Share News

యోగా బడ్జెట్‌ రూ.62 కోట్లు!

ABN , Publish Date - Jun 16 , 2025 | 12:23 AM

నగరంలో ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి రూ.62 కోట్ల వరకు వ్యయమవుతుందని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది.

యోగా బడ్జెట్‌ రూ.62 కోట్లు!

  • రూ.20 కోట్ల విడుదలకు జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

  • కార్యక్రమ నిర్వహణకు భారీగా అధికారుల నియామకం

  • మ్యాట్లు, టీషర్టులను సరఫరా చేసిన కేంద్రం

విశాఖపట్నం, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి):

నగరంలో ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి రూ.62 కోట్ల వరకు వ్యయమవుతుందని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. ప్రముఖుల పర్యటనలు, వాహనాల ఏర్పాటు, గదుల అద్దె, ఫుడ్‌, ఇతరత్రా ఖర్చులు, యోగా కంపార్టుమెంట్ల వద్దకు ప్రజలను తరలించే బస్సులు, ఆటోలు, ఇతరత్రా కార్యక్రమాలకు సొమ్ములు అవసరమని అంచనా వేశారు. యోగా ప్రదర్శనలో భాగంగా ప్రధాన వేదికను ఆర్కే బీచ్‌ వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేదిక ప్రాంతం నుంచి పార్కు హోటల్‌ కంపార్టుమెంటు వరకు రోడ్డుపై మ్యాట్‌లు వేయాలి. అలాగే పార్కు హోటల్‌ నుంచి భీమిలి వరకు, పార్కు హోటల్‌ నుంచి ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానం వరకు మ్యాట్లు వేయాలి. ఇంకా ప్రజలందరికీ స్నాక్స్‌ సరఫరా చేయాలి. ఒకవేళ వర్షం వస్తే ప్రధాన వేదికగా గుర్తించిన ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో భారీ షెడ్లు వేస్తున్నారు. దీనికి కూడా భారీ ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో రూ.62 కోట్ల నిధులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే తాజాగా ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పలుమార్లు నిధుల కోసం జీవోలు వచ్చినా డబ్బులు విడుదల కాని సందర్భాలు ఉన్నాయి. దీంతో జిల్లా యంత్రాంగం నిధుల కోసం ఎదురుచూస్తోంది. మ్యాట్లు, టీషర్టులను కేంద్రం సరఫరా చేస్తుండంతో ప్రభుత్వానికి కొంత వరకు భారం తగ్గింది.

భారీ సంఖ్యలో అధికారుల నియామకం

యోగా దినోత్సవ నిర్వహణకు సంబంధించి ఏడుగురు ఐఎఎస్‌లు, ఏడుగురు ఐపీఎస్‌ అధికారులు, 31 మంది డిప్యూటీ కలెక్టర్లు, 101 మంది తహశీల్దార్లు, ఏడుగురు జిల్లా పౌరసరఫరాల అధికారులను నియమించారు. వీరికితోడు ఆర్టీసీ, రవాణా అధికారులు, భారీ స్థాయిలో పోలీసులను నియమించడంతో వారందరికీ వసతి, వాహన సౌకర్యంపై అఽధికారులు దృష్టిసారించారు. ఇంకా అమరావతి నుంచి పలువురు సీనియర్‌ అధికారులు వస్తున్నారు. మొత్తం 268 కంపార్టుమెంట్లకు గజిటెడ్‌ అధికారులను ఇన్‌చార్జిలుగా, వారికి సహయం చేసే సిబ్బందిని నియమించారు. కంపార్టుమెంట్లలో సేవలందించేందుకు ఆరువేల మంది ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ, వైజాగ్‌ వలంటీర్లను నియమించారు. కంపార్టుమెంట్‌లోకి వచ్చే ప్రతిఒక్కరికీ చేతికి ఉండే బ్యాడ్జిని వలంటీర్లు స్కాన్‌ చేస్తారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు కోసం స్కానింగ్‌ అవసరమని గుర్తించారు. నగరంలో పలు ప్రాంతాల నుంచి జనాల తరలింపు బాధ్యత యూసీడీ విభాగానికి అప్పగించారు. వారితోపాటు సచివాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తారు. నగరం నుంచి మూడు లక్షలు, నాలుగు గ్రామీణ మండలాల నుంచి 25 వేల మంది, అనకాపల్లి జిల్లా నుంచి లక్ష మంది, విజయనగరం, శ్రీకాకుళం నుంచి 40 వేలు మందిని సమీకరించనున్నారు.


