జూ అభివృద్ధి
ABN , Publish Date - Dec 04 , 2025 | 01:44 AM
విశాఖపట్నం జంతు ప్రదర్శనశాల (జూ)తో పాటు ఎదురుగా ఉన్న కంబాలకొండ అభయారణ్యాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. సింగపూర్ జూ తరహాలో విశాఖ జూను అభివృద్ధి చేయాలని ఇక్కడి ప్రజా ప్రతినిధులు భావిస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా సింగపూర్ వెళ్లి అన్నీ పరిశీలించారు. అక్కడి జూ నిర్వాహకులను విశాఖపట్నం పిలిపించారు. వారికి రెండు రోజుల పాటు విశాఖ జూను, కంబాల కొండను చూపించారు.
జంతు ప్రదర్శనశాలతో పాటు ఎదురుగా ఉన్న కంబాలకొండ అభయారణ్యం కూడా...
పర్యాటకులను ఆకర్షించడానికి ఎకో రిక్రియేషనల్ కార్యక్రమాలు నిర్వహించాలని యోచన
వీఎంఆర్‌డీఏ ద్వారా
కన్సల్టెంట్ నియామకానికి ప్రకటన జారీ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం జంతు ప్రదర్శనశాల (జూ)తో పాటు ఎదురుగా ఉన్న కంబాలకొండ అభయారణ్యాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. సింగపూర్ జూ తరహాలో విశాఖ జూను అభివృద్ధి చేయాలని ఇక్కడి ప్రజా ప్రతినిధులు భావిస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా సింగపూర్ వెళ్లి అన్నీ పరిశీలించారు. అక్కడి జూ నిర్వాహకులను విశాఖపట్నం పిలిపించారు. వారికి రెండు రోజుల పాటు విశాఖ జూను, కంబాల కొండను చూపించారు. దీనిని ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చునో సూచించాలని కోరారు. ఇదంతా ఆరు నెలల క్రితం జరిగింది. ఈ అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని ఎంపీ శ్రీభరత్ యత్నిస్తున్నారు. జూ, కంబాలకొండలను పర్యవేక్షించే అటవీ శాఖ అధికారులకు భారీఎత్తున అభివృద్ధి పనులు చేపట్టే యంత్రాంగం లేకపోవడంతో దీనికి అవసరమైన ప్రాథమిక పనులు చేపట్టే బాధ్యతను విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)కు అప్పగించారు.
సుమారుగా 625 ఎకరాల విస్తీర్ణంలో జూ ఉంది. అందులో 325 ఎకరాలను మాత్రమే జంతువుల సంరక్షణకు ఉపయోగించుకుంటున్నారు. ఇంకో 300 ఎకరాలు ఖాళీగా ఉంది. దీనికి ఎదురుగానే కంబాల కొండ ఉంది. ఈ రెండింటిని కలిపి అభివృద్ధి చేయనున్నారు. వీటిలో వైల్డ్ లైఫ్, ఆక్వాటిక్ లైఫ్‌తో పాటు పర్యాటకులను ఆకర్షించడానికి ఎకో రిక్రియేషనల్ కార్యక్రమాలు నిర్వహించాలని యోచిస్తున్నారు. దీనికి అవసరమైన ప్రణాళిక రూపొందించడానికి ఒక కన్సల్టెంట్ అవసరమని భావించారు. దీని కోసం వీఎంఆర్‌డీఏ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీచేసింది. ఈ రంగంలో అనుభవం ఉన్నవారు ఈ రెండు ప్రాంతాలను సమీకృతంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించి ఈ నెల 23వ తేదీలోగా సమర్పించాలని సూచించింది. ఎవరి ఆలోచనలు, ప్రణాళికలు బాగుంటాయో గుర్తించి, వారిని కన్సల్టెంట్‌గా నియమిస్తారు. ఆ తరువాత ప్రణాళికాబద్ధంగా వాటిని అభివృద్ధి చేస్తారు. వీటికి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నట్టు వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.