31 candidates for each post ఒక్కో పోస్టుకు 31 మంది పోటీ
ABN , Publish Date - May 20 , 2025 | 11:46 PM
31 candidates for each post ఉపాధ్యాయ పోస్టులకు జిల్లా వ్యాప్తంగా పురుషుల కంటే మహిళలే అధికంగా దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌లో ప్రకటించిన 583 పోస్టులకు 18,001 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఒక్కో పోస్టుకు 31 మంది పోటీ
జిల్లా వ్యాప్తంగా 583 ఉపాధ్యాయ పోస్టులు
18,001 మంది అభ్యర్థులు
31,038 దరఖాస్తులు
మహిళలే అధికం
విజయనగరం కలెక్టరేట్, మే 20(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ పోస్టులకు జిల్లా వ్యాప్తంగా పురుషుల కంటే మహిళలే అధికంగా దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌లో ప్రకటించిన 583 పోస్టులకు 18,001 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒక్కొక్కరూ రెండు లేదా మూడు పోస్టులకు పోటీ పడుతుండడంతో దరఖాస్తుల సంఖ్య 31,038కు పెరిగింది. ఒక్కో ఉపాధ్యాయ ఉద్యోగానికి దాదాపు 31 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత నెల 20న మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అర్హులైన అభ్యర్థులు ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకున్నారు. మే 30 నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. తరువాత ఫైనల్ కీ విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించి, మెరిట్ లిస్టు విడుదల చేస్తారు. పరీక్షకు ఇచ్చిన గడువు 90 రోజులకు పెంచాలని కొందరు నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నార్మలైజేషన్ రద్దు చేసి ఒకే పేపర్ విధానం ఉండాలని ఇంకొందరు కోరుతున్నారు. వైసీపీ హయంలో 2023 అక్టోబరు 3 నుంచి 21 వరకూ టెట్ పరీక్ష నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేశారు. టెట్‌కు జిల్లాలో 22,890 మంది దరఖాస్తు చేసుకోగా 20,354 మంది పరీక్ష రాశారు. 2534 మంది పరీక్ష దూరంగా ఉండిపోయారు. అందులో 50 శాతం మంది అభ్యర్థులు క్వాలీపై అయ్యారు. కాగా డీఎస్సీ పరీక్షలకు సమయం సమీపిస్తుండడంతో నిరుద్యోగులు రేయింబవళ్లూ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. కోచింగ్ సెంటర్లు వారితో కళకళలాడుతున్నాయి. లైబ్రరీలోనూ వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇళ్ల వద్ద ఉంటూ ఆన్‌లైన్ కోచింగ్ తీసుకుంటూ కూడా చాలా మంది సన్నద్ధం అవుతున్నారు.
=========