ఇకపై జోన్‌ల వారీగా సమావేశాలు
ABN , Publish Date - Jul 29 , 2025 | 01:18 AM
వార్డుల్లో సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను నేరుగా తెలుసుకునేందుకు ఇకపై జోన్‌ల వారీగా కార్పొరేటర్లు, అధికారులతో భేటీ కావాలని కమిషనర్ కేతన్‌గార్గ్ నిర్ణయించారు.
వార్డుల్లో సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను నేరుగా తెలుసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ నిర్ణయం
కార్పొరేటర్లు, అధికారులతో భేటీ
నేడు జోన్-1 పరిధిలో సమావేశం
విశాఖపట్నం, జూలై 28 (ఆంధ్రజ్యోతి):
వార్డుల్లో సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను నేరుగా తెలుసుకునేందుకు ఇకపై జోన్‌ల వారీగా కార్పొరేటర్లు, అధికారులతో భేటీ కావాలని కమిషనర్ కేతన్‌గార్గ్ నిర్ణయించారు. కమిషనర్ కలిసేందుకు తమకు అవకాశం ఇవ్వడం లేదని, సమస్యలపై విజ్ఞాపనలు అందజేసినా పట్టించుకోవడం లేదని కొందరు కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నారు. కార్పొరేటర్లు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తంచేయడంతో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిని అఽధిగమించేందుకు ఇకపై జోన్‌లవారీగా కార్పొరేటర్లతో భేటీ కావాలని కమిషనర్ నిర్ణయించారు. ఆ సమావేశానికి అన్ని విభాగాల అధిపతులతోపాటు ఆయా జోన్‌ల కమిషనర్లు, ఇతర ముఖ్య అధికారులు కూడా హాజరయ్యేలా చేయడం ద్వారా వార్డుల్లో సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే అధికారులకు కమిషనర్ సమాచారం అందజేశారు. మొదటగా జోన్-1 (భీమిలి)లో ఈనెల 29న సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే నెల రెండున జోన్-2, 6న జోన్-3, 12న జోన్-4, 16న జోన్-5, 20న జోన్ 6, 23న జోన్-7, 26న జోన్-8లో సమావేశం నిర్వహించాలని షెడ్యూల్ తయారుచేసి జోనల్ కమిషనర్లకు పంపించారు. ఆయా కార్పొరేటర్లకు దీనికి సంబంధించిన సమాచారాన్ని ముందుగానే అందజేసే బాధ్యతను జోనల్ కమిషనర్లకు అప్పగించారు. సమావేశానికి సంబంధించిన అజెండాను ఒకరోజు ముందుగానే తయారుచేసి తనకు అందజేయాలని స్పష్టంచేశారు.