కందిరీగల దాడిలో యువతి మృతి
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:13 PM
కందిరీగల దాడిలో గాయపడిన ఓ యువతి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.
స్వల్పంగా గాయపడిన మరో ముగ్గురు
అనంతగిరి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): కందిరీగల దాడిలో గాయపడిన ఓ యువతి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. దీనికి సంబంధించి ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని కోనాపురం పంచాయతీ కరాయిగుడ గ్రామానికి చెందిన కిల్లో శాంతి(20) అదే గ్రామానికి చెందిన ముగ్గురు పశువుల కాపరులతో కలిసి సమీపంలోని కొండ వద్దకు మేత కోసం మేకలను తీసుకు వెళ్లింది. మేకలు మేత మేస్తుండగా అక్కడే ఉన్న కందిరీగల గూడు కదిలిపోవడంతో ఒక్కసారిగా కందిరీగలు బయటకు వచ్చి అక్కడి వారిపై దాడి చేశాయి. కిల్లో శాంతిపై అధిక సంఖ్యలో కందిరీగలు దాడి చేయడంపై తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు అరకు ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. కందిరీగల దాడిలో స్వల్పంగా గాయపడిన పూజారి రాజు, పూజారి బలరాం, కిల్లో కొండు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. శాంతి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.