20 Years of Waiting 20 ఏళ్ల నిరీక్షణ
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:50 PM
20 Years of Waiting ఓ కూతురి 20 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆమె ఎదురుచూపులు ఫలించాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ఎట్టకేలకు తన తండ్రిని గుర్తించింది. ఉపాధి కోసం వలస వెళ్లి తప్పిపోయిన తండ్రిని జిల్లాకు రప్పించాలని జిల్లా అధికారులను కోరుతోంది.

వలస వెళ్లి తప్పిపోయిన అప్పారావు
తమిళనాడులో గొర్రెలకాపరిగా వెట్టిచాకిరీ
లేబర్ అధికారుల తనిఖీతో వెలుగులోకి..
సామాజిక మాధ్యమాల్లో ఫొటో చూసి గుర్తు పట్టిన కుమార్తె
పార్వతీపురం రప్పించేందుకు కలెక్టర్ ప్రయత్నాలు
పార్వతీపురం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఓ కూతురి 20 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆమె ఎదురుచూపులు ఫలించాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ఎట్టకేలకు తన తండ్రిని గుర్తించింది. ఉపాధి కోసం వలస వెళ్లి తప్పిపోయిన తండ్రిని జిల్లాకు రప్పించాలని జిల్లా అధికారులను కోరుతోంది. వివరాల్లోకి వెళ్తే..
ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా బంధుగాం బ్లాక్ చినవల్లాడ గ్రామానికి చెందిన జాతాపు ఆదివాసి కొండగొర్రె అప్పారావు తన కుమార్తెకు పెళ్లిన చేసిన అనంతరం ఉపాధి కోసం పొరుగు రాష్ట్రానికి బయల్దేరాడు. 20 ఏళ్ల కిందట స్వగ్రామం నుంచి తన స్నేహితులు పీడిక పెంటయ్య, ఆరిక నరస, పీడిక అయప్పతో కలిసి కలిసి రైలులో పాండిచ్చేరి బయలుదేరాడు. మధ్యలో టీ తాగడానికి అప్పారావు దిగిపోగా.. రైలు వెళ్లిపోయింది. డబ్బులు లేకపోవడంతో.. ఎటు వెళ్లాలో తెలియక ఆయన అక్కడే ఉండిపోయాడు. కాగా ఇటీవల కాలంలో తమిళనాడులో శివగంగ జిల్లా కదంబకళం ప్రాంతంలో కార్మిక శాఖ అధికారుల తనిఖీల్లో అప్పారావు వ్యవహారం వెలుగుచూసింది. గొర్రెల కాపలాదారుడిగా వెట్టిచాకిరీ చేస్తున్నట్లు గుర్తించారు. కాగా అప్పారావు వివరాలు సామాజిక మాధ్యమాలు, పత్రికల్లో వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయాన్ని పార్వతీపురం మండలం ములక్కాయవలసలో ఉంటున్న కూతురు సాయమ్మ, అల్లుడు డుంబుదొర చందు తెలుసుకున్నారు. సోషల్ మీడి యాలో ప్రసారమవుతున్న అప్పారావు ఫొటోను చూసి తన తండ్రిగా సాయమ్మ గుర్తించింది. ఈ మేరకు మంగళవారం తన భర్తతో కలిసి కలెక్టరేట్‌కు చేరుకుంది. వెంటనే తన తండ్రిని పార్వతీపురం రప్పించాలని వేడుకుంది. దీనిపై స్పందించిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అప్పారావు వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆయన్ని జిల్లాకు తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆనందంగా ఉంది..
అప్పారావు అలియాస్ చుక్క నా తండ్రిగా గుర్తించాను. సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన్ని గుర్తించా. వెంటనే అధికారులను కలిశా. సుమారు 20 ఏళ్ల తర్వాత నా తండ్రి మా దగ్గరకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది.
-సాయమ్మ, అప్పారావు కుమార్తె
===========================
తండ్రిలా చూసుకునేవారు..
మామ అప్పారావు నన్ను తండ్రిలా చూసుకునేవారు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన ఆచూకీ తెలుసుకున్నాం. ఎంతో సంతోషంగా ఉంది. త్వరలోనే మా దగ్గరకు వస్తారని ఆశిస్తున్నా.
- డుంబుదొర, అప్పారావు అల్లుడు