నడిరోడ్డుపై వైసీపీ సభ
ABN , Publish Date - Dec 16 , 2025 | 01:25 AM
నగరంలోని మద్దిలపాలెం కూడలిలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగ సభ నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది.
అనుమతి లేకుండా నిర్వహణ
భారీగా నిలిచిపోయిన వాహనాలు
ఇబ్బందిపడిన ప్రయాణికులు
మద్దిలపాలెం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని మద్దిలపాలెం కూడలిలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగ సభ నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వైసీపీ అనుమతి లేకుండా బహిరంగ సభ నిర్వహించడంతో ఈ సమస్య తలెత్తింది.
వైసీపీ పోరుబాటలో భాగంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా రామటాకీస్ రోడ్డులో మద్దిలపాలెం చేరుకున్నారు. కూడలిలో తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి వెళ్లిపోవాల్సి ఉండగా, బహిరంగ సభ నిర్వహించారు. నేతలు గంటల తరబడి ప్రసంగించారు. దీంతో ముఖ్యంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు నుంచి మద్దిలపాలెం వైపు వచ్చే వాహనాలు రెండు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. అనుమతి లేకుండా సభ ఏర్పాటుచేసినా ఆపకుండా పోలీసులు చోద్యం చూశారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోతున్నా ర్యాలీని ముందుకు కదిపే ప్రయత్నం చేయలేదు. హైవేపై వాహనాలు నిలిచిపోతున్నా స్పందించలేదు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకూ రోడ్డు మీద వాహనాలు నిలిచిపోవడంతో చివరకు ఈస్ట్, ద్వారకా జోన్ ట్రాఫిక్ సీఐలు కలుగజేసుకుని తమ సిబ్బందితో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను మళ్లించారు. ఈలోపు వైసీపీ ర్యాలీ కదలడంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.