Share News

ఏళ్ల తరబడి నిర్లక్ష్యం!

ABN , Publish Date - Apr 20 , 2025 | 12:43 AM

మండలంలోని బంగారమ్మపేట పంచాయతీ శివారు గుమ్మళ్లపాలెం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల తొమ్మిదేళ్లుగా పూరిపాకలో కొనసాగుతోంది. ఎటువంటి వసతులు లేకుండా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ఎప్పటికి ఈ పాఠశాలకు శాశ్వత భవనం సమకూరుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఏళ్ల తరబడి నిర్లక్ష్యం!
పూరిపాకలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయిని లక్ష్మి

- శ్లాబు లీకేజీ కారణంగా తొమ్మిదేళ్ల క్రితం గుమ్మళ్లపాలెం పాఠశాల భవనం కూల్చివేత

- కొత్త భవనం నిర్మాణానికి విడుదలైన నిధులు పక్కదారి..

- పూరిపాకలోనే కొనసాగుతున్న పాఠశాల

- వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

కొయ్యూరు ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని బంగారమ్మపేట పంచాయతీ శివారు గుమ్మళ్లపాలెం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల తొమ్మిదేళ్లుగా పూరిపాకలో కొనసాగుతోంది. ఎటువంటి వసతులు లేకుండా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ఎప్పటికి ఈ పాఠశాలకు శాశ్వత భవనం సమకూరుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

గతంలో ఈ పాఠశాల భవనం శ్లాబ్‌ లీకవుతుండడంతో 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో కొత్త భవనం నిర్మాణానికి సర్వశిక్ష అభియాన్‌ నుంచి రూ.10 లక్షలు మంజూరయ్యాయి. అయితే ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పాత భవనాన్ని కూల్చి వేసి దానికి సంబంధించిన ఇనుము, తలుపులు, ఇతర సామగ్రి తరలించేశారు. కానీ కొత్త భవన నిర్మాణం ప్రారంభించలేదు. ఆ నిధులు ఏమయ్యాయో ఇప్పటికీ లెక్క తేలలేదు. అయితే ఉపాధ్యాయిని చొరవతో గ్రామస్థులు పాఠశాలకు పాక ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పాఠశాల ఇందులోనే కొనసాగుతోంది. ప్రస్తుతం 14 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు. బెంచీలు లేకపోవడంతో నేలపైనే కూర్చోవలసిన దుస్థితి నెలకొంది. వర్షాలు పడినప్పుడు వీరి పరిస్థితి దారుణంగా ఉంటోంది. ఈ పాఠశాలకు భవనాన్ని నిర్మించాలని గ్రామస్థులు పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులను వేడుకుంటున్నా ఫలితం లేకపోయింది. వర్షాకాలంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయిని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి సెలవుల్లోనైనా పాఠశాల భవన నిర్మాణం చేపట్టాలని, లేకుంటే ఆందోళన చేస్తామని విద్యా కమిటి చైర్మన్‌ మాతే బాలయ్య హెచ్చరించారు. దీనిపై ఎంఈవో రాంబాబు వివరణ కోరగా గతంలో ఈ పాఠశాల భవనానికి మంజూరైన నిధులపై వివరాలు తీసుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, భవన నిర్మాణానికి ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదించామని ఆయన తెలిపారు.

Updated Date - Apr 20 , 2025 | 12:43 AM