రోడ్డు ప్రమాదంలో 35 గొర్రెల మృతి
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:59 PM
మండల పరిధిలోని జొన్నవలస హైవే మీద శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 35 గొర్రెలు అక్కడిక్కడే మృతిచెందగా, 15 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి.
15 గొర్రెలకు తీవ్ర గాయాలు
విజయనగరం రూరల్/ గంట్యాడ, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని జొన్నవలస హైవే మీద శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 35 గొర్రెలు అక్కడిక్కడే మృతిచెందగా, 15 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసు కుంది. ఈ విషయాన్ని రాకోడు ఎంపీటీసీ సభ్యుడు, టీడీపీ నాయకుడు వేచలపు శ్రీనివాస్.. అధికారులతో పాటు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రసాదుల ప్రసాద్‌కు తెలియజేశారు. వెంటనే ప్రసాద్ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఘట నా స్థలం వద్ద ఉన్న గొర్రెల యజమానులు గంట్యాడ మండలం సిరిపురం గ్రామానికి చెందిన కర్రి సింహాద్రి, కర్రి కృష్ణలను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచే ఎమ్మెల్యే అదితి గజప తిరాజుకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. గొర్రెల కాపరులను ఆదుకోవాలని, ప్రభుత్వం నుంచి వారికి సాయం అందే విధంగా చూడాలని కోరారు. ఈ ప్రమాదంపై విజయనగరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వాహనం ఏదన్నది.. విచారణలో తేలుతుందని పోలీసులు తెలిపారు.