Share News

2.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

ABN , Publish Date - Dec 21 , 2025 | 11:49 PM

ఖరీఫ్‌ 2025-26 సీజన్‌లో నేటివరకు జిల్లాలో 360 రైతు సేవా కేంద్రాల ద్వారా 2.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం 41,275 మంది రైతుల నుంచి సేకరించామని పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్‌ జిల్లా మేనేజరు బి.శాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

2.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

రాజాం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ 2025-26 సీజన్‌లో నేటివరకు జిల్లాలో 360 రైతు సేవా కేంద్రాల ద్వారా 2.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం 41,275 మంది రైతుల నుంచి సేకరించామని పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్‌ జిల్లా మేనేజరు బి.శాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఆంధ్రజ్యోతిలో కల్లాల్లో ధాన్యం- రైతుల్లో ధైన్యం అనే శీర్షికన వచ్చిన కథనానికి ఆమె పైవిధంగా స్పందించారు. ఈ మేరకు కొనుగోలు చేసిన ధాన్యానికి గాను రూ.401కోట్లు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశామని చెప్పారు. రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్‌ మిల్లులకు తరలిస్తున్నామన్నారు. జేసీ ఆదేశాల మేరకు నేటివరకు 163 రైస్‌ మిల్లర్ల నుంచి రూ.220కోట్లు విలువైన బ్యాంకు గ్యారంటీలను సేకరించామని తెలిపారు. ధాన్యం దిగుబడి ఎక్కువగా ఉండి రైస్‌ మిల్లులు తక్కువగా ఉన్న మండలాల్లో ఆర్‌ఎస్‌కేలను పక్క మండలాల రైస్‌ మిల్లులకు ట్యాగ్‌ చేయడం ద్వారా రైతుల ధాన్యం తరలింపునకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. లక్ష్యానికి తగ్గ బ్యాంకు గ్యారంటీలు సమర్పించని రైస్‌ మిల్లులకు, అలాగే రైతుల నుంచి అదనపు కేజీలు డిమాండ్‌ చేస్తున్న రైస్‌ మిల్లర్లకు జాయింట్‌ కలెక్టర్‌ నోటీసులు జారీ చేశారని తెలిపారు. సంతకవిటి మండలంలో ఎంఏవోలు సమర్పించిన నివేదిక ప్రకారం ప్రస్తుతం సంవత్సరం మండలంలో 21,361 ఎకరాల విస్తీర్ణంలో ఈ-క్రాప్‌ నమోదు చేశామని, ఈ సంవత్సరం ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియ తీసివేయడం వల్ల కొందరు రైతులు ఈ-క్రాప్‌ నమోదు కాలేదని అపోహలకు లోనవుతున్నారన్నారు. రీ సర్వే ప్రక్రియ కారణంగా గ్రామాల్లో ఈ-క్రాప్‌ చేసినప్పటికీ కొందరు రైతులు ఆధార్‌ వివరాలు మ్యాచ్‌ కాకపోవడంతో వారి వివరాలు తాత్కాలికంగా కనబడడం లేదని ఆమె స్పష్టం చేశారు. రైతులకు ధాన్య కొనుగోలు, ఈ-క్రాప్‌ ప్రక్రియలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం లేదని, జిల్లా యంత్రాంగం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అన్ని చర్యలు సకాలంలో చేపడుతూ నిరంతరం పర్యవేక్షణ చేస్తోందని తెలిపారు.

Updated Date - Dec 21 , 2025 | 11:49 PM