Share News

పొల్లూరు యూనిట్ల పనులకు శ్రీకారం

ABN , Publish Date - Dec 02 , 2025 | 11:23 PM

సీలేరు కాంప్లెక్సు పరిధిలోని పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న 5, 6 యూనిట్లలో వాటర్‌ కండక్టర్‌ సిస్టం ఏర్పాటు పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు.

పొల్లూరు యూనిట్ల పనులకు శ్రీకారం
ఫోర్‌బే ఇంటెక్‌ డ్యాం వద్ద నీటిమట్టాన్ని పరిశీలిస్తున్న జెన్‌కో అధికారులు

కొత్తగా నిర్మిస్తున్న 5, 6 యూనిట్లలో వాటర్‌ కండక్టర్‌ సిస్టం ఏర్పాటుకు చర్యలు

సీలేరు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు పరిధిలోని పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న 5, 6 యూనిట్లలో వాటర్‌ కండక్టర్‌ సిస్టం ఏర్పాటు పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఉదయం డొంకరాయి నుంచి కెనాల్‌ నీటి విడుదలను నిలిపివేశామని సీలేరు కాంప్లెక్సు చీఫ్‌ ఇంజనీర్‌ కేవీ రాజారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫోర్‌బే ఇంటెక్‌ డ్యాం వద్ద జాన్‌ అండర్‌ వాటర్‌ డైవింగ్‌ బృందంతో గేట్లను దించి పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రానికి నీరు వెళ్లకుండా చర్యలు చేపట్టామన్నారు. బుధవారం ఇంటెక్‌ డ్యాం దిగువన 5.5 కిలోమీటర్ల పొడవున గల టన్నెల్‌ గేట్లను కూడా అండర్‌ వాటర్‌ డైవింగ్‌ బృందం దించిన తరువాత ఎటువంటి లీకేజీలు లేకుండా సీల్‌ వేస్తారని, అనంతర టన్నెల వద్ద అవుట్‌లెట్‌ నుంచి 5, 6 యూనిట్లకు నీరు పంపించడానికి అవసరమైన కండక్టర్‌ సిస్టం పనులు ప్రారంభించడానికి పీఈఎస్‌ కంపెనీ నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఇంటెక్‌ డ్యాం వద్ద సీఈ రాజారావు ఆధ్వర్యంలో పూజలు చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ విద్యుత్‌ సౌధా హైడల్‌ సీఈ రవీంద్రరెడ్డి, ఎస్‌ఈలు (సివిల్‌) శ్రీనివాసరెడ్డి, చిన్నకామేశ్వరరావు, ఈఈలు బాలకృష్ణ, నాగశ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

నిలిచిన విద్యుదుత్పత్తి

పొల్లూరు 5, 6 యూనిట్లకు నీటి సరఫరా పనుల కోసం కెనాల్‌ నుంచి నీటి విడుదలను నిలిపివేయడంతో మంగళవారం ఉదయం నుంచి పొల్లూరు, డొంకరాయి జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని నిలిపివేశారు.

Updated Date - Dec 02 , 2025 | 11:23 PM