Share News

సరికొత్తగా 108 వాహనాలు

ABN , Publish Date - Sep 25 , 2025 | 11:53 PM

వరైనా రోడ్డు ప్రమాదానికి గురైనా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న మొదటగా గుర్తుకొచ్చేది 108 అంబులెన్స్‌.

సరికొత్తగా 108 వాహనాలు

సాలూరురూరల్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఎవరైనా రోడ్డు ప్రమాదానికి గురైనా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న మొదటగా గుర్తుకొచ్చేది 108 అంబులెన్స్‌. ఫోన్‌ చేసిన వెంటనే క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి వారి ప్రాణాలను కాపాడేలా చేస్తుంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ వాహనాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. నేషనల్‌ కలర్‌ కోడ్‌కు భిన్నంగా 108 అంబులెన్స్‌లకు నీలం రంగు వేసింది. కూటమి ప్రభుత్వం రావడంతో ఈ వాహనాలకు కొత్త సొబగులు అద్దుతోంది. నీలం రంగు స్థానంలో పసుపు, ఎరువు, తెలుపు రంగులు వేసి సరికొత్తగా మారుస్తోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 45 వాహనాలు ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో 17 వాహనాల్లో 86 మంది సిబ్బంది, విజయనగరం జిల్లాలో 28 వాహనాల్లో 140 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 108 సేవలకు విఘాతం లేకుండా వారానికి రెండు వాహనాలకు రంగులు మార్చేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పార్వతీపురంలో 15, విజయనగరంలో 20 వాహనాలకు రంగులు మార్చి వినియోగిస్తున్నారు. మిగిలిన వాహనాలకు కొద్దిరోజుల్లో రంగులు మార్చనున్నారు. కాగా, గతేడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వరకు పార్వతీపురం జిల్లాలో 17 వాహనాలు 23,400 కేసులకు, విజయనగరం జిల్లాలో 28 వాహనాలు 36,650 కేసులకు హాజరై సేవలందించాయి.

రంగులు మార్చుతున్నాం

ప్రభుత్వ ఆదేశాల మేరకు 108 వాహనాలకు రంగులు మార్చుతున్నాం. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇప్పటికే 35 వాహనాలకు రంగులు మార్చాం. ప్రభుత్వ సూచన మేరకు నేషనల్‌ కలర్‌ కోడ్‌ను అనుసరించి అంబులెన్స్‌లకు రంగులు వేస్తున్నాం. రంగుల వల్ల వాహనాల స్ట్రక్చర్‌కు రక్షణ ఏర్పడుతుంది. సేవలకు విఘాతం కలగకుండా వారానికి రెండు వాహనాలకు రంగులు మార్చుతున్నాం.

- ఎస్‌. మన్మథనాయుడు, 108 వాహనాల ఉమ్మడి జిల్లా మేనేజర్‌

Updated Date - Sep 25 , 2025 | 11:53 PM