ఆరోగ్యానికి యోగా దివ్యౌషధం
ABN , Publish Date - Jun 10 , 2025 | 12:46 AM
సంపూర్ణ ఆరోగ్యానికి యోగా సాధన దివ్య ఔషధమని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ తెలిపారు.
ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జేసీ డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ
ఉత్సాహంగా యోగాంధ్ర ర్యాలీ
పాడేరు, జూన్9 (ఆంధ్రజ్యోతి): సంపూర్ణ ఆరోగ్యానికి యోగా సాధన దివ్య ఔషధమని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ తెలిపారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు సోమవారం నిర్వహించిన యోగాంధ్ర ర్యాలీని సోమవారం ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా జీవించడానికి యోగాసనాలను నిత్యం ఆచరించాలన్నారు. ప్రజలకు యోగాపై మరింత అవగాహన కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. గత నెల రోజులుగా యోగాంధ్రపై గ్రామ, మండల స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతీ పల్లెలో యోగాసన కార్యక్రమాలు నిర్వహించాలని అభిషేక్‌గౌడ సూచించారు. విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా నుంచి 25 వేల మంది విద్యార్థులు పాల్గొంటారన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ యోగా అంటే ఆరోగ్య యోగమన్నారు. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం, సమాజానికి శ్రేయస్కరమన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, డీఆర్‌డీఏ పీడీ. వి.మురళి, మైక్రో ఇరిగేషన్ పీడీ రహీమ్, గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎల్.రజని, ఐటీడీఏ మేనేజర్ హేమలత, జిల్లా పరిశ్రమల అధికారి జి.రవిశంకర్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్, వెలుగు, ఐటీడీఏ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.