Share News

పకడ్బందీగా యోగాంధ్ర

ABN , Publish Date - May 23 , 2025 | 12:39 AM

యోగాంధ్ర- 2025ను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం, యోగాంధ్ర- 2025పై జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో గురువారం రంపచోడవరం నుంచి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

పకడ్బందీగా యోగాంధ్ర
రంపచోడవరం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

- కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశం

- పర్యాటక ప్రదేశాల్లో నాలుగు రోజులు ప్రత్యేక యోగ సాధన

పాడేరు, మే 22(ఆంధ్రజ్యోతి): యోగాంధ్ర- 2025ను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం, యోగాంధ్ర- 2025పై జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో గురువారం రంపచోడవరం నుంచి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో ఆయన మాట్లాడారు. యోగాంధ్రలో భాగంగా నెల రోజులు గ్రామ, మండల డివిజన్‌ స్థాయిలో యోగ సాధన జరగాలని, అందుకు అవసరమైన మాస్టర్‌ ట్రైనర్లు, తదితర ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో ఏడుగురు శిక్షకులను ఎంపిక చేసి ఒక్కొక్కరు 50 మంది చొప్పున యోగాపై ప్రజలకు శిక్షణ ఇవ్వాలన్నారు. యోగ సాధన చేయాలనుకునే వారంతా యోగాంధ్ర యాప్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని, జిల్లాలోని ప్రజలంతా యోగాలో పాల్గొనాలని కలెక్టర్‌ కోరారు. జూన్‌ 21న విశాఖపట్నంలో జరిగే యోగా దినోత్సవంలో 5 లక్షల మంది పాల్గొంటారని, రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగాను సాధన చేస్తారన్నారు. అందుకు తగ్గట్టుగానే జిల్లాలో అధిక సంఖ్యలో యోగ సాధన చేసి యోగా దినోత్సవంలో భారీగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఈ నెల 29, జూన్‌ 1, 11, 17 తేదీల్లో యోగా ప్రత్యేక సాధన చేయాలన్నారు. ఈ నెల 26 నుంచి జూన్‌ 20 తేదీ వరకు జిల్లాలో వివిధ శాఖల సిబ్బంది యోగ సాధన చేయాలని కలెక్టర్‌ సూచించారు.

నోడల్‌ అధికారిగా టీడబ్ల్యూ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌

జిల్లాలో యోగా దినోత్సవం, యోగాంధ్ర -2025ను విజయవంతం చేసేందుకు గాను గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావును నోడల్‌ అధికారిగా నియమిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. అసిస్టెంట్‌ నోడల్‌ అధికారిగా సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, డీఎంహెచ్‌వో జమాల్‌ బాషా సమన్వయకర్తగా వ్యవహరిస్తారని, జిల్లాలోని ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలని, అలాగే పలు కట్టడాలపై యోగాసనాల చిత్రాలను పెయింటింగ్‌ చేయించాలన్నారు. జిల్లా నుంచి లక్ష మంది యోగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఐటీడీఏ పీవో కె.సింహాచలం, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 12:39 AM