Share News

జీవో 3పై వైసీపీ ద్వంద్వ వైఖరి

ABN , Publish Date - May 04 , 2025 | 10:49 PM

వైసీపీ నేతల ద్వంద్వ వైఖరిపై గిరిజనులు విస్మయం చెందుతున్నారు. గిరిజన ప్రాంతానికి సంబంధించిన జీవో:3 రద్దుపై అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం పోయిన తరువాత మరోలా వైసీపీ వ్యవహరిస్తోందని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు స్పందించని ఆ పార్టీ నాయకులు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని చర్చించుకుంటున్నారు.

జీవో 3పై వైసీపీ ద్వంద్వ వైఖరి
పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద శనివారం బంద్‌లో పాల్గొన్న ఎంపీ డాక్టర్‌ తనూజారాణి, మాజీ ఎమ్మెల్యేలు ఫాల్గుణ, భాగ్యలక్ష్మి, తదితరులు

2020 ఏప్రిల్‌ 22న జీవో 3ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

వైసీపీ అధికారంలో ఉన్న నాలుగేళ్లు కనీసం స్పందించని వైనం

ఇప్పుడు రాద్ధాంతం

వైసీపీ నేతల తీరుపై గిరిజనుల విస్మయం

గత ప్రభుత్వమే తమకు అన్యాయం చేసిందని ఆగ్రహం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

వైసీపీ నేతల ద్వంద్వ వైఖరిపై గిరిజనులు విస్మయం చెందుతున్నారు. గిరిజన ప్రాంతానికి సంబంధించిన జీవో:3 రద్దుపై అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం పోయిన తరువాత మరోలా వైసీపీ వ్యవహరిస్తోందని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు స్పందించని ఆ పార్టీ నాయకులు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని చర్చించుకుంటున్నారు.

షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఉపాధ్యాయ పోస్టులను శతశాతం గిరిజనులతో భర్తీ చేసే జీవో:3ను 2020 ఏప్రిల్‌ 22న సుప్రీంకోర్డు రద్దు చేసింది. అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ దానిపై కనీసం స్పందించలేదు. వాస్తవానికి జీవో:3 రద్దుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయడం లేదా అదే తరహాలో గిరిజనులకు ప్రయోజనం కలిగించే మరో జీవోను రూపొందించడం చేయాలి. కానీ అవేవీ చేయకపోగా, జీవో:3పై మాట్లాడిన వారిపై పోలీసులను ప్రయోగించడంతో గత నాలుగేళ్లుగా దీనిపై ఎవరూ గట్టిగా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది.

వైసీపీ అధికారంలో ఉన్న నాలుగేళ్లు ఏం చేశారు?

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో జీవో:3 పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని వైసీపీ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 2020లోనే జీవో:3 రద్దు కాగా, అప్పుడు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో పాటు ఏజెన్సీలో సైతం వార్డు సభ్యుడు మొదలుకుని ఎంపీ వరకు అందరూ వైసీపీకి చెందిన నేతలే ఉన్నారు. అయినప్పటికీ జీవో:3 రద్దుతో గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై కనీసం ఎక్కడా మాట్లాడలేదు. ఆఖరికి గిరిజన (ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు)ప్రజాప్రతినిధులు సైతం జీవో:3 రద్దుతో తమ గిరిజనులకు అన్యాయం జరుగుతుందని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. విపక్షాలు, ఉద్యోగ, ప్రజా సంఘాలు జీవో:3 రద్దును వ్యతిరేకించి నిరసనలు తెలిపే వారిని కేసుల పేరిట బెదిరించడంతో అందరూ మిన్నకున్నారు. ఉదాహరణకు 2023 మార్చి 10న జీవో:3 సమస్యపై గిరిజన సంఘం ఆధ్వర్యంలో బంద్‌ను చేపడితే, పాడేరులోనే పది మంది నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఆ విషయాలను ఇప్పటికీ గిరిజనులు మరిచిపోలేదనే సంగతి వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు గుర్తించాలని స్థానికులు సూచిస్తున్నారు.

నేడు గిరిజనులను మభ్యపెట్టేలా వైసీపీ నేతల గగ్గోలు

అధికారంలో ఉన్న నాలుగేళ్లు జీవో:3 సమస్యపై కనీసం స్పందించని వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు ఇప్పుడు గిరిజనులను మభ్యపెట్టేందుకు ఊహించని విధంగా గగ్గోలు పెడుతుండడం గమనార్హం. మెగా డీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ నేపథ్యంలో గిరిజనులకు స్పెషల్‌ డీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని, షెడ్యూల్డ్‌ ప్రాంతంలోని టీచర్‌ పోస్టులన్నీ గిరిజనులతో భర్తీ చేయాలనే డిమాండ్‌పై ఈ నెల 2, 3 తేదీల్లో స్పెషల్‌ డీఎస్‌సీ సాధన సమితి చేపట్టిన మన్యం బంద్‌లో సైతం వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొని జీవో:3ని పునరుద్ధరించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దీంతో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకపోవడం వల్లే నేడు తామంతా రోడ్డున పడ్డామని బంద్‌ నేపథ్యంలో పాడేరు, అరకులోయ ప్రాంతాల్లోని పలువురు ఆందోళనకారులు బహిరంగంగానే విమర్శించారు. నిజానికి జీవో:3 సమస్యను పరిష్కరించకుండా గత నాలుగేళ్లుగా మిన్నకుండి, ఇప్పుడు దానిపై మొసలి కన్నీరు కార్చడం వైసీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.

Updated Date - May 04 , 2025 | 10:49 PM