గంజాయి వలలో యువత
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:33 AM
గంజాయి వలలో యువత
డబ్బులు, బైక్‌లతో ఎర వేస్తున్న స్మగ్లర్లు
గంజాయి వ్యాపారుల చేతుల్లో పావులుగా మారుతున్న విద్యార్థులు
మైనర్లను సైతం వాడుకుంటున్న వైనం
ఒడిశాలో గంజాయి కొనుగోలు
అల్లూరి, అనకాపల్లి జిల్లాల మీదుగా రవాణా
పోలీసుల చెక్‌పోస్టులు తగలకుండా వేరే మార్గాల్లో తరలింపు
--------
నర్సీపట్నం రూరల్ పోలీసులు 2023 అక్టోబరు 22వ తేదీన చింతపల్లికి చెందిన మైనర్ బాలుడిని అరెస్టు చేసి మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గత ఏడాది జనవరి 31వ తేదీన నర్సీపట్నం మండలం గబ్బాడ శివారు ప్రాంతంలో గంజాయి లోడు చేస్తుండగా ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేసి 46 కిలోల గంజాయి సీజ్ చేశారు.
గత ఏడాది జూలై 20వ తేదీన ధర్మసాగరం జంక్షన్ వద్ద గంజాయి రవాణా కేసులో మైనర్ బాలుడిని రూరల్ పోలీసులు అరెస్టు చేశారు.
గత ఏడాది నవంబరు నాలుగో తేదీన కృష్ణా జిల్లాకు చెందిన విద్యార్థిని అరెస్టు చేసి మూడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
తాజాగా సెప్టెంబరు 2వ తేదీన పట్టణ పోలీసులు గంజాయి రవాణాదారులకు పైలట్‌గా వ్యవహరించిన మైనర్ బాలుడుని అరెస్టు చేశారు.
-------
నర్సీపట్నం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి):
గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్న వారిలో ఎక్కువ మంది 25 ఏళ్ల లోపు యువకులు, 15 నుంచి 18 ఏళ్లలోపు మైనర్లు వుండడం సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. వీరు గంజాయి సేవించడంతోపాటు రవాణాకు కూడా సహకరిస్తున్నారు. గంజాయి వ్యాపారులు.. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన మైనర్లు, 25 ఐదేళ్లలోపు యువకులను లక్ష్యంగా చేసుకొంటున్నారు. తొలుత వీరికి గంజాయి సేవించడాన్ని అలవాటు చేస్తున్నారు. అనంతరం జల్సాలకు డబ్బులతోపాటు బైక్‌లు కూడా ఇచ్చి గంజాయి రవాణాకు వాడుకుంటున్నారు. గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు దొరికిపోతున్న వారిలో పలువురు విద్యార్థులు.. ముఖ్యంగా ఇంజనీరింగ్ చదువుతున్న వారు కూడా వుండడంతో ఆందోళన కలిగిస్తున్నది. కళాశాలలోనే గంజాయి సేవించడం అలవాటు అయిందని వీరు చెప్పడం గమనార్హం.
చెక్ పోస్టులను తప్పించుకొని గంజాయి రవాణా
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి ఆనుకొని వున్న ఒడిశా రాష్ట్రంలో గంజాయి సాగవుతున్నది. ఇక్కడ కొనుగోలు చేసిన గంజాయిని అల్లూరి, అనకాపల్లి జిల్లాల మీదుగా ఇతర జిల్లాలు/రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఒడిశాలో కిలో సుమారు రూ.5 వేలకు కొనుగోలు చేసిన గంజాయి.. రాష్ట్ర సరిహద్దులు దాటితే రూ.25 వేలు పలుకుతున్నది. గంజాయి రవాణాను నిరోధించడానికి ఏజెన్సీ ముఖద్వారాల వద్ద అనకాపల్లి జల్లా పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. చింతపల్లి నుంచి నర్సీపట్నం వచ్చే మార్గంలో కొయ్యూరు మండలం డౌనూరు వద్ద చెక్ పోస్టు ఉంది. గంజాయి రవాణాదారులు ఈ చెక్‌పోస్టు తగలకుండా.. రొబ్బసింగి, బచ్చింత మీదుగా చేర వేస్తున్నారు. కృష్ణాదేవిపేట రూట్లో యర్రవరం చెక్‌పోస్టు తగలకుండా జోగుంపేట, తాండవ, చమ్మచింత, ఎదురుపల్లి, రౌతులపూడి మీదుగా కత్తిపూడి వద్ద జాతీయ రహదారికి చేరుతున్నారు. సీలేరు, ధారకొండ, జీకేవీధి, మీదుగా కొయ్యూరు మండలం అసనగిరి, సొల్లూరు మీదుగా రవాణా చేస్తున్నారు.
గంజాయి వ్యాపారుల ఆస్తుల జప్తు
పోతురెడ్డి శ్రీనివాసరావు, డీఎస్పీ, నర్సీపట్నం
గంజాయి రవాణాను నిరోధించడానికి నిఘాను కట్టుదిట్టం చేశాము. ప్రధాన రహదారులతోపాటు ఇతర మార్గాల్లో తనిఖీలు ముమ్మరం చేశాము. డ్రోన్లను ఉపయోగించి గంజాయి సేవిస్తున్న వారిని గుర్తిస్తున్నాం. గంజాయి వ్యాపారుల ఆస్తుల జప్తునకు చర్యలు తీసుకుంటున్నాము. గంజాయి రవాణా చేసే వ్యక్తులు, సేవించే వారు వున్న గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. గంజాయి రవాణా చేస్తూ పట్టబడిన మైనర్లు, యువకులకు కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాం.