Share News

ఉత్సాహంగా యోగాంధ్ర

ABN , Publish Date - Jun 04 , 2025 | 11:42 PM

జిల్లాలోని రంపచోడవరం డివిజన్‌ గంగవరం మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి గిరిజన యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఉత్సాహంగా యోగాంధ్ర
యోగా సాధన చేస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, ఎమ్మెల్యే శిరీషా, ఐటీడీఏ పీవో సింహాచలం, తదితరులు

గంగవరంలో 5 వేల మంది గిరిజనులతో కలిసి కలెక్టర్‌ యోగాసనాలు

పాడేరు/గంగవరం, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రంపచోడవరం డివిజన్‌ గంగవరం మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి గిరిజన యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 5 వేల మంది గిరిజనులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు 40 నిమిషాలు యోగా సాధన చేసి ఆరోగ్యంగా జీవించాలని సూచించారు. రాష్ట్రంలో యోగాంధ్ర- 2025 పేరిట మాసోత్సవాలు జరుగుతున్నాయని, ఇందులో భాగంగా జిల్లాలోని 200 మంది మాస్టర్‌ ట్రైనర్ల ద్వారా 3 వేల మంది ట్రైనర్లను సిద్ధం చేసి, ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో 50 మందికి శిక్షణ అందించామన్నారు. 5 వేల మంది గిరిజనులతో ప్రత్యేకంగా యోగా కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయిస్తే లక్ష్యానికి మించి 5,100 మంది హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 21న విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా చర్యలు చేపడుతున్నామన్నారు. యోగా చరిత్ర, ప్రత్యేకతలు, ప్రయోజనాలు, తదితర అంశాలను రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, ఐటీడీఏ పీవో కె.సింహాచలం వివరించారు. అనంతరం కలెక్టర్‌, ఎమ్మెల్యే, ఐటీడీఏ పీవో గిరిజన సంప్రదాయ కొమ్ము కిరీటాలను ధరించి గిరిజనులతో కలిసి నృత్యం చేసి అందర్ని అలరించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో రవీంద్రదామ, డీఎస్‌పీ సాయిప్రశాంత్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ అంబేడ్కర్‌, టీడబ్ల్యూ డీడీ రుక్మంగదయ్య, వెలుగు ఏపీడీ డేగలయ్య, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 11:42 PM