నేడు సీఎం రాక

  • బీచ్‌రోడ్డులో యోగా దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన

  • హోటల్‌ నోవాటెల్‌లో అధికారులతో చంద్రబాబు సమీక్ష

  • పీఎం పాలెం వైజాగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో కార్యకర్తల సమావేశం

విశాఖపట్నం, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి):

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం నగర పర్యటనకు రానున్నారు. ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 11.40కు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. పది నిమిషాలపాటు ఎయిర్‌పోర్టులో గడిపాక 11.50 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.10కు ఆర్కే బీచ్‌ రోడ్డులోని కాళీమాత గుడి వద్దకు చేరుకుంటారు. 12.15 నుంచి 12.40 గంటల వరకు పార్కు హోటల్‌ వరకూ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలిస్తారు. అనంతరం 12.45 గంటలకు బయలుదేరి ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానానికి చేరుకుని అక్కడ యోగా దినోత్సవ ఏర్పాట్లను తిలకిస్తారు. మధ్యాహ్నం 1.05 గంటలకు హోటల్‌ నోవాటెల్‌కు వెళతారు. భోజన విరామం తరువాత 2.15 నుంచి 3.30 గంటల వరకు యోగా దినోత్సవంపై అధికారులతో సమీక్షిస్తారు. ఆ తరువాత 3.40 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలకు పీఎం పాలెంలోని వైజాగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుని, సాయంత్రం ఆరు గంటల వరకు పార్టీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ఆ సమావేశం ముగిశాక అక్కడ నుంచి బయలుదేరి 6.15 గంటలకు సీతంపేట రాజేంద్రనగర్‌లో గల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి సీఎం చేరుకుంటారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 6.45కు విమానాశ్రయానికి చేరుకుంటారు. 6.55 గంటలకు చంద్రబాబు ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళతారు.


ప్రతిష్టాత్మకంగా యోగా దినోత్సవం

  • ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

  • ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లోనే ప్రజలను తరలించాలి

  • ప్రైవేటు వాహనాలను అనుమతించబోం

  • 2,085 బస్సులతో పాటు ఆటోలు, వ్యాన్‌ల ఏర్పాటు

  • ప్రదర్శన తరువాత అందరినీ స్నాక్స్‌ అందజేస్తా

  • జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌

విశాఖపట్నం, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి):

నగరంలో ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్నందున ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌. హరేంధిరప్రసాద్‌ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టరేట్‌లో ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యోగా దినోత్సవానికి హాజరయ్యే ప్రజలందరూ తమ ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులు, ఆటోలు, టాటా మ్యాజిక్‌, తదితర వాహనాల్లోనే రావాలని స్పష్టం చేశారు. ప్రైవేటు వాహనాలను అనుమతించబోమని పేర్కొన్నారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మార్కింగ్‌ చేసిన ప్రాంతాలకు ప్రజలను సకాలంలో తరలించడం ముఖ్యమని.. దీనికి అధిక ప్రాధాన్యతనివ్వాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. నియోజకవర్గాల నుంచి బస్సులు తెల్లవారుజామునే బయలుదేరి సకాలంలో తమకు కేటాయించిన కంపార్టుమెంట్లకు చేరుకునేలా శ్రద్ధ చూపాలని హరేంధిర ప్రసాద్‌ కోరారు. సచివాలయాల వారీగా ప్రజలకు ఏ కంపార్టుమెంట్‌ కేటాయించామనే విషయం ఇప్పటికే తెలియజేశామన్నారు. ఎక్కడ వాహనాలు దిగారో, తిరిగి అక్కడ నుంచే వెనక్కి చేరుకోవాలని ప్రజలకు వివరించాలన్నారు. బస్సులు, ఇతర వాహనాలకు ఇన్‌చార్జిలుగా సచివాలయ సిబ్బందిని నియమించామని, కార్యక్రమంలో మహిళలు, యువత ఎక్కువగా పాల్గొనేలా చూసుకోవాలని సూచించారు. సచివాలయం వారీగా కంపార్టుమెంట్ల కేటాయింపుపై ప్రతి బస్సుపై పూర్తి సమాచారం ఉండేలా స్టిక్కర్లు అతికిస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు.

