Share News

వాక రోడ్డుపై వైసీపీ యాగీ

ABN , Publish Date - Jul 18 , 2025 | 01:11 AM

‘మేం అధికారంలో వున్నప్పుడు అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు అధికారంలో వున్న మీరు (కూటమి) కూడా అభివృద్ధి పనులు చేయడానికి వీల్లేదు’’ అన్నట్టుగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. మాకవరపాలెం మండలం ఎరకన్నపాలెం నుంచి ఎలమంచిలి వద్ద జాతీయ రహదారి వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న రెండు వరుసల నూతన రహదారిపై (వాక రోడ్డు) ఆ పార్టీ నేతలు నానా యాగీ చేస్తున్నారు.

వాక రోడ్డుపై వైసీపీ యాగీ
రెవెన్యూ శాఖ భూమిలో రోడ్డు నిర్మాణం కోసం తుప్పలు తొలగించి చదును చేసిన దృశ్యం

అటవీ శాఖ భూమి అంటూ మాజీ ఎమ్మెల్యే గణేశ్‌ వితండ వాదన

ఏకంగా జిల్లా కలెక్టర్‌పైనే పోలీసులకు ఫిర్యాదు

ఇది ముమ్మాటికీ రెవెన్యూ భూమి అని టీడీపీ నేతలు విస్పష్టం

1967లోనే అటవీ శాఖ డీనోటిఫై చేసినట్టు వెల్లడి

మూడేళ్ల క్రితం రెవెన్యూ శాఖకు నివేదిక

అభివృద్ధిని అడ్డుకోవడానికేనని తీవ్రస్థాయిలో ధ్వజం

మాకవరపాలెం, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ‘మేం అధికారంలో వున్నప్పుడు అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు అధికారంలో వున్న మీరు (కూటమి) కూడా అభివృద్ధి పనులు చేయడానికి వీల్లేదు’’ అన్నట్టుగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. మాకవరపాలెం మండలం ఎరకన్నపాలెం నుంచి ఎలమంచిలి వద్ద జాతీయ రహదారి వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న రెండు వరుసల నూతన రహదారిపై (వాక రోడ్డు) ఆ పార్టీ నేతలు నానా యాగీ చేస్తున్నారు. ఎరకన్నపాలెం నుంచి పెదపల్లి వద్ద హైవే వరకు చేపట్టిన మట్టి రోడ్డు పనులను నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే గణేశ్‌తోపాటు పలువురు వైసీపీ నాయకులు గురువారం పరిశీలించారు. ఈ రోడ్డు నిర్మాణ పనులను ఏ శాఖ చేపడుతున్నది? ఎంత ఖర్చు అవుతుంది? రిజర్వు ఫారెస్టు భూముల్లో నుంచి రోడ్డు నిర్మాణం చేపట్టవచ్చా?.. వీటికి కలెక్టర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. విచిత్రం ఏమిటంటే.. రోడ్డు నిర్మాణం విషయంలో జిల్లా కలెక్టర్‌పై స్ధానికుల పోలీసులకు ఫిర్యాదు చేసి, తహసీల్దార్‌ వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో వాక రోడ్డుకు వచ్చి పరిశీలించారు. రెవెన్యూ శాఖకు చెందిన భూమిలో రోడ్డు వేస్తుంటే ఆయనకు (మాజీ ఎమ్మెల్యే గణేశ్‌) ఉలికిపాటు ఎందుకు అని టీడీపీకి చెందిన పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు అల్లు రామునాయుడుతోపాటు రైతులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాచపల్లి రెవెన్యూ పరిధిలోని 737 సర్వే నంబరులో 1,500 ఎకరాల ప్రభుత్వ ఉందని, ఈ భూమి గుండా ఎరకన్నపాలెం నుంచి ఎలమంచిలి సమీపంలోని పెదపల్లి వరకు కాలిబాట (వాక రోడ్డు) ఉన్నట్టు 1967లోనే అటవీ శాఖ డీనోటిఫై చేసిందని గుర్తు చేశారు. కాలిబాటకు ఇరువైపులా వున్న 1,500 ఎకరాల భూమి రెవెన్యూ శాఖకు చెందినదిగా 2022వ సంవత్సరంలో అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులకు నివేదిక అందజేశారని చెప్పారు. ప్రస్తుతం ఈ సర్వే నంబరులో వున్న రెవెన్యూ భూమిలో సాగుదారులను గుర్తించేందుకు అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. నర్సీపట్నం నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా రెవెన్యూ శాఖ భూమిని, అటవీ శాఖ భూమిగా చెప్పడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాక రోడ్డు నిర్మాణం చేపట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని, తద్వారా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నట్టు వారు చెప్పారు.

Updated Date - Jul 18 , 2025 | 01:11 AM