Share News

నాడు...నేడు అదే తీరు!

ABN , Publish Date - Oct 04 , 2025 | 12:38 AM

జిల్లాలోని పలు పాఠశాలల్లో గత ప్రభుత్వం చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా వున్నాయి. చేసిన పనులకు సంబంధించి బిల్లులు అందకపోవడంతో కాంట్రాక్టర్లు ఎక్కడికక్కడ పనులు నిలిపివేశారు. ఆయా భవన నిర్మాణాలపై నివేదిక రప్పించుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇంతవరకు ఆయా భవన నిర్మాణాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

నాడు...నేడు అదే తీరు!
కె.కోటపాడులో పునాదుల స్థాయిలో ఆగిన జడ్పీ ఉన్నత పాఠశాల అదనపు భవన నిర్మాణం

జిల్లా అసంపూర్తిగా పలు పాఠశాలల భవన నిర్మాణాలు

గత ప్రభుత్వ హయాంలో రూ.250 కోట్లతో 604 పనులు మొదలు

సాధారణ ఎన్నికలనాటికి రూ.130 కోట్లు మాత్రమే చెల్లింపు

బిల్లులు అందకపోవడంతో మిగిలిన పనులు ఆపేసిన కాంట్రాక్టర్లు

భవనాల స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదించిన జిల్లా అధికారులు

ఆరు నెలలు దాటినా కానరాని స్పందన

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని పలు పాఠశాలల్లో గత ప్రభుత్వం చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా వున్నాయి. చేసిన పనులకు సంబంధించి బిల్లులు అందకపోవడంతో కాంట్రాక్టర్లు ఎక్కడికక్కడ పనులు నిలిపివేశారు. ఆయా భవన నిర్మాణాలపై నివేదిక రప్పించుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇంతవరకు ఆయా భవన నిర్మాణాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం నాడు- నేడు కార్యక్రమం కింద 604 పాఠశాలల్లో రూ.250 కోట్లతో వివిధ నిర్మాణ పనులను ప్రారంభించింది. వీటిల్లో అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు 68, ప్రాథమిక పాఠశాలల భవనాలు 292, ప్రాథమికోన్నత పాఠశాల భవనాలు 38, ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతి గదులు 187, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 19 అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు వున్నాయి. అయితే ఆయా దశల్లో పూర్తయిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు అప్పటి పాలకులు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. మొత్తం మీద గత ఏడాది సాధారణ ఎన్నికల ముందునాటికి రూ.130 కోట్ల బిల్లులు మాత్రమే కాంట్రాక్టర్లకు అందాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాల్లో నాడు-నేడు కార్యక్రమం కింద గత ప్రభుత్వం చేపట్టిన భవన నిర్మాణ పనుల వివరాలు పంపాలని జిల్లా అధికారులను ఆదేశించింది. దీంతో విద్యాశాఖ, సమగ్ర శిక్ష విభాగం ఇంజనీరింగ్‌ అధికారులు ఈ ఏడాది మార్చిలో వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. కానీ ఇంతవరకు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పలు పాఠశాలల్లో భవనాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.

ప్రభుత్వం చొరవ చూపితేనే...

గత ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం కింద చేపట్టి, అసంపూర్తిగా వున్న భవనాల నిర్మాణం, ఇతర పనులపై దసరా సెలవులకు ముందు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని విద్యాశాఖ అధికారులు భావించారు. కానీ ఎటువంటి ప్రకటన వెలువడకపోవడంతో ఇప్పట్లో వాటికి మోక్షం లభించేలా లేదు. ఆయా పాఠశాలల్లో వసతి కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై సమగ్ర శిక్ష ఏపీసీ జయప్రకాశ్‌ను ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి వివరణ కోరగా.. కూటమి ప్రభుత్వం పాఠశాలలకు గ్రేడింగ్‌లు ఇచ్చి, ఆ మేరకు ప్రాధాన్యతా క్రమంలో దశల వారీగా నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయనుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు కాకుండా కేజీబీవీలు, ఇతర పాఠశాలల్లో కొత్తగా నిర్మాణాలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.

Updated Date - Oct 04 , 2025 | 12:38 AM