ఆర్టీసీ బస్సెక్కాలంటే ఓపిక ఉండాల్సిందే
ABN , Publish Date - Dec 14 , 2025 | 12:20 AM
‘సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణం కోసం మీ ఆర్టీసీ’.. బస్సు వెనుక మనకు కనిపించే స్లోగన్ ఇది. సురక్షితం మాటెలా ఉన్నా బస్సు ఎక్కేంత వరకూ, తీరా బస్సు ఎక్కిన తరువాత సుఖం కరువైందని ప్రయాణికులు వాపోతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం పుణ్యమా అని అవసరం ఉన్నవారు, లేనివారు సైతం ప్రయాణాలు చేస్తుండడంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసిన వారు, విద్యార్థులు, ఉపాధి కోసం వెళ్లేవారికి బస్సు ప్రయాణం చుక్కలు చూపిస్తున్నదని చెప్పాలి.
- నామమాత్రంగా మారిపోయిన బస్టాపులు
- డ్రైవర్ల దయాదాక్షిణ్యాలపైనే ఆధారం
- ఉచిత ప్రయాణం ఎఫెక్ట్‌తో పెరిగిన కష్టాలు
- గంటల తరబడి ప్రయాణికులకు తప్పని నిరీక్షణ
- అత్యవసర పనులపై వెళ్లేవారికి ఇబ్బందులు
- తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోలను ఆశ్రయించాల్సిన దుస్థితి
చోడవరం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణం కోసం మీ ఆర్టీసీ’.. బస్సు వెనుక మనకు కనిపించే స్లోగన్ ఇది. సురక్షితం మాటెలా ఉన్నా బస్సు ఎక్కేంత వరకూ, తీరా బస్సు ఎక్కిన తరువాత సుఖం కరువైందని ప్రయాణికులు వాపోతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం పుణ్యమా అని అవసరం ఉన్నవారు, లేనివారు సైతం ప్రయాణాలు చేస్తుండడంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసిన వారు, విద్యార్థులు, ఉపాధి కోసం వెళ్లేవారికి బస్సు ప్రయాణం చుక్కలు చూపిస్తున్నదని చెప్పాలి.
గతంలో బస్టాపు వద్ద నిల్చొంటే బస్సు ఆపి మరీ ప్రయాణికులను ఎక్కించుకునే పరిస్థితి ఉండేది. అన్ని జంక్షన్ల వద్ద కూడా ఆర్టీసీ బస్సులు ఆపి మరీ ప్రయాణికులను ఎక్కించుకునేవారు. ఒకవేళ దారి మధ్యలో బస్సు కనిపిస్తే చెయ్యి ఎత్తితే బస్సు ఆగేది. అయితే మహిళలకు ఉచిత ప్రయాణం తరువాత ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దారి మధ్యలో చెయ్యి ఎత్తినా బస్పు ఆగడం లేదు సరికదా, బస్టాపుల వద్ద కూడా బస్సులు ఆపకుండా వెళ్లిపోతున్న సంఘటనలు ఎక్కువయ్యాయి. కళ్ల ముందు బస్సులు ఒకదాని తరువాత ఒకటి వెళ్లిపోతుంటే గంటల తరబడి ప్రయాణికులు బస్సు కోసం వేచి ఉండాల్సిన అవస్థలు నెలకొన్నాయి. ఫలితంగా గతంలో మాదిరిగా ఇంటికి దగ్గరలో ఉన్న బస్టాపులో నిల్చొంటే సులభంగా బస్సెక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఆర్టీసీ బస్సెక్కాలంటే చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌కో, లేదంటే దగ్గరలో ఉన్న కాసింత పెద్ద జంక్షన్‌కో వెళ్లి బస్సు కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సుల్లో ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగా ఉండడంతో ఇదే అదనుగా ఆర్టీసీ డ్రైవర్లు కూడా బస్సులు తమకు నచ్చితే ఆపడం, లేదంటే ఆపకుండా వెళ్లిపోవడం చేస్తున్నారు. ఫలితంగా ఆర్టీసీ బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు పడుతున్న పరిస్థితి క్షేత్ర స్థాయిలో నెలకొంది.
బస్టాపుల వద్ద ఆగని బస్సులు
చోడవరం నుంచి విశాఖపట్నం, ఇటు అనకాపల్లి మార్గంలో గతంలో గజపతినగరం, గోవాడ, వెంకన్నపాలెం, దుడ్డుపాలెం ప్రాంతాల్లో బస్టాపులు ఉండేవి. తాజాగా గజపతినగరం బస్టాపు వద్ద బస్సులు ఆపడం లేదు. దీంతో గజపతినగరం, సింహాద్రిపురం, జుత్తాడలతో పాటు లక్కవరం గ్రామాలకు చెందిన ప్రయాణికులు ఇటు గోవాడ, లేదంటే వెంకన్నపాలెం వెళ్లి బస్టాపులో నిల్చొని బస్సు కోసం వేచి ఉండాల్సి వస్తున్నది. అలాగే గోవాడ వద్ద కూడా ఉచిత ప్రయాణం రానంత వరకూ ప్రతి బస్సు ఆగేది. ఉచితం వచ్చిన తరువాత ఒకటీ, అరా బస్సులు మాత్రమే ఆగుతున్నాయి తప్పితే గతంలో మాదిరిగా ఎక్కువ బస్సులు ఆగడం లేదు. ఇక వెంక న్నపాలెం జంక్షన్ వద్ద పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. దుడ్డుపాలెం వద్ద బస్సులు ఆగడం లేదు, నరసాపురం, దుడ్డుపాలెం గ్రామాల ప్రజలు బస్సెక్కాలంటే వెంకన్నపాలెం జంక్షన్‌కు రావలసి వస్తోంది. ఇక పట్టణ పరిధిలోని కొత్తూరు జంక్షన్‌లో ఏ బస్సు ఆగుతుందో, ఏది ఆగదో చెప్పలేని పరిస్థితి. దీంతో గంటల తరబడి రోడ్డు పక్కన బస్సు కోసం ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. మరికొంతమంది కొత్తూరు జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకూ నడుచుకుని వెళ్లి బస్సులు ఎక్కుతున్నారు. ఇక చోడవరం శివారు అడ్డూరులో సైతం బస్సులు నిలపకపోవడంతో అక్కడ స్థానికులు ఆటోలలో సబ్బవరం వరకు వెళ్లి మరీ బస్సులు ఎక్కుతున్న పరిస్థితి ఉంది. ఇక ఈ మార్గంలో విద్యార్థులు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే పరిస్థితి లేక, ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది.
ఆటోలే శరణ్యం
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన స్థానికులు అయితే అనకాపల్లి, లేదంటే విశాఖపట్నం వివిధ పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. విద్యార్థులు, చిరుద్యోగులు, రైతులు సైతం తమ అవసరాల నిమిత్తం వెళ్లి వస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో బస్టాపుల్లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడం, రెండు, మూడు గంటలు వేచి ఉంటే తప్పా బస్సు ఎక్కే పరిస్థితి లేకపోవడంతో చాలామంది చివరకు ఆటోలు ఎక్కి వెళుతున్న పరిస్థితి నెలకొంది.