2,085 బస్సుల ఏర్పాటు

యోగా దినోత్సవానికి ప్రజలను తరలించేందుకు 2,085 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని హరేంధిర ప్రసాద్‌ వెల్లడించారు. ఆర్టీసీకి చెందిన 1300 బస్సులు ఉండగా... వీటిని నగరంలోని ప్రజలను తరలించేందుకు 800 బస్సులను, గ్రామీణ ప్రాంతానికి 500 బస్సులను కేటాయించామన్నారు. అలాగే 885 ప్రైవేటు బస్సులను సమకూర్చుతున్నామని, వీటితోపాటు ఆటోలు, టాటా మ్యాజిక్‌ వాహనాలను వినియోగించడం జరుగుతుందన్నారు. 20వతేదీ సాయంత్రానికే ఆయా నియోజకవర్గాలకు వాహనాలు చేరుకునేలా ఏర్పాటుచేస్తున్నామన్నారు. బస్సుల్లో వచ్చే వారంతా తెల్లవారుజాము ఐదు గంటలకు తమకు కేటాయించిన ప్రదేశాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. యోగాలో పాల్గొన్న వారందరికీ టీషర్టులు, మ్యాట్‌లు అందజేస్తామన్నారు. కార్యక్రమం పూర్తయి తిరిగి వెళ్లేటప్పుడు ప్రతిఒక్కరికీ అరటిపండు, రెండు టాటా గ్లూకోజ్‌ ప్యాకెట్లు, పల్లీ చక్కీ, బిస్కెట్‌ ప్యాకెట్‌, వాటర్‌ బాటిల్‌ అందిస్తామని కలెక్టర్‌ వివరించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి ఆయా జిల్లాల యంత్రాంగాలు అల్పాహారం అందించేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారంతా ఆర్కే బీచ్‌ నుంచి విశాలాక్షినగర్‌ వరకు గల కంపార్టుమెంట్లకు వెళ్లాలని, పెందుర్తి, అనకాపల్లి నుంచి వచ్చేవారంతా ఎండాడ లా కళాశాల రోడ్డు గుండా బీచ్‌ రోడ్డు, విజయనగరం జిల్లా నుంచి వచ్చేవారు ఐటీ సెజ్‌ రోడ్డులోకి, శ్రీకాకుళం నుంచి వచ్చేవారు తిమ్మాపురం నుంచి భీమిలి వరకు గల కంపార్టుమెంట్లకు రావాలని హరేంధిర ప్రసాద్‌ సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పి.గణబాబు, పి.విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్‌, మేయరు పీలా శ్రీనివాసరావు, ఏపీ కో-ఆపరేటివ్‌ ఆయిల్‌ ఫెడ్‌ గ్రోయర్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గండి బాబ్జి, ఎన్టీఆర్‌ వైద్య ట్రస్టు వైస్‌చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌, వీఎంఆర్డీఏ చైర్మన్‌ ఎం ప్రణవ్‌గోపాల్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 12:23 AM