20 acres occupied 20 ఎకరాల కబ్జా
ABN , Publish Date - Aug 11 , 2025 | 12:21 AM
20 acres occupied అది 20 ఎకరాల ప్రభుత్వ భూమి. ఆ ప్రకృతి సంపదను పప్పుబెల్లాల్లా ఎవరికివారు ఇష్టారాజ్యంగా వాటాలు వేసేసుకున్నారు. కొన్నాళ్లపాటు దర్జాగా సాగుచేసుకొని ఫలసాయాన్ని కూడా అనుభవించి ఆ తర్వాత సొంతభూమిని వారసులకు రాసి ఇచ్చేసినంత సునాయాసంగా చేతులు మార్చేసి దండిగా దండుకున్నారు. కబ్జాకు గురైన 20 ఎకరాల భూమి విలువ ఎకరా రూ.20 లక్షలు చొప్పున రూ4 కోట్లు వరకూ ఉంటుందని ఓ అంచనా. ఈ భూబాగోతంపై అధికార యంత్రాంగం దృష్టి సారించకపోవడంపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయి.
20 ఎకరాల కబ్జా
కొండను చెరబట్టిన ఆక్రమణదారులు
విలువ రూ.4 కోట్లు పైమాటే
పంచాయతీలకు కేటాయించిన సోషల్ ఫారెస్ట్ భూములు పక్కదారి
అది 20 ఎకరాల ప్రభుత్వ భూమి. ఆ ప్రకృతి సంపదను పప్పుబెల్లాల్లా ఎవరికివారు ఇష్టారాజ్యంగా వాటాలు వేసేసుకున్నారు. కొన్నాళ్లపాటు దర్జాగా సాగుచేసుకొని ఫలసాయాన్ని కూడా అనుభవించి ఆ తర్వాత సొంతభూమిని వారసులకు రాసి ఇచ్చేసినంత సునాయాసంగా చేతులు మార్చేసి దండిగా దండుకున్నారు. కబ్జాకు గురైన 20 ఎకరాల భూమి విలువ ఎకరా రూ.20 లక్షలు చొప్పున రూ4 కోట్లు వరకూ ఉంటుందని ఓ అంచనా. ఈ భూబాగోతంపై అధికార యంత్రాంగం దృష్టి సారించకపోవడంపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయి.
మెంటాడ, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి) :
మెంటాడ మండలం పెదచామలాపల్లి, దత్తిరాజేరు మండలం చినచామలాపల్లి, ఇంగిలాపల్లి రెవెన్యూ పరిధిలో 150 ఎకరాలు పైబడిన కొండ ఉంది. ముపై ఏళ్ల క్రితం ఈ కొండపై ఫారెస్ట్ అధికారులు 50 ఎకరాల్లో జీడు మామిడి మొక్కలు నాటారు. కొన్నాళ్ల పాటు అటవీశాఖ ఆధీనంలో ఆ భూములు ఉండేవి. అప్పటి ప్రభుత్వ నిబంధనల మేరకు పంచాయతీలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆ భూమిని కొండకు ఆనుకొని ఉన్న మెంటాడ మండలం పెదచామలాపల్లి, దత్తిరాజేరు మండలం చినచామలాపల్లి, ఇంగిలాపల్లి గ్రామాలకు అధికారులు అప్పగించారు. పంటపై వచ్చిన ఫలసాయాన్ని పంచాయతీ అభివృద్ధికి వినియోగించాలని పేర్కొన్నారు. భూముల హద్దులు చూపుతూ మూడు పంచాయతీలకు భూమిని అప్పగించారు. చినచామలాపల్లి, ఇంగిలాపల్లి గ్రామాలకు సర్వే నెంబరు 1,2,3 పరిధిలోని కొండను, పెదచామలాపల్లెకు సర్వే నెంబరు 19లో వున్న భూమిని అప్పగించారు. 50 ఎకరాలను ఈ మూడు పంచాయతీలకు కొన్నేళ్ల క్రితం కేటాయించిన అటవీ అధికారులు దాన్ని సాగుచేసుకొని ఫలసాయాన్ని వేలంవేసి తద్వారా వచ్చే డబ్బును ఆయా పంచాయతీల్లో అభివృద్ధి పనుల కోసం వినియోగించేలా నాటి పంచాయతీ పెద్దలకు సూచించారు. కొన్నాళ్లపాటు ఈ ప్రక్రియ నవ్యంగా జరిగినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ప్రజాప్రతినిధుల హయాంలో అది దారితప్పింది.
వేలంలో మాయాజాలం
అటవీ శాఖ కేటాయించిన భూముల్లో జీడిమామిడి సాగుచేస్తూ ఫలసాయాన్ని పంచాయతీలో అభివృద్ధి పనులకు వినియోగించేవారు. కాలక్రమంలో సర్పంచులు మారినప్పుడల్లా ఫారెస్టు భూములు వారికి అక్షయపాత్రలా మారాయి. భారీమొత్తం రావాల్సిన ఫలసాయాన్ని తమ బినామీలకు ముందే తర్ఫీదు ఇచ్చి నామమాత్రపు ధరకే వేలం పాడించారు. పంటను బయటమార్కెట్లో భారీగా సొమ్ము చేసుకొని పంచాయతీ పెద్దలకు మాత్రం నామమాత్రంగా డబ్బులు జమచేసి మిగిలింది వెనుకేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఈ విధంగా ఆయా పంచాయతీలు గత కొన్నేళ్లలో భారీఎత్తున నిధులు కోల్పోయాయి. ఆ నామమాత్రపు నిధుల్లోనూ గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. పంచాయతీ నిధులకు జమచేయకుండా పండగల పేరుతో మమ అనిపించేశారు.
ఫ మొత్తం 20 ఎకరాల భూమి ఆక్రమణకు బీజం పడింది. పంచాయతీలకు ఆర్థిక తోడ్పాటు కోసం ఫారెస్ట్ అధికారులు ఉదారంగా కేటాయించిన భూమిలో కొంత భాగాన్ని ఐదేళ్లకోసారి వచ్చే కొత్త సర్పంచులు, తమ అనుచరులతో కబ్జా చేయించి తర్వాత తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ విధంగా 50 ఎకరాల్లోని సోషల్ ఫారెస్ట్ భూమిలో 20 ఎకరాల వరకూ అన్యాక్రాంతమైపోయాయి. ప్రస్తుతం ఆ మూడు పంచాయతీల చేతుల్లో 30 ఎకరాలే ఉన్నాయి.
ఫ ఆక్రమణదారుల్లో ఓ అటవీశాఖ ఉద్యోగి ఉన్నారు. ఆయన కొండ దిగువనున్న మూడు ఎకరాలను ఆక్రమించారని చెప్పుకుంటుంటారు. ఆ భూమి పేదలతో 99 ఏళ్లకు లీజుకు ఒప్పందం కుదుర్చుకున్నారని చుట్టుపక్క గ్రామస్థులు చెబుతున్నారు.
ఫ మూడు పంచాయతీలకు కేటాయించిన 50 ఎకరాల భూమిపై తమశాఖ పర్యవేక్షణ ఉండదని అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి. సోషల్ ఫారెస్ట్ భూమిలో వున్న పంట ఫలసాయం పెద్దల చేతిలో వుందని, తద్వారా వచ్చిన ఆదాయం గురించి తమకు తెలియదని, పంటకు వేలం పాట వేస్తున్నారని...అంతా గ్రామ పెద్దల నిర్ణయం మేరకు జరుగుతోందని ఆయా గ్రామస్థులు తెలిపారు.