Employment Guarantee: ‘ఉపాధి’ పనిదినాలు 60 లక్షలు
ABN , Publish Date - Apr 10 , 2025 | 11:41 PM
Employment Guarantee:మన్యం జిల్లా పరిధిలో ఉపాధి హామీ పనుల నిర్వహణకు అవసరమైన ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేశారు.

- ఈ ఏడాది కల్పించేందుకు ప్రతిపాదనలు
- మరింతగా పెరిగే అవకాశం
- వేతనాల కోసం తప్పని నిరీక్షణ
గరుగుబిల్లి, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): మన్యం జిల్లా పరిధిలో ఉపాధి హామీ పనుల నిర్వహణకు అవసరమైన ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 15 మండలాల్లోని 450 పంచాయతీల్లో 60 లక్షల పనిదినాలకు ప్రతిపాదనలు చేశారు. గతేడాది 1.15 కోట్ల పనిదినాలు మంజూరు కాగా, 1.29 కోట్ల పనిదినాలు కల్పించారు. ఈ ఏడాది 60 లక్షల మేర ప్రతిపాదించినా మరింతగా పెరిగే అవకాశం ఉంది. గతేడాది 1.79 లక్షల కుటుంబాలకు పని కల్పించారు. ఈ పనుల్లో 3.10 లక్షల మందికి పైగా వేతనదారులు పాల్గొన్నారు. అలాగే 4,094 మంది దివ్యాంగులకు కూడా పనులు కల్పించారు. మొత్తం 61 వేల పనుల నిర్వహణకు సుమారు రూ.447 కోట్లు వ్యయం చేశారు. ఇందులో వేతనాల రూపంలో రూ. 322 కోట్లు, మెటీరియల్‌కు సంబంధించి రూ.112 కోట్లు వ్యయం చేశారు. ఈ ఏడాది ప్రతిపాదనలు చేసిన పలు పనులకు సంబంధించి నిధులు మంజూరు కావాల్సి ఉంది. ఈ ఏడాది వేతనదారులకు అదనంగా రూ.7 కేటాయించారు. మొత్తం సగటు వేతనం రూ.307గా నిర్ణయించారు. నూతనంగా అమలు చేస్తున్న ఎన్‌ఎంఎంఎస్ యాప్‌లో పనుల సమాచారం పొందుపర్చాలి. ముందస్తు కొలతలు, నిర్దేశించిన మేరకు పనులు నిర్వహిస్తేనే సగటు వేతనం అందే అవకాశం ఉంది. సరాసరి వేతనంగా రూ.261గా నిర్ణయించారు. నూతన వేతనం అమలును సాఫ్ట్‌వేర్‌లో రూపొందించారు. గతేడాది రూ.260 ఉండేది. ఈ ఏడాది రూ.11 అదనంగా పెరగనుంది. గతేడాది 100 రోజులు పూర్తి చేసిన కుటుంబాలు 46,227 ఉన్నాయి. ఈ ఏడాది నూతనంగా లక్ష్యాలు విధించనున్నారు.
వేతనాలకు ఎదురుచూపు..
జిల్లాలోని 15 మండలాల్లోని ఉపాధి కూలీలు వేతనాల కోసం ఎదురుచూపు చూస్తున్నారు. 10 వారాలుగా వారికి వేతనాలు జమ కాలేదు. ప్రస్తుత వేసవిలో పనుల ప్రాంతాల్లో సౌకర్యాలు లేనప్పటికీ ఉపాధి పొందేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. వీటికి తోడు పాఠశాలలు, అంగన్‌వాడీలు, వసతి గృహాలకు ప్రహరీల నిర్మాణం చేపట్టారు. 15 మండలాల పరిధిలో 323 ప్రహరీలు మంజూరు కాగా 232 నిర్మాణాలు పూర్తయ్యాయి. అలాగే గోకులాలతో పాటు పలు పనులకు సంబంధించి నిర్మాణాలు పూర్తయినా చెల్లింపులు కాలేదు. వేతనదారులకు రూ.31.69 కోట్లు, నిర్మాణ పనులకు సంబంధించి రూ. 11.16 కోట్లు చెల్లించాల్సి ఉంది. గత నెలలో చెల్లింపులు జరుగుతాయని అంతా భావించారు. కానీ, ఆర్థిక సంవత్సరం మారినా చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఒకవైపు వేతనదారులు, మరోవైపు పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
అవకతవకలకు పాల్పడితే చర్యలు
ఈ ఏడాదికి గాను 60 లక్షల పనిదినాలకు ప్రతిపాదనలు చేశాం. మరింతగా బడ్జెట్‌లో పెరిగే అవకాశాలు ఉన్నాయి. వలసలు వెళ్లకుండా ఉండేందుకు ప్రతి వేతనదారునికి పని కల్పిస్తాం. ఈ ఏడాది వేతనంగా రూ.307 నిర్ణయించాం. వేతన పెంపుదలపై ఆదేశాలు అందాయి. పనుల నిర్వహణలో అవకతవకలు నెలకొనకుండా ఉండేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. అవకతవకలు బహిర్గతమైతే సంబంధిత సిబ్బందిపై చర్యలతో పాటు రికవరీ చేస్తాం. ఉపాధి పనుల్లో తప్పిదాలకు ఆస్కారం లేకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నాం. ఉపాధి వేతనాలు, బిల్లుల పెండింగ్‌పై రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించాం.
-కె.రామచంద్రరావు, జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్