Share News

గందరగోళంగా జడ్పీ సమావేశం

ABN , Publish Date - Oct 04 , 2025 | 11:42 PM

అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో, ఇతర అధికారుల గైర్హాజరుపై ఏజెన్సీ ప్రాంత జడ్పీటీసీ సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సరైన వైద్యం అందడం లేదని అడిగితే జవాబు చెప్పేందుకు ఎవరు చొరవ చూపడం లేదని మండిపడ్డారు.

గందరగోళంగా జడ్పీ సమావేశం
జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్రతో మాట్లాడుతున్న ఏజెన్సీ జడ్‌పీటీసీ సభ్యులు

ఏజెన్సీలో వైద్య సేవలపై వాడీవేడీ చర్చ

అధికారుల గైర్హాజరుపై సభ్యులు మండిపాటు

అల్లూరి కలెక్టర్‌ వైఫల్యమేనంటూ ఆరోపణ

సమావేశాలకు హాజరుకాని అధికారులపై

ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీత

వంతెన మరమ్మతులపై అధికారుల వైఖరికి

నిరసనగా చివరల్లో వాకౌట్‌

జడ్పీ సమావేశంలో జరగని పూర్తి చర్చ

విశాఖపట్నం, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి):

అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో, ఇతర అధికారుల గైర్హాజరుపై ఏజెన్సీ ప్రాంత జడ్పీటీసీ సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సరైన వైద్యం అందడం లేదని అడిగితే జవాబు చెప్పేందుకు ఎవరు చొరవ చూపడం లేదని మండిపడ్డారు. ప్రత్యేకించి అల్లూరి కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ వైఫల్యమేనంటూ అసంతృప్తి వ్యక్తంచేశారు. జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన శనివారం జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశం గందరగోళంగా సాగింది. చైర్‌పర్సన్‌ను పట్టించుకోకుండా ఎవరికి వారే మాట్లాడడంతో వ్యవసాయ, వైద్యఆరోగ్య శాఖలపై తప్ప మిగిలిన అంశాలపై చర్చ జరగలేదు. వైద్య ఆరోగ్య శాఖపై జరిగిన చర్చ సందర్భంగా ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ రెండు రోజుల క్రితం పాడేరు ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్‌ లేకపోవడంతో సెల్‌ఫోన్‌ లైట్‌ వెలుగులో వైద్యం అందించారని పేర్కొంటూ దీనికి సూపరింటెండెంట్‌ వివరణ ఇవ్వాలన్నారు. చైర్‌పర్సన్‌ జోక్యం చేసుకుని డీఎంహెచ్‌వో వివరణ ఇవ్వాలని సూచన చేసినా సదరు అధికారి రాకపోవడంపై ఏజెన్సీ జడ్పీటీసీ సభ్యులు డి. గంగరాజు, శెట్టి రోష్ని, పోతల బాలయ్య, బొంజిబాబు నిరసన వ్యక్తంచేశారు. కలెక్టర్‌, జేసీ, పీవో, అధికారులే సమావేశానికి రాకపోతే తమ సమస్యలపై ఎవరికి నివేదించాలని మండిపడ్డారు. ఈ దశలో వేదిక పైనుంచే చైర్‌పర్సన్‌ సుభద్ర ఫోన్‌లో అల్లూరి కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌తో మాట్లాడుతూ ప్రభుత్వం శనివారం ఆటోడ్రైవర్ల సేవలో కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నప్పుడు కనీసం జేసీ లేదా ఐటీడీఎ పీవోను ఎందుకు పంపలేదన్నారు. ఈ సమయంలో అనంతగిరి, బుచ్చెయ్యపేట జడ్పీటీసీ సభ్యులు గంగరాజు, దొండా రాంబాబు మాట్లాడుతూ గడచిన నాలుగేళ్లలో ఇప్పటి వరకు 17 జడ్పీ సమావేశాలు జరిగాయని, సమావేశాలకు హాజరుకాని అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని చైర్‌పర్సన్‌, సీఈవోలను నిలదీశారు. ఇది జడ్పీ పాలకుల వైఫల్యమేనంటూ మండిపడ్డారు. అల్లూరి జిల్లాలో ఎంపీ, రెండు ఎమ్మెల్యే స్థానాలు వైసీపీ గెలుచుకోవడంతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్నారు. చింతపల్లి, సీలేరు రోడ్డు బాగుచేయకపోతే ఆమరణదీక్ష చేస్తానంటూ చింతపల్లి జడ్పీటీసీ సభ్యుడు పోతుల బాలయ్య ప్రకటించడంతో మిగిలిన ఏజెన్సీ ప్రాంత సభ్యులు వెంటనే చైర్‌పర్సన్‌ పోడియం చుట్టుముట్టి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ చింతపల్లిలో బాలికను విశాఖపట్నం తీసుకువచ్చి నాలుగు రోజులు అత్యాచారం చేశారని ఆరోపిస్తూ దీనిపై పోలీసులు స్పందిండం లేదన్నారు. బుచ్చెయ్యపేట జడ్పీటీసీ సభ్యుడు రాంబాబు జోక్యం చేసుకుని ఈ ఘటనపై వివరణ కోసం పోలీసు అధికారులను పిలవాలని కోరగా.. జడ్పీ సీఈవో పి. నారాయణమూర్తి స్పందిస్తూ, జడ్పీ సమావేశాలకు పోలీసులు హాజరుకారని పేర్కొన్నారు. కాగా వ్యవసాయ శాఖపై చర్చ సందర్భంగా కొయ్యూరు జడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజు మాట్లాడుతూ సీజన్‌లో రైతులకు యూరియా అందుబాటు లేదని, కొయ్యూరు నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యాపార కేంద్రాల నుంచి ఎక్కువ ధరను కొంటున్నారని వ్యాఖ్యానించారు. అరకు ఎమ్మెల్యే రేగా మత్స్యలింగం మాట్లాడుతూ అరకు, అనంతగిరి రోడ్డులో ఒకచోట వంతెన కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. రోడ్డు, వంతెన మరమ్మతుల విషయంలో అధికారులు దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా వ్యవహరిస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో రోడ్లు, భవనాల అధికారి ఒకరు జోక్యం చేసుకుని.. వర్షం కురిసిన మాట నిజమే.. అయితే తాము దున్నపోతులుం కాదని ఘాటుగా బదులిచ్చారు. అప్పటికే సమయం మధ్యాహ్నం 2.45 గంటలు కావడంతో భోజనానికి వేళ కావడంతో వాకౌట్‌ చేస్తున్నామని సభ్యులు ప్రకటించడంతో సమావేశం ముగించారు. సభ్యులు గందరగోళం సృష్టించడంతో వ్యవసాయ,ఆరోగ్యశాఖలపై మాత్రమే చర్చ చేపట్టి మరో మూడు, నాలుగు శాఖలపై తూతూమంత్రంగా మాట్లాడడంతో సమయం ముగిసిపోయింది. సమావేశంలో శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, విశాఖ, అనకాపల్లి జేసీలు కె.మయూర్‌ అశోక్‌, జాహ్నవి, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు, డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జి కోన తాతారావు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2025 | 11:42 PM