నిన్న కుక్కలు.. నేడు కోతులు..
ABN , Publish Date - Dec 09 , 2025 | 02:00 AM
సంక్షేమ శాఖలకు చెందిన బాలికల వసతిగృహంలో విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయింది.
సంక్షేమ వసతిగృహాల్లోకి జంతువుల చొరబాటు
యథేచ్ఛగా బాలికలపై దాడి..పలువురికి తీవ్రగాయాలు
విద్యార్థినులకు కొరవడిన రక్షణ
రావికమతం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి):
సంక్షేమ శాఖలకు చెందిన బాలికల వసతిగృహంలో విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయింది. కొద్ది రోజుల క్రితం రాత్రిపూట వీధి కుక్కలు బీసీ బాలికల హాస్టల్‌లోకి చొరబడి దాడిచేసి ఏకంగా 25 మందిని కరిచాయి. తాజాగా కోతులు సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహంలోకి వచ్చి దాడి చేయడంతో ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
రావికమతంలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహంలో 96 మంది విద్యార్థినులు వుంటున్నారు. వసతిగృహం చుట్టూ ప్రహరీ గోడ వున్నప్పటికీ ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కోతులు గోడ దూకి లోపలికి వచ్చాయి. ఈ సమయంలో బాలికలంతా నిద్రిస్తున్నారు. కోతులు గదుల్లోకి వచ్చి ఏడో తరగతి చదువుతున్న పాల్లిక స్నేహ (12), తొమ్మిదో తరగతి చదువుతున్న సీదరి మంగ (13)లపై దాడిచేసి శరీరంపై పలుచోట్ల కరిచాయి. వార్డెన్ సోమవారం ఉదయం వీరిని రావికమతం సీహెచ్‌సీకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ మెరుగైన వైద్యం చేయించిన తరువాత బాలికలను తల్లిదండ్రులకు అప్పగించి వారి ఇళ్లకు పంపించినట్టు తెలిసింది.
కాగా గత నెలలో వీధి కుక్కలు బీసీ సంక్షేమ బాలిక వసతిగృహంలోకి మూకుమ్మడిగా చొరబడి, విద్యార్థినులపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో సుమారు 25 మంది బాలికలకు కుక్కకాటు గాయాలయ్యాయి. వీరిలో కొంతమందికి తీవ్ర గాయాలు కావడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కాగా హాస్టళ్లలోకి కుక్కలు, కోతులు వచ్చి దాడి చేస్తుండడంతో వసతిగృహాల్లో వుండడానికి విద్యార్థినులు భయపడుతున్నారు. తమ హాస్టల్‌లోకి కోతులు రావడం ఇదే ప్రథమం కాదని, గతంలో పలుమార్లు వచ్చి స్వైరవీహారం చేశాయని బాలికలు వాపోయారు. ఈ విషయమై వసతి గృహం మేట్రిన్ లలితను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. కోతుల దాడిలో ఇద్దరు విద్యార్థినులకు చిన్నపాటి గాయాలయ్యాయని, ప్రమాదమేదీ లేదని అన్నారు.
కాగా సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహంలో బాలికలపై కోతులు దాడి చేసిన విషయం తెలుసుకున్న సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కె.గోవిందరావు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఎస్సీ, బీసీ వసతిగృహాల్లో విద్యార్థినులకు రక్షణ కరువైందని అన్నారు. కోతులు, కుక్కలు దాడులు చేసిన విషయాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించి బాలికల రక్షణకు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.