడి నుంచి పది కిలోమీటర్ల దూరంలో గల పిరిడి పీహెచ్‌సీకి 108 వాహనంలో తరలించారు. అనంతరం వైద్యాధికారి రఘువంశీ పరీక్షించి ప్రసవానికి ఏర్పాట్లు చేయించారు. ఆమెకు మగబిడ్డ జన్మించాడని...తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని రఘువంశీ తెలిపారు.
ఏటా వర్షాకాలంలో తప్పని అవస్థలు
మండలంలోని కొత్త బట్టివలస, అక్కేనవలస, మోసూ రువలస, సియోనువలస, కృపావలస తదితర గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. దీంతో ఏటా వర్షాకాలంలో అనారోగ్యంతో బాధ పడేవారిని, గర్భిణులను డోలీలో ఆస్పత్రులకు తరలించాల్సి వస్తోంది. గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాలు ప్రజలు రోడ్లు, ఇతర సదుపాయాల కోసం అనేకసార్లు అధికారులకు విన్నవించుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో వీరి సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా... వందల కోట్లు రూపాయలు గిరిజనుల అభివృద్ధికి వెచ్చిస్తున్నామని పాలకులు పెద్ద ప్రచారం చేయడమే తప్ప నిజమైన అభివృద్ధి కానరావడంలేదని ప్రగతిశీల మహిళా సంఘ అధ్యక్షురాలు పోల రమణి ఆరోపించారు.