'Bangaru' Families బంగారు కుటుంబాలు 42,817
ABN , Publish Date - Jul 05 , 2025 | 10:44 PM
42,817 'Bangaru' Families Identified జిల్లాలో 42,817 బంగారు కుటుంబాలు ఉన్నాయని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. ఈ కుటుంబాలను మార్గదర్శి (గైడ్)తో సమన్వయం చేయాలన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులకు వర్క్‌షాప్ నిర్వహించారు.

పార్వతీపురం, జూలై 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 42,817 బంగారు కుటుంబాలు ఉన్నాయని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. ఈ కుటుంబాలను మార్గదర్శి (గైడ్)తో సమన్వయం చేయాలన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులకు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ప్రభుత్వం బంగారు కుటుంబాలను ఆన్‌లైన్ ద్వారా ఎంపిక చేసింది. పీ4 కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నియోజకవర్గస్థాయి వర్క్‌షాప్‌లను జిల్లాలో ఏర్పాటు చేశారు. వివిధ రకాల సహాయక కార్యక్రమాలను మార్గదర్శి సాయంతో అందించడం ద్వారా ఆయా కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే పీ4 కార్యక్రమం ముఖ్య లక్ష్యం. కుటుంబం ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకునే వరకు సంబంధిత అధికా రులు నిబద్ధతతో పనిచేయాలి. కుటుంబ అవసరాలను తెలుసుకోవడానికి సర్వే నిర్వహించాలి. ఇళ్లను మార్గదర్శితో మ్యాప్ చేయాలి. పనిని పర్యవేక్షించడానికి సిబ్బందిలో ఒకరిని కన్వీనర్‌గా నియమించాలి. ఈ కార్యక్రమానికి జాయింట్ కలక్టర్ నోడల్ అధికారిగా ఉంటారు.యోగాంధ్రలో దాదాపు ఐదు లక్షల మంది భాగస్వాములయ్యారు. ఇది గొప్ప విజయం. జిల్లా యంత్రాంగం అదే స్ఫూర్తితో పనిచేసి మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.’ అని తెలిపారు. అనంతరం జేసీ శోభిక మాట్లాడుతూ పీ-4 వెబ్‌సైట్‌లో మార్గదర్శిగా నమోదు చేసుకోవడానికి ప్రజలు ముందుకు రావాలన్నారు. ఈ సమావేశంలో పార్వతీపురం, సీతంపేట సబ్ కలెక్టర్లు అశుతోష్ శ్రీవాస్తవ, యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో హేమలత తదితరులు పాల్గొన్నారు.
10న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్
జిల్లాలో ఈనెల 10న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) జరుగుతుందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజా ప్రతినిధులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, టెన్త్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తదితరులతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు తదితర అన్ని మేనేజ్‌మెంట్ విద్యా సంస్థల్లో మెగా పీటీఎం నిర్వహించాల్సి ఉంది. జిల్లాలో 1787 విద్యా సంస్థలు ఉన్నాయి. ఇందులో 1,29,730 మంది విద్యార్థులు చదువుతున్నారు. మెగా పీటీఎంలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 11 గంటకు విద్యార్థుల ప్రగతి, పాఠశాలల్లో చేపట్టిన కార్యకలాపాలను తెలియజేస్తారు. తల్లిదండ్రులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తారు. ఆ తర్వాత సమావేశం ఉంటుంది. అతిఽథులతో పాటు తల్లిదండ్రులు, పదో తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యారులు, పూర్వ విద్యార్థులు తదితరుల అభ్రిపాయాలు తెలుసుకోనున్నారు.’ అని తెలిపారు. జిల్లాలో పీటీఎంకు విస్తృత ఏర్పాట్లు చేయాలని మరోవైపు జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు. విద్యార్థులు స్కూల్ యూనిఫారం ధరించాలని, సర్వేపల్లి రాధాకృష్ణన్ స్కూల్ కిట్లు ఉండాలని సూచించారు. తల్లిదండ్రులతో పాటు మిగతావారందరికీ భోజనం ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి వై.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.