Share News

2.5 లక్షల మందితో యోగా డే

ABN , Publish Date - May 22 , 2025 | 01:32 AM

వచ్చే నెల 21వ తేదీ ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకూ విశాఖపట్నంలో నిర్వహించనున్న ప్రపంచ యోగా దినోత్సవానికి ప్రధాన వేదికగా ఆర్కే బీచ్‌ను ఎంపిక చేశారు. బీచ్‌రోడ్డు, పక్కన ఇసుక తిన్నెల్లో 15 వేల మంది యోగా ప్రదర్శన చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వప్రియ ఫంక్షన్‌హాలుకు ఎదురుగా ప్రధాన వేదికను ఏర్పాటుచేయనున్నారు.

2.5 లక్షల మందితో  యోగా డే

వచ్చే నెల 21వ తేదీ కార్యక్రమానికి

ప్రధాన వేదికగా ఆర్కే బీచ్‌రోడ్డు

ప్రధాని, గవర్నర్‌, ముఖ్యమంత్రి హాజరు

భీమిలి వరకూ 500 కంపార్టుమెంట్లు

ఒక్కొక్కచోట ఐదు వేల మంది...

ప్రతి ఒక్కరికీ మ్యాట్లు, బనియన్లు పంపిణీ

వర్షం వంటివి వస్తే ప్రత్యామ్నాయంగా

ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో

నిర్వహణకు ఏర్పాట్లు

విశాఖపట్నం, మే 21 (ఆంధ్రజ్యోతి):

వచ్చే నెల 21వ తేదీ ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకూ విశాఖపట్నంలో నిర్వహించనున్న ప్రపంచ యోగా దినోత్సవానికి ప్రధాన వేదికగా ఆర్కే బీచ్‌ను ఎంపిక చేశారు. బీచ్‌రోడ్డు, పక్కన ఇసుక తిన్నెల్లో 15 వేల మంది యోగా ప్రదర్శన చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వప్రియ ఫంక్షన్‌హాలుకు ఎదురుగా ప్రధాన వేదికను ఏర్పాటుచేయనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మరికొందరు ప్రముఖులు పాల్గొననున్నారు. ఒకవేళ బీచ్‌రోడ్డులో వర్షం వల్ల ఆటంకం ఎదురైతే...ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో కార్యక్రమం నిర్వహిస్తారు. అందుకోసం పది వేల మంది పాల్గొనేలా భారీ షెడ్లు వేస్తున్నారు.

పార్క్‌ హోటల్‌ జంక్షన్‌ నుంచి భీమిలి బీచ్‌ వరకూ యోగా ప్రదర్శనకు 500 కంపార్టుమెంట్లు గుర్తించారు. ప్రతి కంపార్టుమెంటులో ఐదువేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గీతం కళాశాల, గాయత్రి కళాశాల మైదానాలు కూడా కంపార్టుమెంట్లుగా గుర్తించారు. ఒక కంపార్టుమెంటుకు మరో కంపార్టుమెంటుకు మధ్య 100 మీటర్ల దూరం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రెండున్నర లక్షల మంది పాల్గొననున్న యోగా ప్రదర్శనను సమన్వయం చేసుకునేందుకు 15 వేల మంది వలంటీర్లను నియమిస్తున్నారు. ప్రదర్శనలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ క్యూఆర్‌ కోడ్‌తో కూడిన హ్యాండ్‌ బ్యాండ్‌ ఇస్తారు. ఈ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల బృందం విశాఖ రానున్నది. ప్రదర్శనలో పాల్గొనే ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయడానికి అనువుగా మ్యాట్‌, బనియన్లు కేంద్రం సరఫరా చేస్తోంది. యోగా ప్రదర్శనకు నగరంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి సాధకులను సమీకరిస్తున్నారు. నగరం, పరిసర ప్రాంతాల నుంచి ప్రదర్శన ప్రాంతాలకు తీసుకురావడానికి వాహనాలు సమకూరుస్తారు. వాహనాల పార్కింగ్‌కు స్థలాలు గుర్తించారు. ప్రదర్శన అనంతరం ప్రతి ఒక్కరికీ స్నాక్స్‌, మంచినీరు అందిస్తారు.

ప్రధాని కోసం ఏయూలో హెలిప్యాడ్లు

వచ్చే నెల 20వ తేదీ సాయంత్రం నగరానికి రానున్న ప్రధాని ఆరోజు రాత్రి ఐఎన్‌ఎస్‌ చోళాలో బస చేస్తారు. ఆ మరుసటిరోజు ఉదయం ఆరు గంటలకు హెలికాప్టర్‌లో ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ల్యాండ్‌ అవుతారు. ఐఎన్‌ఎస్‌ చోళా నుంచి మూడు హెలికాప్టర్లు ఒకేసారి ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానానికి చేరుకుంటాయి. హెలికాప్టర్లు ఢిల్లీ నుంచి రానున్నాయి. ఏయూలో హెలిప్యాడ్‌ నుంచి ప్రధాని బీచ్‌రోడ్డుకు చేరుకుంటారు. కాగా ఆర్కే బీచ్‌లో ప్రధాని పాల్గొనే వేదికకు ఎదురుగా సముద్రంలో తూర్పు నౌకా దళానికి చెందిన ఒక యుద్ధ నౌకలో యోగా ప్రదర్శన నిర్వహిస్తారు.

Updated Date - May 22 , 2025 | 01:32 AM