Share News

ఆటోనగర్‌పైనా వైసీపీ అక్కసు!

ABN , Publish Date - Jun 30 , 2025 | 12:40 AM

ఆనందపురం మండలం కణమాంలో ఆటోనగర్‌ ఏర్పాటుకు ఏపీఐఐసీ ఇచ్చిన నిధుల నుంచి సుమారు రూ.12 కోట్లను గత ప్రభుత్వ హయాంలో దారి మళ్లించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఆటోనగర్‌పైనా వైసీపీ అక్కసు!

  • పరిహారం పంపిణీ నిధులు దారి మళ్లింపు

  • రైతులకు రూ.11.09 కోట్లు బకాయిలు

  • ఆనందపురం మండలం కణమాంలో ఆటోనగర్‌ ఏర్పాటుకు గత టీడీపీ ప్రభుత్వం చర్యలు

  • గ్రామంలోని సర్వేనంబరు 50లో 157.7 ఎకరాలు సేకరించాలని నిర్ణయం

  • పరిహారం కోసం కలెక్టర్‌ ఖాతాకు రూ.32.64 కోట్లు జమ చేసిన ఏపీఐఐసీ

  • ఆ నిధులను దారి మళ్లించిన వైసీపీ ప్రభుత్వం

  • ఆరేళ్లుగా ముందుకు సాగని పనులు

  • జాబితాలో బినామీలపై విచారణకు సర్పంచ్‌ డిమాండ్‌

విశాఖపట్నం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి):

ఆనందపురం మండలం కణమాంలో ఆటోనగర్‌ ఏర్పాటుకు ఏపీఐఐసీ ఇచ్చిన నిధుల నుంచి సుమారు రూ.12 కోట్లను గత ప్రభుత్వ హయాంలో దారి మళ్లించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో రైతులకు చెల్లించేందుకు నిధుల కొరత ఏర్పడింది. దీంతో పాటు రైతులకు పరిహారం పంపిణీ జాబితాలో బినామీల పేర్లు చేర్చారని, దీనిపై విచారణ చేపట్టాలని గ్రామ సర్పంచ్‌ తాజాగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.

ఆనందపురం మండలం కణమాం గ్రామం సర్వేనంబరు 50లో 200 ఎకరాల కొండ, దానికి ఆనుకుని ఉన్న వాలు ప్రాంతంలో 157.7 ఎకరాల్లో ఆటోనగర్‌ ఏర్పాటుకు 2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి అనుగుణంగా కొండవాలు ప్రాంతంలో 157.7 ఎకరాల్లో ఉన్న రైతుల వివరాలు సేకరించారు. డీపట్టా ఉంటే ఎకరాకు రూ.49 లక్షలు, రైతు ఆధీనంలో ఉండి రెవెన్యూ రికార్డుల్లో నమోదైతే రూ.19 లక్షలు, రెవెన్యూ రికార్డుల్లో నమోదుకానప్పటికీ రైతుల ఆధీనంలో ఉంటే ఎకరాకు రూ.తొమ్మిది లక్షు చొప్పున పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. ఆటోనగర్‌ ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన బాధ్యతలను ఏపీఐఐసీకి అప్పగించారు. దీనికి అనుగుణంగా ఏపీఐఐసీ జిల్లా కలెక్టర్‌ సీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాకు రూ.32.64 కోట్లు జమ చేసింది. దీంతో సర్వేనంబరు 50లోని 157.7 ఎకరాల్లో ఉన్న రైతులను రెవెన్యూ అధికారులు గుర్తించి జాబితా సిద్ధంచేశారు. వీరికి పరిహారం కోసం సుమారు రూ.20 కోట్లు డ్రాచేశారు. రైతులకు మూడు కేటగిరీల వారీగా నగదు పంపిణీచేశారు. దీనిపై వైసీపీ నేతలు ఏడాదిన్నర క్రితం కణమాంలో విజయోత్సవ సభ కూడా నిర్వహించారు. అయితే రైతులకు చెల్లించాల్సిన రూ.11.09 కోట్లు తరువాత ఇస్తామని చెప్పి, ఆ విషయమే మర్చిపోయారు. ఏపీఐఐసీ డిపాజిట్‌ చేసిన మొత్తం రూ.32.64 కోట్లు రైతులకు పరిహారం ఇచ్చేందుకు సరిపోతాయి. కానీ గత ప్రభుత్వం సీఎంఎఫ్‌ఎస్‌కు జమ చేసిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించింది.

వెలుగులోకి రాని వాస్తవాలు

ఈ విషయంపై అప్పట్లో పాలకులు, రెవెన్యూ అధికారులు వాస్తవాలు బయటపెట్టలేదు. అయినా ఆటోనగర్‌ ఏర్పాటుకు పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు రావడంతో పరిహారం అందని రైతులు ఏపీఐఐసీ అఽధికారులను అడ్డుకున్నారు. ఈలోగా ఎన్నికలు వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో ఆటోనగర్‌ ఏర్పాటుపై సంబంధిత అసోసియేషన్‌ సభ్యులు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. దీంతో ఉన్నతస్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సూచన మేరకు రైతులకు ఇవ్వాల్సిన పెండింగ్‌ పరిహారం కోసం సీఎఫ్‌ఎంఎస్‌ నుంచి డ్రాచేయడానికి బిల్లు (నంబరు-169977) అప్‌లోడ్‌ చేశారు. అయితే పరిహారానికి సంబంధించిన ఖాతాలో సొమ్ములు ఇతర అవసరాలకు మళ్లించడంతో బిల్లు పెండింగ్‌లో పడిపోయింది. ఇదే సమయంలో ఆటోనగర్‌ అసోసియేషన్‌ ఏపీఐఐసీ అధికారులను కలిసి పరిహారం పంపిణీ, ఆటోనగర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే రైతులకు ఇవ్వాల్సిన రూ.32.64 కోట్లు కలెక్టర్‌ ఖాతాలో డిపాజిట్‌ చేశామని నివేదిస్తూ అసోసియేషన్‌కు ఏపీఐఐసీ జోనల్‌ మేనేజరు లేఖ పంపారు. అర్హత గల రైతులకు పరిహారం పంపిణీ కోసం రెవెన్యూ అధికారులు పెట్టిన బిల్లు సీఎఫ్‌ఎంఎస్‌ వద్ద పెండింగ్‌లో ఉందని వివరించారు. రైతులకు పరిహారం చెల్లించిన తరువాత భూమి స్వాధీనం చేసుకుని ఆటోనగర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు

అయితే రైతులకు చెల్లించిన పరిహారంలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ చేపట్టాలని గ్రామ సర్పంచ్‌ ఆబోతు అప్పలరాము ఇటీవల జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. సర్వేనంబరు 50లో 157 ఎకరాలను రైతుల నుంచి సేకరించారని, వైసీపీ ప్రభుత్వంలో కొందరు నాయకులు, రెవెన్యూ అధికారులు జాబితా నుంచి అర్హుల పేర్లు తొలగించి వైసీపీ సానుభూతిపరులను చేర్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్హులకు అందాల్సిన సుమారు 14 కోట్ల పరిహారం స్వాహా చేశారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.

Updated Date - Jun 30 , 2025 | 12:40 AM