Share News

భారీ ఎత్తున యోగా దినోత్సవం

ABN , Publish Date - Jun 21 , 2025 | 12:12 AM

జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను శనివారం భారీ ఎత్తున నిర్వహించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నద్ధతపై శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

భారీ ఎత్తున యోగా దినోత్సవం
అనకాపల్లి కళాశాలలో నిద్రకు ఉపక్రమించిన విద్యార్థులు

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

జిల్లా వ్యాప్తంగా 4,698 వేదికలు

7,72,812 మంది పేర్లు నమోదు

విశాఖలో యోగా దినోత్సవానికి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో హాజరు కానున్న విద్యార్థులు

అనకాపల్లి, ఎలమంచిలి, సబ్బవరం, కశింకోటల్లో రాత్రి బస

తెల్లవారుజామున బస్సుల్లో విశాఖకు..

అనకాపల్లి కలెక్టరేట్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను శనివారం భారీ ఎత్తున నిర్వహించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నద్ధతపై శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. యోగా దినోత్సవ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, యోగా ట్రైన్సర్స్‌కు, యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల పంపిణీపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా వ్యాప్తంగా యోగా నిర్వహణ కోసం 4,698 వేదికలను గుర్తించినట్టు కలెక్టర్‌ తెలిపారు. యోగాసనాలకు హాజరయ్యేందుకు ఏడు లక్షల 72 వేల 812 మంది పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. వీరంతా ఆయా వేదికల వద్ద యోగాలో పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌వో వై.సత్యనారాయణరావు, జిల్లా ఆయుష్‌ అధికారిణి డాక్టర్‌ కె.లావణ్య తదితరులు పాల్గొన్నారు. కశింకోట మండలం నుంచి 629 మంది విద్యార్థులు విశాఖలో జరిగే యోగా దినోత్సవానికి వెళుతున్నారు. వీరికి శుక్రవారం రాత్రి ఇక్కడ వేర్వేరు విద్యా సంస్థల్లో వసతి కల్పించి, భోజనాలు ఏర్పాటు చేశారు. శనివారం తెల్లవారుజామున ప్రత్యేక బస్సుల్లో విశాఖ తీసుకెళతామని విద్యా శాఖ అధికారులు తెలిపారు. విద్యార్థుల బస కేంద్రాన్ని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పరిశీలించారు. భోజన ఏర్పాట్ల గురించి ఆరా తీశారు.

అనకాపల్లిలో 5 వేల మంది విద్యార్థులకు రాత్రి బస

అనకాపల్లి, కె.కోటపాడు, నర్సీపట్నం, మాకవరపాలెం, రోలుగుంట మండలాల నుంచి విశాఖలో జరిగే యోగా దినోత్సవానికి హాజరయ్యే సుమారు ఐదు వేల మంది విద్యార్థులకు అనకాపల్లి పట్టణంలోని 13 కేంద్రాల్లో శుక్రవారం రాత్రి బస ఏర్పాటు చేసి, భోజన సదుపాయం కల్పించారు. శనివారం వేకువజామున రెండున్నర గంటలకు బస్సుల్లో విశాఖపట్నం బయలుదేరి వెళతారు. వీరి కోసం 80 బస్సులను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం యోగా కార్యక్రమం ముగిసిన తరువాత తిరిగి అనకాపల్లి చేరుకుంటారు. టమాటా రైస్‌, వంకాయ కర్రి, మజ్జిగ అందించి, తరువాత విద్యార్థులను బస్సుల్లో వారి స్వస్థలాకు చేరుస్తారు.

ఎలమంచిలిలో 3,200 మంది విద్యార్థులకు..

పాయకరావుపేట, నక్కపల్లి, కోటవురట్ల, ఎలమంచిలి మండలాలు, ఎలమంచిలి మునిసిపాలిటీకి చెందిన సుమారు 3,200 మంది విద్యార్థులకు ఎలమంచిలి పట్టణంలోని 14 ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలో రాత్రి బస ఏర్పాటు చేశారు. ఆయా మండలాల నుంచి విద్యార్థులు ప్రత్యేక బస్సుల్లో శుక్రవారం సాయంత్రానికే ఇక్కడకు చేరారు. రాత్రి భోజనం ఇక్కడే ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి తరువాత విశాఖకు బయలుదేరి వెళతారు. శనివారం ఉదయం విశాఖలో యోగా కార్యక్రమం ముగిసిన తరువాత తిరిగి ఎలమంచిలి తీసుకొస్తారు. మధ్యాహ్నం ఇక్కడ భోజనాలు చేసిన తరువాత తిరిగి స్వస్థలాలకు చేర్చుతామని ఎలమంచిలి ఎంఈవో అరుణ్‌కుమార్‌, మునిసిపల్‌ కమిషనర్‌ ప్రసాదరాజు తెలిపారు.

సబ్బవరంలో..

చోడవరం, చీడికాడ, కె.కోటపాడు, సబ్బవరం మండలాలకు చెందిన 3,110 మంది విద్యార్ధులకు సబ్బవరంలో 11 కేంద్రాల్లో బస ఏర్పాటు చేశారు. వీరిని విశాఖ తీసుకెళ్లి, యోగా కార్యక్రమం ముగిసిన తరువాత తిరిగి తీసుకురావడానికి 62 బసులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. శనివారం సాయంత్రానికి ఇక్కడకు చేరుకున్న విద్యార్థులకు రాతి భోజనం కింద వెజ్‌ బిర్యానీ, బంగాళాదుంపల కుర్మా, పెరుగు పచ్చడి, వాటర్‌ బాటిల్‌ ఇస్తారు. విశాఖలో యోగా కార్యక్రమానికి హాజరైన తిరిగి వచ్చిన తరువాత టమాటా బాత్‌, వంకాయ కర్రీ, మజ్జిక ప్యాకెట్‌, వాటర్‌ బాటిల్‌ ఇస్తారు. అనంతరం బస్సుల్లో వారి స్వగ్రామాలకు చేరుస్తారు.

Updated Date - Jun 21 , 2025 | 12:12 AM