జనసేనకు యువతే ప్రాణం
ABN , Publish Date - Aug 29 , 2025 | 01:16 AM
భవిష్యత్తు జనసేనదేనని, పార్టీకి యువతే ప్రాణమని, వారిని నాయకులు కలుపుకొని వెళ్లాలని అధినేత పవన్ కల్యాణ్ లెజిస్లేటివ్ మీటింగ్‌లో సూచించారు.
రాష్ట్రం భివృద్ధి సాధించాలంటే అలయన్స్ అవసరం...ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు
పొత్తులో ఉన్నా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టి పనిచేయాలి
నాయకులకు జనసేన అధినేత కె.పవన్‌కల్యాణ్ దిశానిర్దేశం
విశాఖపట్నం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి):
భవిష్యత్తు జనసేనదేనని, పార్టీకి యువతే ప్రాణమని, వారిని నాయకులు కలుపుకొని వెళ్లాలని అధినేత పవన్ కల్యాణ్ లెజిస్లేటివ్ మీటింగ్‌లో సూచించారు. బీచ్‌రోడ్డులోని బీచ్ వ్యూ హాటల్‌లో ఆయన గురువారం పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ జనసేన పార్టీని ముందుకు నడిపిస్తానని స్పష్టంచేశారు. పార్టీని తాను నడపలేనని కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానాలు చేశారని, ఇప్పుడు వారే పార్టీ సాధించిన విజయాలు చూసి అభిప్రాయాలు మార్చుకుంటున్నారన్నారు. మూడు పార్టీలు కలసి పనిచేసినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయని, వాటిని సమయానుకూలంగా అధిగమించాలని సూచించారు. ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే అలయన్స్ అవసరమని, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు కాబట్టి అంతా కలిసిముందుకు సాగాల్సి ఉందన్నారు. అలయన్స్‌లో ఉన్నా పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దానిపై అంతా దృష్టి పెట్టి పనిచేయాలని సూచించారు. నియోజకవర్గ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ సమావేశంతో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేశ్‌బాబు, సుందరపు విజయకుమార్, లోకం మాధవి, బొలిశెట్టి శ్రీనివాస్, పార్లమెంటు సభ్యులు బాలశౌరి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
దేశ సౌభాగ్యం కోసమే జనసేన
దేశ సౌభాగ్యం కోసమే జనసేన ఆవిర్భవించిందని, ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ప్రకటించారు. ‘సేనతో..సేనాని’ పేరిట జనసేన విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ గురువారం విశాఖపట్నం వచ్చి బీచ్‌రోడ్డులోని బే వ్యూ హోటల్‌లో లెజిస్లేచర్ సమావేశం నిర్వహించారు. అందులో చర్చించిన విషయాలను ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, ఎమ్మెల్సీ హరిప్రసాద్‌లు సాయంత్రం మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ, స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ జరుగుతున్నదంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నదని, అదంతా అవాస్తవమన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్నంత వరకు అది సాధ్యం కాదన్నారు. స్టీల్ ప్లాంటుపై తొలుత స్పందించింది పవన్‌కల్యాణేనని, ఆయన ఢిల్లీ వెళ్లి అమిత్‌షాతో మాట్లాడి ప్రైవేటీకరణ ఆపించారన్నారు. ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి స్టీల్‌ప్లాంటుకు రూ.14 వేల కోట్ల ఆర్థిక సాయం ఇప్పించారన్నారు. వైసీపీలా తాము స్టీల్ ప్లాంటు భూముల కోసం ములాఖత్ కాలేదన్నారు. ఆ ప్లాంటు కోసం కేప్టివ్ మైన్స్‌తో పాటు ప్రత్యేకమైన పైపులైన్ కూడా పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారన్నారు.
పవన్ కల్యాణ్ పార్టీని పదిహేనేళ్లుగా నడుపుతున్నారని, ఆయన నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి అంతా ఆయన వెనుక నడుస్తున్నామన్నారు. రిజిస్టర్ పార్టీ నుంచి రికగ్నిషన్ పొందిన పార్టీగా జనసేన మారిందన్నారు. ఒక సీటు కూడా లేని పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో ప్రతి సీటును గెలుచుకొని 100 శాతం స్ర్టైక్ రేటు సాధించిందన్నారు. ఒకానొక సమయంలో పార్టీని విలీనం చేయాలని చాలామంది ఆయన్ను కోరారని, కానీ ఆయన ఆ దిశగా ఏనాడూ ఆలోచన చేయలేదన్నారు. రాష్ట్ట్రం విడిపోయిన తరువాత నిలదొక్కుకోలేకపోతున్నదని బాధ పడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కల్యాణ్ కూటమికి మద్దతు ఇచ్చారన్నారు. అది నిరంతరం కొనసాగుతుందని స్పష్టంచేశారు. గతంలో పవన్ కల్యాణ్ విశాఖపట్నం వస్తే వైసీపీ పార్టీ నాయకులు అనేక అడ్డంకులు సృష్టించారని, నోవాటెల్‌లో నుంచి బయటకు రాకుండా ఆంక్షలు పెట్టారన్నారు. అదే విశాఖపట్నంలో ఇప్పుడు పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఇక్కడ మీటింగ్ పెట్టిన ప్రతిసారి రాష్ట్రానికి మేలు జరుగుతున్నదని సుందరపు పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా నాయకులు, కార్యకర్తలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేస్తున్నారన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధికి దిశ, దశ సూచించేలా ఈ సమావేశాలు ఉంటాయన్నారు.