5 kilos at Quinta! క్వింటా వద్ద 5 కిలోలు!
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:35 PM
5 kilos at Quinta! జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. అయితే ఆ కేంద్రాల్లో ఇంకా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. అక్కడ షెడ్యూల్ ఇచ్చేవారు లేరు. శాంపిళ్లు సేకరించేవారు లేరు. తేమను నిర్ధారించే యంత్రాలు లేవు. దీంతో చాలామంది రైతులు నేరుగా మిల్లులకు ధాన్యం ఇస్తున్నారు. వారు రూ.100లు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఆపై క్వింటా ధాన్యం దగ్గర ఐదు కిలోలు చొప్పున తరుగు కింద అదనంగా తీసుకుంటున్నారు.
క్వింటా వద్ద 5 కిలోలు!
తరుగు కింద మిల్లర్లకు ఇస్తేనే కొనుగోలు
ఆపై దళారులకు రూ.100 కమీషన్
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో దందా
జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. అయితే ఆ కేంద్రాల్లో ఇంకా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. అక్కడ షెడ్యూల్ ఇచ్చేవారు లేరు. శాంపిళ్లు సేకరించేవారు లేరు. తేమను నిర్ధారించే యంత్రాలు లేవు. దీంతో చాలామంది రైతులు నేరుగా మిల్లులకు ధాన్యం ఇస్తున్నారు. వారు రూ.100లు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఆపై క్వింటా ధాన్యం దగ్గర ఐదు కిలోలు చొప్పున తరుగు కింద అదనంగా తీసుకుంటున్నారు.
విజయనగరం, నవంబరు 26(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఇంకా పుంజుకోకముందే దందా మొదలైపోయింది. క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంతో దళారులు రంగప్రవేశం చేసి రైతులను భయపెట్టి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ మంది రైతులు దళారుల బారిన పడుతున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది మద్దతు ధరను ముందే ప్రకటించింది. కామన్ రకం క్వింటా రూ.2,369, ఏ గ్రేడ్ రకం క్వింటా రూ.2,389గా నిర్ధారించింది. అయితే 17 శాతంలోపు తేమ ఉంటే బస్తా (80 కిలోలు) రూ.1895 మద్దతు ధరగా ప్రకటించింది. అయితే దళారులు రైతుల్లో భయాలు సృష్టించి, వారిలో లేనిపోని అయోమయం కల్పించి రూ.2100 లేదా అంతకన్నా తక్కువకు అడుగుతున్నారు.
అవగాహన కీలకం
రైతులకు అవగాహన లేక చాలా ప్రాంతాల్లో దళారులబారిన పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కోసం వాట్సాప్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. రైతులు 7337359375 నంబరుకు హాయ్ అని మెసేజ్ పెట్టగానే పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందిస్తారు. రైతుల వద్ద ఎన్నిబస్తాల ధాన్యం ఉన్నాయి? ఏ రకం? బస్తాలు ఎప్పటికి సిద్ధమవుతాయి? వంటి వివరాలు ఆరా తీస్తారు. ఏ కేంద్రంలో ఏ రోజు? ఏ సమయానికి? ఏ రకం ధాన్యం..ఎన్ని బస్తాలు అమ్ముతారో తదితర వివరాలతో స్లాట్ బుక్ అవుతుంది. ఈ విధానంతో రైతులు ఏ కేంద్రంలో అమ్ముకోవాలి? ఎక్కడికి తరలించాలి? అన్న ఆందోళన ఉండదు. ధాన్యం విక్రయించిన 45 గంటల్లో నగదు రైతుల అకౌంట్లలో జమ అవుతుంది. మరోవైపు రైతులకు ధాన్యం విక్రయాల్లో ఇబ్బందులు ఎదురైతే తెలియజెప్పేందుకు 1967 టోల్ ఫ్రీ నంబర్‌ను సైతం అందుబాటులో తెచ్చారు. కంట్రోల్ రూం నంబరు 8978975284 నంబరుకు సైతం సంప్రదించవచ్చు.
17 శాతం కన్నా తక్కువ ఉన్నా...
గతంలో తుఫాన్ కారణంగా జిల్లాలో కొన్నిప్రాంతాల్లో వరిపంట కొద్దిగా తడిచింది. దాన్ని సాకుగా చూపి మిల్లర్లు ధాన్యంలో 17 శాతం తేమ ఉందంటూ ఒక్కో క్వింటాకు 5, 6 కేజీలు తీసివేస్తున్నారు. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.
చివరి గింజ వరకూ కొనుగోలు
చివరి ధాన్యం గింజ వరకూ కొనుగోలు చేస్తాం. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రైతులు దళారుల బారిన పడొద్దు. మిల్లర్లు ధాన్యం తూకంలో తగ్గించి తూకం వేస్తే వెంటనే అక్కడి నుంచే టోల్‌ఫ్రీ నెంబరు లేదా జిల్లా కంట్రోల్ నెంబర్‌కు ఫోన్ చేయొచ్చు.
- శాంతి, డీఎం, పౌరసరఫరాల సంస్థ, విజయనగరం
----------------