Share News

15 Here... 35 There ఇక్కడ 15.. అక్కడ 35

ABN , Publish Date - May 31 , 2025 | 11:39 PM

15 Here... 35 There సీతంపేట ఏజెన్సీలో పండే పైనాపిల్‌ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.ఈ ప్రాంత గిరిజనులు ఎటువంటి రసాయనాలు లేకుండా సాగు చేపడు తుంటారు. అందుకే ఇక్కడి పైనాపిల్‌ను కొనేందుకు మైదాన ప్రాంత వ్యాపారులు క్యూకడుతుంటారు.

15 Here... 35 There ఇక్కడ 15.. అక్కడ 35
వారపు సంతకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న పైనాపిల్‌ పంట

  • ఇదీ పైనాపిల్‌ ధర పరిస్థితి

  • గిరిజనులకు నష్టం.. వ్యాపారులకు లాభం

  • గిట్టుబాటు కావడం లేదని రైతుల గగ్గోలు

  • ఉన్నతాధికారులు స్పందించాలని విన్నపం

సీతంపేట రూరల్‌, మే 31(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో పండే పైనాపిల్‌ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.ఈ ప్రాంత గిరిజనులు ఎటువంటి రసాయనాలు లేకుండా సాగు చేపడు తుంటారు. అందుకే ఇక్కడి పైనాపిల్‌ను కొనేందుకు మైదాన ప్రాంత వ్యాపారులు క్యూకడుతుంటారు. ప్రస్తుతం పైనాపిల్‌ పంట సీజన్‌ ప్రారంభమైంది. ఒక పక్క విస్తారంగా వర్షాలు కురుస్తుంటే మరో పక్క గిరిజన రైతులు పైనాపిల్‌ను గుట్టలుగా పోసి మైదాన ప్రాంత వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అయితే సింహాచలం రకానికి చెందిన పండు ధర రూ.15 మాత్రమే పలుకుతోంది. దీంతో గిట్టుబాటు కాకపోవడంతో గిరిజన రైతులు లబోదిబో మంటున్నారు.

ఇదీ పరిస్థితి..

- ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 10వేల హెక్టార్లకు పైగా ఈ పంట పండుతోంది. అంతర పంటల్లో భాగంగా గిరిజన రైతులు పైనాపిల్‌ సాగు చేపడుతుంటారు. అయితే సీజన్‌ ప్రారంభం నుంచి ఈ పంటకు గిట్టుబాటు ధర లేదు. దీంతో గిరిజన రైతులు తలలు పట్టుకుంటున్నారు. వాస్తవంగా ఏటా సుమారు 20వేల మెట్రిక్‌ టన్నుల వరకు దిగుబడి వస్తుంది. సీజన్‌ ప్రారంభంలో ధర తక్కువ పలుకుతున్నప్పటికీ తర్వాత రోజుల్లో పెద్ద సైజు కాయ ధర రూ.18 నుంచి 20వరకు పలికే అవకాశాలు ఉన్నాయని గిరిజన రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- మన్యంలో క్యు, సింహాలచలం రకానికి చెందిన పైనాపిల్‌ పంట మాత్రమే ఉంది. గత ఏడాది ప్రయోగాత్మకంగా కేరళ రకానికి చెందిన మార్షియస్‌ రకాన్ని ఐటీడీఏ అధికారులు పరిచయం చేశారు. ఈ రకం పైనాపిల్‌ సాగుతో గిరిజన రైతులు అధిక దిగుబడి , లాభాలు ఆర్జించనున్నారని ఉద్యాన శాఖాధికారులు చెబుతున్నారు. కాగా సీతంపేటలో ఈ రకం సాగవుతుండగా.. వచ్చే ఏడాది వాటి దిగబడి రానుంది.

విస్తారంగా పంట..

సింహాచలం, క్యు రకానికి చెందిన పైనాపిల్‌ పంట ఎక్కువగా కుమ్మరిగండి, గుడ్డిమీదగూడ, కడగండి, గజిలి, కుసిమి, ముత్యాలు, శంభాం, జోగైనాయుడుగూడ, పెద్దగూడ, పులిపుట్టి, అక్కన్నగూడ, రాజన్నగూడ, రేగులగూడ, రేగులగూడ కాలనీ, కోతం, ఆడలీ, కోడిశ, రామానగరం, తొత్తడి, అంటికొండ, తురాయిమానుగూడ, తలైబు గూడ, నీలంగూడ, వలగజ్జి, వంబరెల్లి తదితర గిరిజన గ్రామాల్లో విస్తారంగా పండుతోంది. ప్రధానంగా ఈ సీజన్‌లో ఒడిశాతో పాటు విశాఖపట్నం, అమలాపురం, తుని, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాలకు ఈ ప్రాంత పైనాపిల్‌ను వ్యాపారులు ఎక్స్‌పోర్ట్‌ చేస్తారు. అక్కడ ఒక్కో పండును రూ.35 వరకు విక్రయిస్తారు. దోనుబాయి, సీతంపేట ,కుసిమి, మర్రిపాడు, పొల్ల వంటి ప్రాంతాల్లో జరిగే వారపు సంతల్లో గిరిజన రైతుల నుంచి మైదాన ప్రాంత వ్యాపారులు కారుచౌకగా పైనాపిల్‌ను కొనుగోలు చేసి మార్కెట్‌లో అధిక ధరకు విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నారు.

గిట్టుబాటు అయ్యేలా..

ఈ సీజన్‌లో గిరిజన రైతులు తీసుకువచ్చే పైనాపిల్‌ పంటకు ఐటీడీఏ ద్వారా గిట్టుబాటు ధర కల్పించాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. గతంలో పైనాపిల్‌ పంటను ఐటీడీఏ, జీసీసీ సమన్వయంతో గిట్టుబాటు ధర ప్రకటించేవి. అధికారులు నిర్ణయించే ధరకే మైదాన ప్రాంత వ్యాపారులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకునేవారు. ఈఏడాది కూడా ఆ విధంగానే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

రైతులను ఆదుకోవాలి

ఈ ఏడాది ఒక పైనాపిల్‌ ధర రూ.15 మాత్రమే పలుకుతోంది. ఈ ధర పెంచే విధంగా ఐటీడీఏ చర్యలు తీసుకోవాలి. పంట నిల్వ చేసుకునేందుకు అవకాశం లేని కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో మైదాన ప్రాంత వ్యాపారులకు అతితక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోంది. గిరిజన రైతులను ఆదుకునే విధంగా అటవీ ఉత్పత్తులు, పైనాపిల్‌ పంటకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలి.

- సవర మొఖలింగం, కుమ్మరిగండి

====================================

పీహెచ్‌వో ఏమన్నారంటే..

సీతంపేట ఏజెన్సీలో ఒక పైనాపిల్‌ ధర రూ.15గా ఉంది. అయితే గిరిజన రైతులకు లాభాలు చేకూర్చేందుకు చర్యలు చేపడుతున్నాం. ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ఆదేశాల మేరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని రైతు బజార్లలో గిరిజన రైతులే నేరుగా అమ్ముకునే వెసులుబాటు కల్పించాం. దీనికి గాను ఫార్మర్‌ గ్రూప్‌లకు ప్రత్యేక అనుమతి పత్రాలు అందజేస్తాం.’ అని హార్టికల్చర్‌ అధికారి ఆర్‌వీ గణేష్‌ తెలిపారు.

Updated Date - May 31 , 2025 | 11:39 PM