చేజేతులా...!
ABN , Publish Date - Oct 24 , 2025 | 01:11 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారుల తీరు ఎవరికీ అంతుబట్టడం లేదు. మంచి వేతనంతో విద్యార్థులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఓ సంస్థ ముందుకువచ్చినా పట్టించుకోలేదు.
బంపర్ ఆఫర్‌పై ఏయూ అధికారుల నిర్లక్ష్యం
ఎంటెక్ సిగ్నల్ ప్రాసెసింగ్ కోర్సు నిర్వహణకు అవెంటల్ సంస్థ ప్రతిపాదన
రెండో ఏడాది నుంచి విద్యార్థులకు రూ.25 వేలు చొప్పున స్టైఫండ్ ఇస్తామని హామీ
రూ.9.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగ కల్పనకు సిద్ధం
గత ఏడాది వర్సిటీ అధికారులతో ఎంవోయూ
స్పందించని ఏయూ అధికారులు
ఎంవోయూను రద్దు చేసుకున్న సంస్థ
తాజాగా గీతం, జేఎన్‌టీయూకేతో ఒప్పందం
విశాఖపట్నం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారుల తీరు ఎవరికీ అంతుబట్టడం లేదు. మంచి వేతనంతో విద్యార్థులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఓ సంస్థ ముందుకువచ్చినా పట్టించుకోలేదు. ఫలితంగా ఆ సంస్థ ప్రత్యామ్నాయం చూసుకుంది. దీంతో ఏయూలో చదువుకుని, ఉన్నత స్థానాలకు చేరాలని అభిలషించే నిరుపేద విద్యార్థులకు సువర్ణావకాశం చేజారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం వర్సిటీలో చర్చనీయాంశంగా మారింది.
సిగ్నల్ ప్రాసెసింగ్ పరికరాలను తయారుచేసే అవెంటల్ కంపెనీ ఏడాది కిందట ఏయూ అధికారుల ఎదుట కీలక ప్రతిపాదన ఉంచింది. వర్సిటీ, ఇండస్ర్టీ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎంటెక్ సిగ్నల్ ప్రాసెసింగ్ కోర్సును నిర్వహించాలని, ఇందుకు తాము సహకరిస్తామని తెలిపింది. పాఠాలు బోధించేందుకు నిపుణులను కూడా నియమిస్తామని, కోర్సులో చేరిన విద్యార్థులందరికీ రెండో ఏడాది ఇంటర్నషిప్ అవకాశం కల్పించి, నెలకు రూ.25 వేల చొప్పున అందిస్తామని కూడా హామీ ఇచ్చింది. కోర్సు పూర్తయిన వెంటనే ఒక్కో విద్యార్థికి రూ.9.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం ఇస్తామని స్పష్టంచేసింది. సంస్థ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన ఏయూ అధికారులు గత ఏడాది చివర్లో ఎంవోయూ చేసుకున్నారు.
స్పందించని వర్సిటీ యంత్రాంగం
ఒప్పందం మేరకు వర్సిటీ అధికారులు కోర్సు నిర్వహణపై స్పందించలేదు. దీంతో సదరు సంస్థకు చెందిన కీలక అధికారులు గత ఇన్‌చార్జి వీసీ, ప్రస్తుత వీసీలతోనూ పలుమార్లు సమావేశమయ్యారు. ప్రవేశ ప్రక్రియపై చర్చలు కూడా జరిపారు. ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించాలని సంస్థ ప్రతిపాదించినా, ఏయూ నుంచి స్పందన కనిపించలేదు. దీంతో ఏయూతో చేసుకున్న ఒప్పందాన్ని ఆ సంస్థ రద్దు చేసుకుంది.
ప్రత్యామ్నాయం దిశగా..
ఏయూతో ఎంవోయూను రద్దు చేసుకున్న అవెంటల్ సంస్థ ఏటా 60 సీట్లతో ఎంటెక్ సిగ్నల్ ప్రాసెసింగ్ కోర్సును నిర్వహించేలా నగర పరిధిలోని గీతం వర్సిటీతో ఒప్పందం చేసుకుంది. మరో 25 సీట్లతో కోర్సు నిర్వహించేలా జేఎన్‌టీయూకేతోనూ ఎంవోయూ చేసుకున్నట్టు సమాచారం.
పేద విద్యార్థులకు అన్యాయం
వర్సిటీలో కోర్సు నిర్వహిస్తే ఏటా సుమారు 30 నుంచి 50 మంది విద్యార్థులకు భారీ వేతనాలతో విశాఖలోనే ఉద్యోగాలు లభించేవి. కానీ అధికారులు స్పందించకపోవడంతో ఇతర విద్యాసంస్థలతో అవెంటల్ ఒప్పందం చేసుకుంది. కీలక ఒప్పందంపై వర్సిటీ అధికారుల నిర్లక్ష్యానికి కారణాలేమిటనే దానిపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై ఏయూ రిజిస్ర్టార్ ప్రొఫెసర్ రాంబాబును వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదని, పరిశీలించాల్సి ఉందన్నారు.