కారులో 70కిలోల గంజాయి
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:19 AM
70 kg of ganja in the car

కారులో 70కిలోల గంజాయి
ఉత్తరాధి రాష్ట్రాలకు తరలించే ప్రయత్నం
బొడ్డవర చెక్‌పోస్టు వద్ద అడ్డుకున్న పోలీసులు
ఐదుగురి అరెస్టు
వివరాలు వెల్లడించిన ఎస్పీ వకుల్‌జిందాల్
విజయనగరం క్రైం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాధి రాష్ట్రాల్లో విక్రయించే వ్యూహాంతో గంజాయిని తరలిస్తున్న ఐదుగురి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎస్.కోట మండలం బొడ్డవర చెక్‌పోస్టు వద్ద బుధవారం పక్కా సమాచారంతో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా అటుగా వచ్చిన కారును ఆపి సోదా చేశారు. అందులోని 70.100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేసి కారును సీజ్ చేశారు. ఎస్పీ వకుల్‌జిందాల్ బుధవారం విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గంజాయి రవాణాపై సమాచారం అందడంతో అప్రమత్తమైన ఎస్.కోట పోలీసులు బుధవారం బొడ్డవర చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపట్టారు. అటుగా వస్తున్న ప్రతి వాహనాన్నీ సోదా చేశారు. అంతలో అరకు నుంచి డబ్ల్యూబీ06జీ1206 నెంబరు గల కారు వచ్చింది. అందులో ఐదుగురు ఉన్నారు. తనిఖీల్లో భాగంగా కారు డిక్కీ తెరిచి చూశారు. బ్రౌన్ కలర్ టేపు చుట్టిన 56 గంజాయి ప్యాకెట్లు (70.100కిలోలు) గుర్తించారు. సరుకును స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేశారు. ఐదుగురి నిందితులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
డబ్బుపై ఆశతో..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినికి చెందిన షా ఆలం, బెంగళూరు ప్రాంతానికి చెందిన షేక్ అజాజ్‌లు దుప్పట్లు వ్యాపారం చేస్తున్నారు. వివిధ ప్రాంతాలకు కారులోనే వెళ్తుంటారు. వీరికి ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరికి చెందిన రంజిత్ బిశ్వాస్, నిఖిల్ తపాలీ, బిశ్వజిత్ మహాల్దార్‌తో పరిచయం ఏర్పడింది. గంజాయి వ్యాపారం చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చునని చెప్పడంతో ఆశ పడ్డారు. గంజాయిని ఉత్తరాధి రాష్ట్రాలకు చేర్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ప్రకారం ఒడిశాలో సేకరించిన గంజాయిని ఐదుగురు కలిసి తరలించే పనిలో ఉండగా బొడ్డవర చెక్‌పోస్టు వద్ద దొరికిపోయారు. వారి వద్ద నుంచి నాలుగు మొబైల్‌ఫోన్లు, రూ.20, 300 నగదును స్వాధీనం చేసుకున్నారు. సీఐ వీఎన్‌మూర్తి, ఎస్‌ఐ చంద్రశేఖర్, ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్.కోట ఇన్‌స్పెక్టరు వి.నారాయణమూర్తి, ఎస్‌బీ సీఐ ఏవీ లీలారావు పాల్గొన్నారు.